సూపర్ హిట్ కామెడీ: సర్వం మాయ రివ్యూ
x

సూపర్ హిట్ కామెడీ: 'సర్వం మాయ' రివ్యూ

నవ్వించిందా? కన్నీళ్లు తెప్పించిందా?


అనగనగా నంబూద్రి ఫ్యామిలీకి చెందిన యువకుడు ప్రభేందు(నివిన్ పౌలీ). అతనో నాస్తికుడు. దాంతో అతనికి తన కుటుంబ వృత్తి అయిన పౌరోహిత్యం అంటే గిట్టదు. సంగీతం అంటే ప్రాణం. దాంతో గిటార్ వాయిస్తూ విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో వీసా రాక మళ్ళీ తన ఊరికే వస్తాడు. చేతిలో రోజు వారి ఖర్చులకు కూడా రూపాయి ఆడకపోవటంతో వేరే దారిలేక తన బావ రూపేశ్‌ (అజు వర్గీస్) నంబూద్రితో కలిసి పౌరోహిత్యంలోకి దిగుతాడు. ఆ క్రమంలో ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్ని వదిలించటానికి వెళ్లి సక్సెస్ అవుతాడు.

అయితే ఆ తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభా వెంటపడటం మొదలెడుతుంది. ప్రభేందుకి మాత్రమే కనిపిస్తూ, అతని సెల్ ఫోన్ వాడుకుంటు ఉంటుంది. అంతేకాదు మెల్లిగా మాట కలిపి అతడితోనే మాట్లాడుతుంటుంది. మొదట్లో ప్రబేంద్ర ఈ దెయ్యాన్ని చూసి భయపడినా తర్వాత అది భయపెట్టే దెయ్యం కాదని అర్దం చేసుకుంటాడు. వదిలించుకుందామని ట్రై చేసినా పని అవ్వకపోవటంతో దానితో స్నేహం చేస్తాడు.

ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఆ దెయ్యానికి.. తను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేమీ గుర్తుండవు. దాంతో ఆ దెయ్యానికి డెలులు అనే పేరు కూడా పెడతాడు. డెలులు వచ్చిన తర్వాత ప్రభా జీవితంలో మెల్లిగా కొన్ని మార్పులు చోటుచేసుకోవటం మొదలవుతాయి, ఇంతకీ ఈ దెయ్యం ఎవరో తెలిసిందా, చివరికి దెయ్యంతో ఈ పరిచయం ఎక్కడికి దారి తీసింది, ఫైనల్ గా ఏమైంది?తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

"ఒక మంచి కథ అంటే ప్రేక్షకుడు తన సొంత ఇంటిని చూస్తున్నట్లు అనుభూతి చెందాలి." — సత్యన్ అంతికాడ్ (Sathyan Anthikad), లెజెండరీ డైరెక్టర్. (ఈ డైరక్టర్ తండ్రి) చెప్పినట్లుగానే ఈ సినిమా సాగుతుంది. దర్శకుడిగా కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసినప్పటికీ, అఖిల్ సత్యన్ తనకంటూ ఒక ప్రత్యేకమైన 'స్టోరీ స్ట్రక్చర్'ను ఏర్పరచుకున్నారు. ప్రేక్షకులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా, మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే 'కంఫర్ట్ వాచ్' సినిమాలను అందించడమే తన లక్ష్యమన్నట్లుగా ఈ సినిమాలు సాగుతూంటాయి. అదే ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. హీరో, దెయ్యం మధ్య ఉండే ఫ్రెండ్లీ టాక్స్ కేవలం నవ్వును మాత్రమే కాకుండా ఒక రకమైన ఎమోషనల్ బాండింగ్‌ను కూడా క్రియేట్ చేస్తూండటం భలే బాగుంటుంది.

సాధారణంగా దెయ్యం అంటే తెల్ల చీర, భయంకరమైన అరుపులు గుర్తొస్తాయి. కానీ, తను చనిపోయానని తెలియక, మనుషుల కంటే ఎక్కువగా భయపడే ఒక 'అమాయకపు దెయ్యం' జనాల మధ్యలోకి వస్తే ఎలా ఉంటుంది? అనేదే ఈ సినిమా కాన్సెప్టు. చనిపోయిన తర్వాత తన 'గోస్ట్ స్టేటస్' గురించి తెలియక అయోమయ పడే దెయ్యం ఐడియా చాలా ఫ్రెష్‌గా ఉంది. దెయ్యం అంటే భయపెట్టడం మాత్రమే కాదు, అది కూడా ఒక మనిషిలా భయపడటం అనే పాయింట్ కొత్తగా అనిపిస్తుంది. అలాగే దర్శకుడు అఖిల్ సత్యన్ 'సింక్ సౌండ్' వాడటం వల్ల ఫాంటసీ కథ అయినా సరే మన పక్కింట్లో జరుగుతున్నంత సహజంగా అనిపిస్తుంది.

దానికి తగినట్లు Gen Z దెయ్యం కథ కావటంతో ఫన్ కి స్కోప్ దొరికింది. ఫుల్ కామెడీ అని చెప్పలేం కానీ బాగానే కామెడీ సీన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ సిట్యుయేషన్స్ నుండి పుట్టే హ్యూమర్ బాగానే నవ్విస్తుంది.

ఎక్కడ తడబడింది?

సినిమా కామెడీగా ఉన్నంత సేపు బాగున్నా, సెంటిమెంట్ సీక్వెన్స్ వచ్చేసరికి కొంచెం ఫోర్స్‌డ్‌గా అనిపిస్తుంది. సరదాగా సాగే కథలోకి ఒక్కసారిగా భారీ ఎమోషన్ జొప్పించడం వల్ల 'ఫీల్ గుడ్' ఫ్యాక్టర్ కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. 'బ్యాక్ స్టోరీ' సీన్స్ కాస్త 'ఫార్ములా'గా అనిపిస్తాయి. అలాగే కొన్ని సీన్లలో విజువల్స్ కంటే మాటల ద్వారా (Verbal Drama) కథను ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల స్పీడు తగ్గుతుంది. హీరో జీవితంలో వచ్చిన మార్పుల గురించి దర్శకుడు అతిగా చెప్పినట్టు అనిపిస్తుంది.

టెక్నికల్ గా...

నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్ వీళ్లు ముగ్గురూ సినిమాను పూర్తిగా మోసేసారు. అలాగే టెక్నికల్ వాల్యూస్ బాగున్నాయి.

చూడచ్చా

సినిమా చూడటానికి ఫీల్ గుడ్ లవ్ స్టోరీగానూ, ఆరోగ్యకరమైన కామెడీగానూ ఉంది. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడచ్చు.

ఎక్కడ చూడచ్చు

జియో హాట్ స్టార్ లో తెలుగులో ఉందీ సినిమా.

Read More
Next Story