ఇంటిలోకి ప్రవేశించవద్దని నా భర్తకు ఆర్డరివ్వండి: నటి రాజసులోచన పిటిషన్
ప్రేమించి పెళ్లి చేసుకున్న సినీ నటులు తగాదాల విడిపోవడం ఇప్పుడు కొత్తేమీ కాదు. ఇలాంటి ఘటన 1960ల్లో కూడా జరిగింది. ఆ నటీనటులు ఎవరంటే..
ఇప్పుడే కాదు ఆ రోజుల్లోనూ సినిమాల్లో ఉంటూ ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఓ జంట గొడవలు పడి ఇలా పత్రికలకు ఎక్కింది. రూపవాణి పత్రిక అక్టోబర్ 1960 నాటి పత్రికలో వచ్చిన విషయం ఇది (యధాతథంగా...)
సినిమా నటి రాజసులోచన తన భర్తపై కోర్టులో పెట్టిన పిటిషన్ -రాజసులోచన భర్త పెట్టుకున్న కౌంటర్ పిటిషన్
'ఇంటిలో ప్రవేశించేందుకు నాకు అనుమతి నివ్వండి'
“నా భర్త నా ఇంటిలోపలకు ప్రవేశించరాదనే ఆర్డర్ జారీ చేయండి” అంటూ సినిమా నటి రాజసులోచన కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆమె కోరిక ప్రకారం నిషేధాజ్ఞ జారీ చేయబడింది, ఆ తర్వాత ఆమె పిటిషన్‌కు ప్రతిగా ఆమె భర్త పరమశివం “ఇంటిలో ప్రవేశించడానికి నాకు అనుమతి ఇవ్వండి” అని కౌంటర్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు.
రాజసులోచన
'మాంగల్య బలం' అనే అన్నపూర్ణ వారి చిత్రంలో, ఇటీవల వాహినీ వారి 'రాజమకుటం'లోనూ ఇంకా అనేక తెలుగు, తమిళ చిత్రాలలోనూ ఈమెను మీరు చూసే ఉంటారు.
కవలై ఇల్లాదె మనిదన్, సహోదరి, ఎంగళ్ వీట్లు మహాలక్ష్మి తదితర తమిళ చిత్రాలలోనూ నటించింది. ప్రస్తుతం కొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవలే ఈమె జపాన్‌లో పర్యటించి అక్కడ టెలివిజన్ ప్రోగ్రాంలో పాల్గొని స్వదేశానికి తిరిగి వచ్చింది.
లవ్ మ్యారేజి!
రాజసులోచన భర్త పేరు పరమశివం. 1931-వ సంవత్సరంలో వీరిద్దరికీ 'లవ్ మ్యారేజి' జరిగింది, అంటే పరస్పరం ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నారు. వీరికిప్పుడు 'శ్యాం' అనే ఒక కుమారుడున్నాడు.
'ఇంట్లోకి రాకూడదు'
మద్రాసు త్యాగరాయనగర్‌లోని గోపతి నారాయణ స్వామిరోడ్డు వద్దనున్న క్రిష్ణయ్యర్ కాలనీలో ఒక ఇంట్లో రాజసులోచన, పరమశివం నివసిస్తున్నారు. ఈ ఇంట్లోకి పరమశివం రాకూడదనే ఆంక్ష విధింపవలసినదిగా కోరుతూ అతని భార్య, సినిమా నటి రాజనులోచన కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకుంది.
ఈ పిటిషన్ పెట్టడానికి కారణమేమిటి?
ఈ దంపతుల మధ్య పోయిన మార్చి నెలలో కలతలు చెలరేగడంతో తగాదా జాస్తి అయిందనీ, రాజసులోచనపై దౌర్జన్యం చేసి దండిస్తానని పరమశివం భయ పెట్టినాడనీ, ఆమె రాజసులోచన.. పోలీసులకు ఫిర్యాదు చేసి రక్షణను కోరిందనీ తెలియవస్తూంది. ఇందువల్ల తన భర్త తన ఇంట్లో ప్రవేశించకుండా ఆర్డరు జారీ చేయించమని ఆమె కోర్టులో పిటిషన్ పెట్టుకుంది.
వివాహం రద్దుకు
తమ వివాహాన్ని రద్దు పరచవలసిందిగా కూడా అదే పిటీషన్‌లో ప్రార్థించినట్లు తెలుస్తూంది. ఈ పిటిషనును మదరాసు సిటీ సివిల్ కోర్టు ఫస్టుక్లాసు న్యాయాధిపతి విచారించి సెప్టెంబరు 9 వ తారీఖున భర్తకు పరమశివం.. యింటి లోపలికి పోకూడదు' అనే నిషేధాజ్ఞను జారీ చేయించారు.
పరమశివం కౌంటర్ పిటిషన్
తనపై విధింపబడిన ఆంక్షను ఎదుర్కొవడానికి (భర్త) పరమశివం కోర్టులో ఒక కౌంటర్ పిటిషన్ పెట్టుకున్నాడు, అతడు తన పిటిషన్‌లో కొన్ని కారణాలను వివరిస్తూ రాజసులోచన, ఒక స్త్రీకి సహజంగా వుండవలిసిన మర్యాద లేకుండా ప్రవర్తించిందనీ, ఆమె ఆక్రమంగా నడుచుకుంటున్నదనీ, తెలియబరచాడు,
ఇంట్లో కుమారుడు
“ఇంటిలో మా కుమారుడున్నాడు. అతనికి 'గార్డియన్''గా వ్యవహరించవలసిన బాధ్యత నాపై వుంది." ఇప్పుడు నా పై విధించబడిన ఆంక్ష వల్ల చట్ట పూర్వకమైన దాంపత్య జీవితానికి అంతరాయం కలుగగలదు." అని పరమశివం తన పిటిషనులో పేర్కొ న్నాడు.
'నా స్వంత యిల్లు'
'ఇల్లు నా సొంతం. అందువల్ల ఆ ఇంటికి సంబంధించిన హక్కు నాది గనుక భర్తనైనా సరే లోపలకి రానీయకుండా వుంచే హక్కు నాకు వుంది' అని రాజసులోచన ప్రతివాదంలో చెప్పినట్లు తెలుస్తూంది.
కోర్టు యిచ్చిన తీర్పు
పరమశివం దాఖలు చేసుకున్న కౌంటర్ విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండవ న్యాయాధిపతి శ్యాందాస్ యీ క్రింది విధంగా తీర్పునిచ్చారు. "పరమశివం తెలియబరిచిన కారణాలు ఒక విధంగా చూస్తే న్యాయబద్ధంగానే వుండవచ్చు. ఒకే యింటిలో వీరిద్దరూ కలిసి ఉంటే ఈ తగాదా యింకా విషమ స్థితికి మారవచ్చు. అందువల్ల పరమశివం పై విధించబడిన నిషేధాజ్ఞను రద్దు పరచవలసిన అవసరం లేదు."