
అర్జున్ ‘సీతా పయనం’ మూవీ రివ్యూ
విలువలు సరే… కానీ ఎంటర్‌టైన్ చేస్తుందా?
సీత (ఐశ్వర్య అర్జున్) ఓ షెఫ్ . చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దాంతో అన్నీ తానై పెంచుతాడు తండ్రి రాజేంద్రప్రసాద్ (సత్యరాజ్). పెళ్లి వయస్సు వచ్చినా ఆ ఆలోచనకు ఇష్టపడదు. తను వెళ్లిపోతే తండ్రి ఒంటరి అయ్యిపోతాడని భయం. అయితే తండ్రికు మాత్రం పెళ్లి చేస్తే తన భాధ్యత తీరుతుందని ప్రెజర్ చేస్తూంటాడు. ఈ క్రమంలో వైజాగ్ లో ఉన్న ఆమె తన వృత్తికి చెందిన వర్క్ షాప్ కు హాజరవ్వాలనుకుంటుంది. అందుకోసం హైదరాబాద్ బయిలుదేరుతుంది. ఈ జర్నీలో అభి (నిరంజన్) పరిచయం అవుతాడు.
అభి తన కారు చెడిపోవటంతో ఆమెను లిప్ట్ అడుగుతాడు. ఆమె మొదట ఒప్పుకోకపోయినా కండీషన్స్ తో సరే అంటుంది. సరదాగా మొదలైన ఈ జర్నీ కొన్ని అనుకోని మలుపులు తిరుగుతుంది. కొన్ని సంఘటనలు జరుగుతాయి. కొందరు వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ క్రమంలో ఆమె కొన్ని జీవిత సత్యాలు తెలుసుకుంటుంది. అతనితో ప్రేమలో పడుతుంది. ఆ జీవిత సత్యం ఏమిటి..జర్నీలో పరిచయం అయ్యిన గిరి (అర్జున్), బసవన్న(ధృవ్ సర్జా) ,ప్రకాష్ రాజ్ ఎవరు, చివరకు ఆ ప్రయాణం దేనికి దారి తీసింది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
2010 లో 'ముంబై-పూణే-ముంబై' అనే మరాఠీ రొమాంటి కామెడీ వచ్చి సూపర్ హిట్టైంది. దానికి రెండు సీక్వెల్స్ కూడా వచ్చాయి. దాదాపు ఇలాంటి కథే. దీన్ని బేస్ చేసుకుని తెలుగులో ఆ మధ్యన ఓ సినిమా కూడా వచ్చింది. మళ్లీ ఇప్పుడీ సినిమా వచ్చింది. అయితే అప్పటికి ఓటిటిలు లేవు. కాబట్టి థియేటర్ కు ఇలాంటి సినిమాలకు వెళ్ళి జనం చూసే పరిస్దితి. మనకు ఇప్పుడు పరిస్దితి మారిపోయింది. థియేటర్ కు వెళ్లి చిన్న సినిమా చూడాలంటే మ్యాజిక్ జరగాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే..
ఒక దర్శకుడు సినిమా తీస్తాడు.
ఒక తండ్రి సినిమా తీస్తాడు.
ఈ రెండింటి మధ్య చాలా చిన్న తేడా ఉంటుంది… కానీ తెరపై మాత్రం అది చాలా పెద్దగా కనిపిస్తుంది. ‘సీతా పయనం’ ఆ రెండో కేటగిరీకి చెందిన సినిమా. దర్శకుడు అర్జున్ సర్జా ఈ చిత్రాన్ని కథగా కాదు… తన కూతురు ఐశ్వర్యకు ఇచ్చిన భావోద్వేగ బహుమతిగా తీర్చిదిద్దాడు. అదే ఈ సినిమాకు బలం కూడా… బలహీనత కూడా అయింది.
కథ – కొత్తది కాదు, భావం మాత్రం పాతదే కానీ నిజం
కథ పరంగా చూస్తే ‘సీతా పయనం’లో కొత్తదనం పెద్దగా కనిపించదు. తండ్రి-కూతురు బాండింగ్, పెళ్లి విషయంపై వారి మధ్య ఉన్న భావజాల వ్యత్యాసం, ఒక ప్రయాణం ద్వారా మారే మనసులు – ఇవన్నీ మనం ఎన్నో సినిమాల్లో చూసిన అంశాలే. అలాగే కథ అంతా ఒక రోడ్ జర్నీ చుట్టూ తిరుగుతుంది. రోడ్ మూవీ అంటే సాధారణంగా సంఘటనలు అనూహ్యంగా జరుగుతూ, పాత్రలు లోపల మారిపోవాలి. కానీ ఇక్కడ సంఘటనలు వస్తాయి… మార్పు చెప్పబడుతుంది… ఫీల్ మాత్రం పూర్తిగా మనకి చేరదు.
స్క్రీన్‌ప్లే – సమస్య మెసేజ్ కాదు… మెసేజ్‌ల సంఖ్య
ఈ సినిమాలో ప్రధాన లోపం స్టోరీ లైన్ కాదు. లైఫ్ జర్నీలో ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఒక సినిమాకి ఒక ప్రధాన ఎమోషన్ కావాలి. ఇక్కడ అర్జున్ సర్జా దాదాపు అన్ని ఎమోషన్స్ పెట్టాలని ప్రయత్నించాడు. తండ్రి-కూతురు బంధం, పెళ్లి గొప్పతనం, తల్లిదండ్రుల బాధ్యత, పిల్లల సంస్కారం, కుటుంబ విలువలు, మానవీయత, మంచి చేస్తే మంచే జరుగుతుంది అనే నీతి. అలా ఒక్కొక్కటి ఓ సినిమాకే సరిపడే అంశాలు. కానీ ఇవన్నీ ఒకే కథలో రావడంతో స్క్రీన్‌ప్లే ఫోకస్ కోల్పోయింది. కథ ముందుకు సాగాల్సిన చోట… సినిమా ఉపన్యాసంగా మారిపోతుంది. చూసే మనం కథను ఫీల్ అవ్వాలి. ఇక్కడ మాత్రం కథ మనకి మనం ఏమి ఫీల్ కావాలో వివరిస్తూ ముందుకు వెళ్తుంది.
అలాగే సినిమాలో ఒక విచిత్రమైన విషయం ఉంది. ఇక్కడ దాదాపు అందరూ మంచివాళ్లే. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు కూడా ఒక సీన్‌లో మారిపోతాయి. ఫలితం ఏమిటంటే… కథలో సంఘర్షణ (Conflict) పెద్దగా లేకుండా పోయింది. దాంతో డ్రామా క్రియేట్ కాలేదు. సంఘర్షణ బలహీనంగా ఉండటంతో భావోద్వేగం పూర్తిగా ప్రభావం చూపదు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉండాలనిపిస్తుంది కానీ మనసును బలంగా తాకదు. దానికి తోడు సంఘటనలు ముందే ఊహించగలిగేలా సాగుతాయి. అందుకే సహజత్వం తగ్గింది. సినిమా చూసేటప్పుడు ఆసక్తి కంటే ఓపిక ఎక్కువ అవసరం అవుతుంది. ఏదైమైనా కథ చెప్పి మెసేజ్ ఇస్తే బాగుండేది. మెసేజ్ చెప్పడానికి కథ వాడుకున్నట్టు అనిపించడం ‘సీతా పయనం’ అసలు సమస్య.
టెక్నికల్ గా ...
బాలమురుగన్ సినిమాటోగ్రఫీ బాగుంది. రోడ్ మూవీ ఫీల్‌ని సింపుల్‌గా, కమర్షియల్ స్టైల్‌లో చక్కగా చూపించాడు. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మాత్రం సాధారణం — పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ని పెద్దగా పెంచలేదు. ఆర్ట్, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
కానీ ఎడిటింగ్‌లో జర్క్స్ కనిపిస్తాయి; కాస్త కేర్ తీసుంటే ఇంకా స్మూత్‌గా ఉండేది.
నటీనటుల్లో ..
ఐశ్వర్యా అర్జున్ బాగా చేసింది. లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషనల్ సీన్స్‌లో మెచ్యూరిటీ కనిపించింది. నిరంజన్ ఓకే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, రెండు షేడ్స్‌ని బాగా చూపించాడు. సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ, సిరి హనుమంతులు తమ పాత్రలకు సరిపడా చేశారు. ధృవ్ సర్జా యాక్షన్ సీన్ బాగుంది కానీ కథతో పెద్దగా కనెక్ట్ కాక ఇరికించినట్టు అనిపిస్తుంది.
ఫైనల్ థాట్
కొత్త కథ, ట్విస్టులు, వేగం ఆశించే ప్రేక్షకులకు ఇది బోరింగ్‌గా అనిపించవచ్చు. కానీ కుటుంబంతో కలిసి ఓ ఫీల్-గుడ్ మూవీగా, విలువలను గుర్తు చేసే కథగా చూస్తే మాత్రం నచ్చే అవకాశముంది. ఓటిటిలో ఈ సినిమా వర్కవుట్ అయ్యే అవకాసం ఉంది.

