సంక్రాంతి 2025: మూడు పెద్ద సినిమాలతో  దిల్ రాజు, తనకు తనే పోటీ
x

సంక్రాంతి 2025: మూడు పెద్ద సినిమాలతో దిల్ రాజు, తనకు తనే పోటీ

మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలు, అలాగే పెద్ద హీరోల సినిమాలు. ఈ పండుగ మూడు రోజులు కొత్త అల్లుళ్ల హంగామా ఓ పక్కన కొత్త సినిమాల హంగామా


మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటే కోడిపందాలు, అలాగే పెద్ద హీరోల సినిమాలు. ఈ పండుగ మూడు రోజులు కొత్త అల్లుళ్ల హంగామా ఓ పక్కన కొత్త సినిమాల హంగామా మరో ప్రక్క నడుస్తుంటుంది. ఎలాంటి సినిమా వచ్చినా ఏ మాత్రం కొద్దిగా బాగున్నా హౌస్ ఫుల్ అయిపోతాయి. అందుకే స్టార్స్ అందరూ పట్టుబట్టి మరీ సంక్రాంతికి రావడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. నిర్మాతలు సైతం తమ సినిమాలు సంక్రాంతికి వచ్చాయంటే బాక్స్ బ్రద్దలైపోతుందనే నమ్మకం పెట్టుకుంటారు. ప్రతి ఏడాది మాదిరిగానే, ఈసారి కూడా చాలా సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచేందుకు ముస్తాబు అవుతున్నాయి. అయితే ఈ సారి సంక్రాంతికి దిల్ రాజు మూడు పెద్ద సినిమాలతో వస్తున్నాడు. అంటే తన సినిమాలు తనకే పోటీ అన్నమాట. ఇది అరుదైన సందర్భం. ఆ మూడు సినిమాలు ఏమిటి..ఎందుకు ఆ పరిస్థితి క్రియేట్ అయ్యింది.

ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ప్రస్తుతానికి రామ్‌చరణ్ 'గేమ్ ఛేంజర్', బాలకృష్ణ 'డాకూ మహారాజ్', వెంకటేశ్​ 'సంక్రాంతికి వస్తున్నాం', సందీప్ కిషన్ 'మజాకా' సినిమాలు రేసులో ఉన్నట్లు క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఇవన్నీ కూడా షూటింగ్, పోస్ట్​ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్ల వందల కోట్ల డబ్బు సంక్రాంతికి జూదం రీతిలో ప్రేక్షకుల నిర్ణయంపై ఆధారపడి నడుస్తుంది. ముఖ్యంగా 2025 సంక్రాంతి సీజన్‌లో ఇద్దరు కీలకం కానున్నారు.

సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజుకి చెందినవే కావడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారిన విషయం. 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రాలకు దిల్ రాజు నిర్మాత. అలాగే 'డాకూ మహారాజ్' మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజుకి 2024వ ఏడాది పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఆయన నిర్మాతగా 'ఫ్యామిలీ స్టార్', 'లవ్ మీ', 'జనక అయితే గనక' సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి. అలానే నైజాంలో మహేష్ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో వచ్చిన 'గుంటూరు కారం' మూవీకి డిస్ట్రిబ్యూషన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అది కూడా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందించలేదు. ఇప్పుడు దిల్‌ రాజుకు 'గేమ్ ఛేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం', 'డాకూ మహారాజ్ ' విజయాలు చాలా కీలకం. ఇలాంటి కీలకమైన సిట్యువేషన్ లో దిల్ రాజు ఎందుకు ఒకేసారి మూడు సినిమాలను దింపుతున్నారు.

దిల్ రాజు కు ప్రధానంగా భారీ బడ్జెట్‌ సినిమా 'గేమ్ ఛేంజర్' సక్సెస్‌ అవ్వడం ముఖ్యం. ఈ సినిమాపై చాలా పెట్టుబడి పెట్టారు. భారీ ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేశారు. సినిమాపై ఓ రేంజిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఆ సినిమాపైనే కాన్సర్ లేట్ చేయకుండా దిల్ రాజు మరో సినిమాలు ఎందుకు ఇదే సంక్రాంతికి తీసుకువస్తున్నారు. అంటే పరిస్థితులు అలా కలిసి వచ్చాయి మరి.

వాస్తవానికి చిరంజీవి విశ్వంభరను సైడ్ చేయించి.. గేమ్ చేంజర్‌ను బరిలోకి దించుతున్నాడు దిల్ రాజు. అయితే అనీల్ రావిపూడి, వెంకటేష్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో సంక్రాంతి రిలీజ్ డిసైడ్ చేయాల్సి వచ్చిందని సమాచారం. అనిల్ రావిపూడి సంక్రాంతికి వచ్చి హిట్ కొడుతున్నాడు. దిల్ రాజు, అనిల్ రావిపూడి, వెంకీ మామ ఎఫ్ 2 అంటూ సంక్రాంతికి వచ్చి మంచి హిట్టు కొట్టారు. ఇప్పుడు వెంకీ మామ, అనిల్ రావిపూడి కాంబోలో మూడో సినిమా రూపు దిద్దుకుంటుంది. అయినా గేమ్ ఛేంజర్ కు పోటీగా ఆ సినిమాని తే కూడదనుకున్నారు. కానీ వెంకటేష్ సీన్ లోకి వచ్చి స్వయంగా దిల్ రాజు పై ప్రెజర్ పెట్టి మరీ సంక్రాంతి రిలీజ్ కు ఒప్పించినట్లు తెలుస్తోంది. దిల్ రాజు కనుక సంక్రాంతికి రిలీజ్ చేయకపోతే సురేష్ ప్రొడక్షన్స్ కు ఆ సినిమాని ట్రాన్స్ఫర్ చేసి రిలీజ్ చేస్తామని అడిగినట్లు సమాచారం. దాంతో వేరే దారి లేక దిల్ రాజు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. బాలయ్య,బాబీ మూవీ కూడా సంక్రాంతికి రాబోతోంది. డాకూ మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాత నాగవంశీ. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. సితార బ్యానర్ నుంచి వస్తున్న సినిమాలు నైజాం డిస్ట్రిబ్యూషన్ మొత్తం దిల్ రాజు చూస్తున్నారు. దానికి తోడు బాలయ్యతో రిలేషన్స్ ముఖ్యం. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ తో పనులు అవ్వాలంటే బాలయ్య సాయం తప్పనిసరి. ముఖ్యంగా తన సినిమాలకు ఆంధ్రాలో రేట్లు పెంపుకు బాలయ్య ద్వారానే వెళ్తున్నట్లు సమాచారం. దాంతో కచ్చితంగా నైజాంలో దిల్ రాజు...డాకూ మహారాజ్ చిత్రం మంచి థియేటర్స్ తో రిలీజ్ చేయాలి.

ఇలా దిల్ రాజు సంక్రాంతికి మూడు సినిమాలతో ముందుకు వస్తున్నారు. దాంతో థియేటర్స్ మొత్తం ఆక్యుపై అయిపోతాయి. ఇలాంటప్పుడే వివాదాలు వస్తూంటాయి. సాధారణంగా సంక్రాంతి సీజన్ వస్తుందంటే ప్రతీ సారి ఇండస్ట్రీలో చూపు దిల్ రాజు వైపు వెళ్తుంటుంది. ఆయన డబ్బింగ్ చిత్రాలు, తన చిత్రాలను సంక్రాంతి రేసులో పెడుతుంటాడు. వారిసు (వారసుడు) టైం లో ఎంత పెద్ద వివాదం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాగే ఈ సంక్రాంతి సీజన్‌లోనూ వివాదం తలెత్తేలా ఉందంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.. ఆల్రెడీ గేమ్ చేంజర్‌ను జనవరి 10న దించబోతోన్నట్టుగా ప్రకటించారు. 11 లేదా 12 న బాబీ, బాలయ్య ప్రాజెక్ట్ వచ్చేలా ఉంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఎలాగో ఉంది.

Read More
Next Story