మనమే: మూవీ రివ్యూ
x

మనమే: మూవీ రివ్యూ

శర్వానంద్, కృతిశెట్టి నటించి స్లో రొమాంటిక్ సినిమా మనమే. ఈ సినిమా పాయింట్ కొత్తది- చిత్రీకరణ పాతది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే..


ఈ శుక్రవారం (7.6.24) విడుదలైన ఓ మోస్తారు పెద్ద సినిమాల్లో ఇది ఒకటి. ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ "ఒకే ఒక జీవితం"(2022) తర్వాత రెండు సంవత్సరాలకు వచ్చిన సినిమా ఇది. పాయింట్ కొత్తదే, కానీ 2010 లో వచ్చిన హాలీవుడ్ సినిమా "లైఫ్ యాజ్ వీ నో ఇట్"( తెలుగులో చెప్పాలంటే, " మనకు తెలిసిన జీవితం") ఆధారంగా తీసిన రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా ఇది. శర్వానంద్‌కి ఇది 35వ సినిమా(సినిమా టైటిల్స్‌లోనే శర్వానంద్ సినిమాల లోగో చూపిస్తారు). దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు ఐదవ సినిమా.

ఒక్క "శమంతకమణి" తప్ప శ్రీరామ ఆదిత్య తీసిన ఐదు సినిమాలకు రచయిత అతనే! క్రిష్ సినిమా " గమ్యం" తర్వాత శర్వానంద్ సినీ ప్రస్థానం ఒక గమ్యం లేకుండా నడిచింది. మధ్యలో రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు,( దీనికి నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది) శతమానం భవతి, పడి పడి లేచే మనసు, జాను లాంటి కొన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి.

పాయింట్ కొత్తది- చిత్రీకరణ పాతది

ఈ సినిమా కథ ఏంటంటే, విక్రమ్(శర్వానంద్) లండన్‌లో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. తల్లిదండ్రులు (సచిన్ ఖేడ్కర్, తులసి) ఇండియాలో ఉంటారు. విక్రమ్‌కి ఒక లక్ష్యం లేదు, ఒక పద్ధతి పాడు లేదు. అలా గడిపేస్తున్న విక్రమ్ ఒకసారి తన స్నేహితుడు అనురాగ్, అతని భార్య శాంతితో ఇండియాకు ఒక ఫంక్షన్‌కి వెళ్తారు. అక్కడ ఒక యాక్సిడెంట్‌లో తన స్నేహితుడు, అతని భార్య ఇద్దరూ చనిపోవడంతో విక్రమ్ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. శాంతి స్నేహితురాలు సుభద్ర(కృత్తి శెట్టి) అనురాగ్ దంపతుల కుమారుడు ఖుషి(మాస్టర్ విక్రమ్ ఆదిత్య- దర్శకుడి కుమారుడు) సంరక్షణ తీసుకుంటుంది. ఇక్కడ విక్రమ్ కూడా ఇష్టం లేకపోయినా ఆమెతోపాటు ఒక ఆరు నెలలు పిల్లవాడి సంరక్షణలో చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఇది సంక్షిప్తంగా మనమే సినిమా కథ. ఆరు నెలలు పూర్తయిన తర్వాత, విక్రమ్ అమ్మమ్మ తాతయ్య(సీత, ముఖేష్ ఋషి) పిల్లవాడిని తీసుకెళ్తారు. విక్రమ్, సుభద్ర కి అప్పటికే పిల్లాడితో అనుబంధం ఏర్పడి ఉంటుంది. దాంతోపాటు విక్రం సుభద్రల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుంది. అంతకన్నా ముందు సుభద్రకి కార్తీక్(శివ కందుకూరి) తో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. ఇంత కథ విన్న తర్వాత క్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకి ఊహించడం పెద్ద విషయం కాదు. అది పెద్ద సస్పెన్స్ కూడా కాదు. ఇష్టం లేని ఇద్దరు ఒక పని కోసం, కొంతకాలం కలిసి ఉండాల్సిన రావడం అన్న పాయింట్ మీద ఎన్నో సినిమాలు వచ్చాయి. కొంచెం కొత్త పాయింట్‌తో అదే రకమైన సినిమా మనమే.

మొదట్లోనే చెప్పాలంటే ఈ సినిమా అక్కడక్కడ చాలా బాగుంది, కొన్ని చోట్ల పర్వాలేదు, మరికొన్ని చోట్ల బోరింగ్‌గా ఉంటుంది. చాలా చోట్ల స్లోగా, ఈ సీన్ ఎప్పుడు అయిపోతుంది అనే విధంగా ఉంది. ఈ సినిమా కు ప్రధానమైన బలం కొంతవరకు శర్వానంద్, కృతి శెట్టిల నటన, వెన్నెల కిషోర్ కామెడీ, ఆ తర్వాత రాహుల్ రామకృష్ణ కామెడీ కోసం చేసిన కొంత ప్రయత్నం.

పాత్రలు ఎక్కువ- కామెడీ తక్కువ

ఇది ఫీల్ గుడ్ రొమాంటిక్ కామెడీ డ్రామా అని సినిమా నిర్మాతలు, దర్శకుడు, హీరో శర్వానంద్ లు చెప్పారు. అయితే ఇందులో రొమాన్స్ అంత రొమాంటిక్ గా లేదు, కామెడీ కొంచెం, డ్రామా ఎక్కువగా ఉంది. ఈ సినిమాకు ఒక మైనస్ పాయింట్ దాని నిడివి. రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల పాటు, ఈ సినిమాలో పైన చెప్పినవన్నీ అక్కడక్కడ కనబడుతూ వెళ్ళాయి. పూర్తిగా ఏమీ లేవు. దర్శకుడే రచయిత అయిన ఈ సినిమాలో చాలా సన్నివేశాలు, దీర్ఘంగా నడిచి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించాయి. ఈ సినిమాకి నిడివి తో పాటు పాత్రలు కూడా ఎక్కువే. వెన్నెల కిషోర్ ఒకటి రెండు సన్నివేశాలకు మాత్రమే పరిమితమై కొంత నవ్వించే ప్రయత్నం చేశాడు. ఈ పాత్ర నిడివి ఎక్కువ ఉండి ఉంటే బాగుండేది.

కొంత పని చేసిన శర్వానంద్ ఎనర్జీ- కృతి శెట్టి గ్లామర్

ఇంత చెప్పిన తర్వాత ఈ సినిమా ప్లస్ పాయింట్ లు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాటి గురించి చెప్పాలి. హీరో శర్వానంద్ మంచి ప్రయత్నం చేశాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని నటన కనపరిచాడు. "శర్వానంద్ తన ఎనర్జీతో ఈ సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. శర్వానంద్ నటన అద్భుతంగా ఉంటుంది" అని ప్రీ రిలీజ్ కి ముందు దర్శకుడు చెప్పిన మాట చాలా వరకు నిజం. పాత్రలోని డిఫరెంట్ షేడ్స్ ని శర్వానంద్ బాగానే ప్రతిబింబించాడు. కృతిశెట్టి కూడా అంతే. అయితే సినిమా మొత్తంగా ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా మారడానికి అవి సరిపోలేదు. దాంతో అంత స్వీట్ గా లేని, స్వీట్ తిన్న ఫీలింగ్ ప్రేక్షకులకు వచ్చే అవకాశం ఉంది

పిట్ట కొంచెం కూత ఘనం

ఈ సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన అంశం ఒకటి ఉంది. అది మాస్టర్ విక్రమ్ ఆదిత్య నటన. ఆ చిన్న పిల్లవాడి చుట్టూ కథ మొత్తం తిరుగుతుంది కాబట్టి, ఆ పిల్లవాడి నటన ముఖ్యం. అది మాత్రం ఈ సినిమాలో బాగుంది. పిల్లవాడు నటించాడు అనడం కన్నా, పిల్లవాడితో బాగా నటింపజేశారు అని చెప్పాలి. ఈ విషయంలో దర్శకుడు(తన కొడుకే కాబట్టి) సక్సెస్ అయ్యాడు. పిల్లవాడు కూడా పెద్దవాడిలా నటించాడు. పిల్లాడు సరే, పెద్దవాళ్లతోనే సినిమాకి ప్రాబ్లం వచ్చింది.

అంతగా ఆకట్టుకోని సంగీతం

ఈ సినిమాలో 16 పాటలు ఉన్నాయి అని ముందే ప్రేక్షకులకి తెలియపరిచారు. ఇంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మొదటిసారి వాడి హాయ్ నాన్న కు ఆహ్లాదకరమైన, మెలోడియస్ సంగీతం సమకూర్చిన హేషామ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాలో అలా చేయలేకపోయాడు. ఇలాంటి సినిమాలకి నేపథ్య సంగీతం కన్నా, పాటలు చాలా ముఖ్యమైనవి. అక్కడ సినిమా కొంచెం వీక్ అయింది. ఫోటోగ్రఫీ బాగానే ఉంది. ఎందుకంటే సినిమా ఎక్కువ భాగం లండన్ లో చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు కొంచెం పని చెప్పి ఉంటే, సినిమా మరింత మెరుగ్గా ఉండేదేమో. ఇక సినిమాలో అక్కడక్కడ డైలాగులు ఆలోచింప చేశాయి, కొన్ని నవ్వించాయి, కొన్ని అర్థవంతంగా ఉన్నాయి. అయితే సినిమా మొత్తం బాగుండడానికి అవి సరిపోలేదు.

చివరకు చెప్పాలంటే మనమే సినిమా కొంత ఓపిక ఉండి, మరికొంత పెద్ద మనసు ఉండి, కొంత కామెడీ, మరి కొంత రొమాన్స్, ఇంకొంచెం ఎమోషన్స్ ఉన్న ఒక ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే, ఈ సినిమా ఎలాగోలా చూసేయవచ్చు.

నటీనటులు: శర్వానంద్, కృతి శెట్టి,మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్.

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య

డైలాగ్స్: కార్తిక్-అర్జున్, ఠాగూర్, వెంకట్

సంగీతం: హేషామ్ అబ్దుల్ వహాబ్

సినిమాటోగ్రఫీ: జ్ఞాన శేఖర్ , విష్ణు శర్మ,

ఎడిటర్: ప్రవిణ్ పూడి

నిర్మాతలు: వివేక్ కూచిభొట్ల, టి.జి. విశ్వ ప్రసాద్

నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

విడుదల: జూన్ 07, 2024

Read More
Next Story