తెలంగాణ సినిమా: ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ఓటిటి రివ్యూ
x

తెలంగాణ సినిమా: ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ ఓటిటి రివ్యూ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ ప్రాంతపు సినిమాలు పెరగడం మొదలయింది. దాంతో అక్కడ భాషను, యాసను మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతంపు..


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక ఆ ప్రాంతపు సినిమాలు పెరగడం మొదలయింది. దాంతో అక్కడ భాషను, యాసను మాత్రమే కాకుండా తెలంగాణ ప్రాంతంపు భౌగోళిక, రాజకీయ, సంస్కృతి, సాంప్రదాయల వైవిధ్యాన్ని ఆవిష్కరించడానికి అవకాశం కలుగుతోంది. ఈ వరసలో వచ్చిందే ‘షరతులు వర్తిస్తాయి’. కరీంనగర్ జన జీవితాన్ని అక్కడ సామాజిక చైతన్యాన్ని మధ్య తరగతి మనుష్యుల తత్వాన్ని మన ముందుంచారు. ఈ సినిమా తాజాగా ఓటిటిలో రిలీజైంది. ఇంతకీ ఈ సినిమా కథేంటి...ఎవరు ఎవరికి షరతులు పెడతారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

కథేంటంటే:

కరీంనగర్‌లో సావిత్రిబాయి బస్తీలో కథ జరుగుతుంది. అక్కడ మిడిల్ క్లాస్ సామాన్య కుటుంబీకుడు చిరంజీవి (చైతన్యరావ్ ). నీటిపారుదల శాఖలో పనిచేసే చిరంజీవి ఇంటి బాధ్య‌త‌ల్ని భుజాన వేసుకుని... తల్లి (పద్మావతి), చెల్లి, తమ్ముడి బాగోగుల్ని చూసుకుంటూ కుటుంబాన్ని లాక్కొస్తుంటాడు. అతడికి ఇంటి బయట కూడా మంచి పేరే ఉంది. అతన్ని చిన్నప్పటి స్నేహితురాలు విజయశాంతి (భూమిశెట్టి)ని ఇష్టపడి, ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అంతా బాగానే ఉంది. కొత్త కాపురం హ్యాపీగా ఉందనుకున్న సమయంలో అతని కాపురంలోనే కాకుండా బస్తీలోనే గోల్డెన్ ప్లేట్ పేరుతో మొదలైన గొలుసుకట్టు చిట్టీల వ్యాపారం చిచ్చు పెడుతుంది.

గోల్డెన్ ప్లేట్ కంపెనీ మనం అనేక చోట్ల అనేక సార్లు చూసిన, విన్న లాంటి మోసకారి సంస్దే. అయితే ఆశ అనేది మనషిని అవతలి వైపు మోసం ఉందనే విషయం ఆలోచించనివ్వదు. దానికి తోడు స్థానిక నాయకుడు శంకరన్న(సంతోష్ యాదవ్) కూడా అందులో డబ్బు పెట్టి బస్తీ వాళ్లలో నమ్మకాన్ని కుదురుస్తాడు. అప్పటికీ చిరంజీవిని అతని స్నేహితులు బలవంతం చేసినా అందులో చేరటానికి ఒప్పుకోడు. ఉచితంగా వచ్చే డబ్బు ఎప్పటికైనా ప్రమాదమే అని హెచ్చరిస్తాడు. అయినా చిరంజీవి ఇంట్లో వాళ్లు అతను ఆఫీస్ పని నిమిత్తం బయటకు వెళ్లిన టైమ్‌లో వెళ్లి ఆ స్కీమ్‌లో చేరుతారు. చిరంజీవి తన భార్య చేత స్టేషనరీ షాప్ పెట్టిద్దామని దాచిన డబ్బు ఐదు లక్షల రూపాయలు అందులో పెట్టేస్తారు. రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేస్తుంది.

ఈ క్రమంలో తమ డబ్బు పోయిన విషయం తెలిసిన చిరంజీవి తల్లి కుప్పకూలిపోతుంది. మరో ప్రక్క అతని భార్య కూడా కుంగిపోతుంది. కొంతమంది ఆ బస్తీ వాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇవన్నీ చూసిన చిరంజీవి ఏం చేశాడు? అసలు శంకరన్నకు గోల్డెన్ ప్లేట్ సంస్థతో ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

ఎలా ఉంది

మొదటే చెప్పుకున్నట్లు ఈ సినిమా తెలంగాణ జన జీవితాన్ని,అక్కడి ప్రాంత జన జీవన స్థితి గతులను ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అలాగే మానవ సంబంధాలుకు ప్రయారిటీ ఇస్తూ సీన్స్ అల్లుకున్నారు. అయితే ప్రధాన కథను మలుపు తిప్పే ఎపిసోడ్ అయిన చైన్ సిస్టమ్ బిజినెస్ సీన్స్ బాగానే తీసినా ఇప్పటికాలం కథలా అనిపించటంలో తడబడింది. అందుకు కారణం ఇప్పుడు మోసం చేసే తీరు మారిపోయింది. పూర్తిగా చైన్ సిస్టమ్ బిజినెస్ లేకుండా పోయిందని కాదు కానీ సమాజంలో మార్పులు అయితే వచ్చాయి. ఓ పదిహేను ఏళ్ల క్రితం సినిమా చూస్తున్న ఫీల్ వచ్చింది ఆ సీన్స్ దాకా. సెల్ ఫోన్స్ ,వాట్సప్‌లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కథ అనుకున్నాము. ఇక అది ప్రక్కన పెడితే ఫస్టాఫ్ స్లోగా నడిచినా సెకండాఫ్ డ్రామా బాగా పండింది. పరుగెత్తింది. దర్శకుడు తొలి చిత్రమైనా ఎక్కడా ఆ తడబాటు కనపడకుండా నీట్ గా తను చెప్పాలనుకున్నది లిమిటెడ్ బడ్జెట్ లో చక్కటి ఎమోషన్స్ తో చెప్పుకుంటూ వెళ్లారు. అయితే సినిమా అంతా రియలిస్టిక్‌గా వెళ్లినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌కు వచ్చేసరికి పూర్తి సినిమాటిక్‌గా అనిపిస్తుంది. రెండింటిని బాలెన్స్ చేయలేకపోయారు.

టెక్నికల్‌గా

కరీంనగర్, సిద్దిపేట జిల్లాలోని నీటి వనరులని చూపెడుతూ కెమెరా వర్క్ సాగింది. విజువల్స్ బాగున్నాయి. పెద్దింటి అశోక్ రాసిన మాటలు సహజంగా అనిపిస్తాయి. అరుణ్ చిలువేరు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెవులకు ఇంపుగా సాగింది. అలాగే పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఫస్టాఫ్ లో సీన్స్ ని కాస్తంత పరుగెట్టిస్తే బాగుండేది.

నటీనటుల్లో ..

చిరంజీవిగా చైతన్యరావు మిడిల్ క్లాస్ కుటుంబానికి ప్రతినిధిలా అనిపించారు. విజయశాంతిగా కన్నడ అమ్మాయి భూమిశెట్టి మెప్పించింది. మిగతా పాత్రల్లో నందకిషోర్, తల్లిగా నటించిన పద్మావతి, శంకరన్నగా సంతోష్ యాదవ్, పెద్దింటి అశోక్ పాత్రల పరిధి మేరకు నటించారు.

చూడచ్చా

ఈ సినిమా చూడటానికి మరీ ఎక్కువ కండీషన్స్ పెట్టుకోవాల్సిన పనిలేదు. కొంత స్లోగా ఉంటుంది అది తట్టుకోగలిగితే చాలు.

ఎక్కడ చూడచ్చు

ఆహా ఓటిటిలో తెలుగులో ఉంది.

నటీనటులు: చైతన్యరావు, భూమిశెట్టి, నందకిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు;

సంగీతం: అరుణ్ చిలువేరు;

నేపథ్య సంగీతం: ప్రిన్స్ హెన్రీ;

ఛాయాగ్ర‌హ‌ణం: ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి;

క‌ళ‌: గాంధీ; కూర్పు: సీహెచ్ వంశీకృష్ణ;

మాటలు: పెద్దింటి అశోక్‌కుమార్‌;

రచన-దర్శకత్వం: కుమారస్వామి(అక్షర);

నిర్మాణ సంస్థ : స్టార్ లైట్స్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్;

Read More
Next Story