
సంక్రాంతి 2026: మెగా మాస్ మహాసంగ్రామం
గెలుపు ఎవరిది?!
సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు...
టాలీవుడ్‌లో అది యుద్ధభూమి.
ఇక్కడ కథల కంటే ముందు కలెక్షన్లు కథలు చెబుతాయి, ఫ్లెక్సీల కంటే ముందు ఫ్యాన్స్ ఊసులు వినిపిస్తాయి.
ఇప్పుడు... 2026 సంక్రాంతి క్లాష్ కూడా అంతే సీరియస్‌గా మారనుంది!
మెగాస్టార్ మొదట స్టేజ్ ఎక్కాడు!
చిరంజీవి – అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ హైలీ ఎంటర్‌టైనింగ్ ప్రాజెక్ట్‌తో సంక్రాంతి 2026 రిలీజ్‌ను ముందుగానే లాక్ చేసుకున్నారు.
టైటిల్ ఇంకా రాలేకపోయినా, హైప్ మాత్రం ఆకాశాన్నంటుతోంది. చిరంజీవి స్టైల్‌లో ఫన్, మాస్, ఎమోషన్ – అన్నీ మిక్స్ అయ్యే మూవీకి ఓ టెంప్టింగ్ ఫ్యామిలీ ప్యాక్ టచ్ రావొచ్చని ఇండస్ట్రీలో చర్చ.
ఈ సినిమాని గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీలో శంకర్ వరప్రసాద్ అనే పాత్రలో చిరంజీవి సందడి చేయనున్నారు. ఇందులో చిరంజీవి తనలోని కామెడీ టైమింగ్‌తో పాటు యాక్షన్, భావోద్వేగాలతో మంచి వినోదాన్ని పంచుతారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్టు టాక్ ఉంది. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు.
అనిల్ రావిపూడి బలమే కామెడీ.. ఇక చిరంజీవి కామెడి టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరు కలిసి ఓ కామెడీ సినిమా చేస్తున్నారంటే..దానిపై కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్టే సినిమా రెడీ చేస్తున్నాడట అనిల్. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించబోతున్నారట. చిరంజీవిని కంప్లీట్ ఫ్యామిలీమెన్‌గా చూపించబోతున్నారట. చిరంజీవి వయసు తగ్గట్టుగానే పాత్రను రాసుకున్నారని తెలుస్తోంది.
విజయ్ – “జననాయకన్”తో బాక్సాఫీస్ రచ్చ!
తమిళ స్టార్ థలపతి విజయ్, పొలిటికల్ థ్రిల్లర్ జననాయకన్ ని సంక్రాంతికి రెడీ చేస్తున్నారు. విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో సినిమాలకు గుడ్ బై చెబుతున్నారు. కాగా ప్రస్తుతం నటిస్తున్న జననాయకన్ చిత్రమే విజయ్‌కి చివరి చిత్రం. నటి పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఇందులో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెచ్ వినోద్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
కెవిఎన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తి చేసుకుంది. శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో నటుడు విజయ్ ఈ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. సమకాలీన రాజకీయాలను ఆవిష్కరించే కథాచిత్రంగా జననాయకన్ ఉంటుందని సమాచారం.
ఈ చిత్రాన్ని 2026 పొంగల్ సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతల వర్గం ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. తెలుగు ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకునేలా ఈసారి కథ, డబ్బింగ్, ప్రమోషన్ అన్ని ప్లాన్ అవుతున్నాయంటూ బజ్ నడుస్తోంది.
బాలయ్య – తాండవం ముందస్తు సంకేతాలు!
అధికారిక ప్రకటన ఇంకా పెండింగ్‌లో ఉన్నా, బాలకృష్ణ తన మాస్ మ్యాజిక్‌తో మరో సంక్రాంతి బరిలోకి దిగేలా అన్ని సంకేతాలు కనిపిస్తున్నాయి. “అఖండ 2: తాండవం”, మొదట దసరా 2025కి రిలీజ్ అనుకున్నా, షూటింగ్ ఆలస్యం, భారీ విజువల్స్‌తో కూడిన వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా, ఇప్పుడు ఇది సంక్రాంతి 2026కి మారే అవకాశాలు బలంగా ఉన్నాయంటూ సన్నిహిత వర్గాల మాట.
ఈ సినిమా విషయానికొస్తే, 14రీల్స్ ప్లస్ పతాకంపై అఖండ 2 రూపుదిద్దుకుంటోంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే బాలయ్య-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి విజయాలు సాధించాయి. అలా వచ్చిన అఖండ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఆ సినిమాకు సీక్వెల్‌ను ప్లాన్ చేశారు మేకర్స్.
ఈ సినిమా గురించి మరో వార్త ప్రచారంలో ఉంది. అఖండ 2లో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయ నాయకురాలి పాత్రలో ఆమె కనిపించనున్నారట. అయితే ఈ విషయంపై కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
2023 నాటి రచ్చే రిపీట్ !
2023 సంక్రాంతి సీజన్‌లో వాల్తేర్ వీరయ్య (చిరు), వీరసింహా రెడ్డి (బాలయ్య), వారసుడు (విజయ్) – ఈ ముగ్గురు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీబడ్డారు! అందులో చిరంజీవి గెలిచారు. ఆయన చేసిన వాల్తేర్ వీరయ్య చిత్రం భారీగా వర్కవుట్ అయ్యింది. వీరసింహారెడ్డి సోసో అనిపించుకుంది. వారసుడు డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ 2026 సంక్రాంతిలో… మళ్ళీ అదే ముగ్గురు మధ్యే పోటీ!
ఇప్పుడు బాలయ్యకు అదే ఓటమికి ప్రతీకారం తీర్చుకునే ఛాన్స్. అయితే ఇక్కడ ఓ మెలిక ఉంది. అనిల్ రావిపూడి డైరక్షన్ కు సంక్రాంతిలో ఓడిన చరిత్రలేదు! ఇది అంత సులభం కాదు.
ఫైనల్ హోప్: ముగ్గురూ గెలవాలి!
ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ధూమ్ థామ్ చేస్తూ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్లు – అందరికీ లాభాలు పంచాలని ఇండస్ట్రీ మొత్తం ఆశిస్తోంది.
ఇది బాక్సాఫీస్ యుద్ధం కాదు –
ఇది ఒక పెద్ద సినిమాటిక్ సంబరం!!