చిరంజీవి ఇంద్ర’ చెరగని జ్ఞాపకాలు
x

చిరంజీవి 'ఇంద్ర’ చెరగని జ్ఞాపకాలు

ఆ సినిమాకు డైరక్టర్ బి.గోపాల్ కానీ ...చిత్రం ఏమిటంటే ఆ క్లైమాక్స్‌ ఫైట్స్‌ సీన్స్‌కు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.


విలన్ ముఖేష్ రుషిని చావ చితక్కొట్టేసాడు చిరంజీవి. సినిమా అయ్యిపోయిందని ప్రేక్షకుడుకి అర్దమైంది. అసలు క్లైమాక్స్ ఫైట్ మొదలైనప్పుడే చూసేవాడికి తెలుసు..ఇంక మనం లేచి బయిలుదేరాలని..మానసికంగా దానికి ఫిక్సై...కుర్చీలోంచి మెల్లిగా లేవటానికి ప్రిపేర్ అవుతూంటాడు. అప్పుడు హీరో చాంతాండంత డైలాగులు చెప్తే వెంటాడా. అసలు ఆసక్తి ఉంటుందా.

సినిమా చివరి ఇరవై నిముషాలు బాగుంటే అద్బుతమని చెప్తారు. అలాంటిది క్లైమాక్స్ ఫైట్ అయ్యాక ఇంకా డైలాగులు చెప్తే బాగుంటుందా. ఇది చిరంజీవి మనస్సులో మెదులుతున్న ఆలోచన.

అటు స్టార్ డైరక్టర్ బి.గోపాల్, ఇటు స్టార్ రైటర్స్ పరుచూరి బ్రదర్శ్. కొద్ది సేపు ఆలోచించి... “విలన్ ని నేను కొట్టేసిన తర్వాత ఇంకా డైలాగులు చెప్తూ కూర్చుంటే బాగుంటుందా?” అని అన్నారు చిరంజీవి తన చేతిలో ఉన్న మూడు పేజీల డైలాగ్ షీట్స్ చూస్తూ.

ఆ సినిమాకు డైరక్టర్ బి.గోపాల్ కానీ ...చిత్రం ఏమిటంటే ఆ క్లైమాక్స్‌ ఫైట్స్‌ సీన్స్‌కు పరుచూరి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. విలన్‌ ముఖేష్‌ రుషిని కొట్టిన తర్వాత చిరంజీవి మూడు పేజీల డైలాగ్‌లు చెప్పాల్సి ఉంది. తాము కష్టపడి, ఇష్టపడి రాసిన డైలాగ్స్. అయితే విలన్‌ను కొట్టేసిన తర్వాత డైలాగ్స్‌ చెబితే బాగుండదని చిరు చెప్పారు.

తమకు నిజమే అనిపించింది. స్క్రిప్టు రాసేటప్పుడు ఉన్న ఎమోషన్ వేరు. ఇక్కడ ప్రాక్టికల్ గా తెరకెక్కేటప్పుడు ఉండే ప్రాక్టికాలిటి వేరు. మూడు పేజీలు డైలాగులు చెప్తే జనం వినటానికి ఉండరు. దాన్ని కుదించి ఒక్క ముక్కలో చెప్పాలి. అలా ఆలోచిస్తూ వెంటనే పెన్ను పేపరు తీసుకుని ప్రక్కకు వెళ్లి కొద్ది నిముషాల్లోనే అద్బుతమైన డైలాగు రాసుకొచ్చి చిరంజీవి చేతిలో పెట్టారు గోపాల్ కృష్ట. ఆ డైలాగే..

‘నరుక్కుంటూ వెళ్తే, అడవి అన్నది మిగలదు. చంపుకొంటూ వెళ్తే మనిషి అన్నవాడు మిగలడు’

సినిమా ఇంద్ర.

సినిమా సారాంశం మొత్తం ఆ ఒక్క డైలాగుతో వచ్చేసింది. ఆ డైలాగుతో సినిమాకు ముగింపు వచ్చేసింది. చిరంజీవికి ఆ సందేహం రాకపోయినా, వచ్చినా మొహమాట పడినా క్లైమాక్స్ వేరే విధంగా ఉండేది. అలాగే క్షణాల్లో డైలాగులు రాయగల సత్తా ఉన్న పరుచూరి బ్రదర్శ్ పెన్ పవర్ అది.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు... స్టార్ ప్రొడక్షన్ హౌస్ వైజయంతీ మూవీస్‌ యాభయ్యేళ్ల సంబరాలు. ఈ రెండు విశేషాల్ని పురస్కరించుకొని ‘ఇంద్ర’ సినిమాని ఆగస్టు 22న రీ-రిలీజ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. చిరంజీవి హీరోగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై 22 ఏళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే ‘ఇంద్ర’. బి.గోపాల్‌ దర్శకత్వం వహించారు. ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్స్ . 2002 జులై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన దక్షిణాది చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి సహా, మొత్తం మూడు నంది పురస్కారాలు, రెండు ఫిల్మ్‌ఫేర్‌ పురస్కారాల్ని సొంతం చేసుకుంది. ఈ సందర్బంలో అప్పటి విశేషాలు తలుచుకోవటం ఆనందకరమే.

అలాగే ఈ సినిమాలో మరో చోట...చిరంజీవికు ఓ సందేహం వచ్చింది. తన మేనల్లుడు కోసం చిరంజీవి భాషా టైప్ లో దెబ్బలు తింటూంటారు. అయితే తను మెగాస్టార్..తన అభిమానులు ఏక్సెప్ట్ చేస్తారా అనే సందేహం ....మరో ప్రక్క నటుడుగా అలా చేయాల్సిందే అనే ఆలోచన... దాంతో పరుచూరి బ్రదర్శ్ ని పిలిచి...‘మేనల్లుడి కోసం నేను దెబ్బలు తింటున్నాను సరే. అభిమానులు ఆ సీన్‌ను ఒప్పుకొంటారా’ అని సందేహం వెళ్లబుచ్చారు. అప్పుడు పరుచూరి బ్రదర్స్‌ను ఆ సమస్యకు పరిష్కారం....ఓ డైలాగు రాసి చెప్పారు. అదే...

"షావుకత్ అలీఖాన్.. తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టీ తల వంచుకొని వెళ్తున్నాను. లేకపోతే ఇక్కడనుంచి తలలు తీసుకెళ్లేవాడిని."

ఈ ఒక్క డైలాగుతో మొత్తం సీన్ జస్టిఫై అయ్యిపోయింది. అలాగే సినిమాలో ఎన్నో పవర్ ఫుల్ డైలాగులు .. . "రానానుకున్నారా రాలేననుకున్నారా.. కాశికి పోయాడు.. కాషాయ మనిషైపోయాడు అనుకుంటున్నారా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరసులు మార్చి ఉంటాడు అనుకుంటున్నారా.. అదే రక్తం అదే పౌరుషం." ,"వీరశంకర్రెడ్డి.. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా"ఇలాంటి ఎన్నో డైలాగులు చిరంజీవి నోటి వెంట వస్తూనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి.

అందుకే 268 స్క్రీన్లలో విడుదలైన ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డ్ లు క్రియేట్ చేసింది. అలాగే ఈ సినిమాకు మూడు విభాగాలలో నంది అవార్డులు వచ్చాయి. విజయవాడలో ఈ సినిమా 175 రోజుల వేడుక జరగగా అప్పటి సీఎం చంద్రబాబు ఈ వేడుకకు గెస్ట్ గా హాజరయ్యారు.

వాస్తవానికి ఈ చిత్రం కథ గా చూస్తే కొత్తగా అనిపించదు. సూపర్ హిట్ రజనీకాంత్ భాషా ఫార్మెట్ లో ఉంటుంది. అలాగే ఇదే దర్శకుడు చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు చిత్రాలు స్క్రీన్ ప్లే డిజైన్ ను గుర్తు చేస్తుంది. ఇదే విషయాన్ని దర్శకుడు బి.గోపాల్ ని అడుగుతూ..‘సమరసింహారెడ్డి’, ‘ఇంద్ర’ రెండు కథలు ఒకేలా అనిపిస్తాయి కదా! మీకు అనిపించలేదా!అడిగితే ఆయన ఏమన్నారంటే...

బి.గోపాల్‌: అవును! రెండు కథలూ ఫ్యాక్షన్‌ బ్యాడ్రాప్‌లో నడుస్తాయి. హీరో వేరే చోట పనిచేస్తూ బతుకుతూ ఉంటాడు. కానీ రెండు స్క్రీన్‌ప్లేలు వేరు. ‘సమరసింహారెడ్డి’లో ఒక పవర్‌ఫుల్‌ మ్యాన్‌ తన దగ్గర పనిచేసే వ్యక్తి కోసం, అతని చెల్లెళ్ల కోసం హోటల్‌లో పనిచేస్తూ ఉంటాడు. కానీ, ‘ఇంద్ర’లో తన ఆస్తులన్నీ ప్రజల కోసం ఇచ్చేసి ట్యాక్సీ డ్రైవర్‌గా బతుకుతూ ఉంటాడు. రెండింటి కథ నేపథ్యం విషయంలో ఒకటిగా అనిపించినా స్క్రీన్‌ప్లేలు వేర్వేరు. లేకపోతే ప్రేక్షకులు హిట్‌ చేస్తారా? అన్నారు.

"సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్ర సేనుడిది."

ఇక ఈ సినిమా ప్రారంభమే చిత్రంగా జరిగింది. చిరంజీవి ఈ సినిమా చేసేనాటికి కాస్తంత వెనకబడ్డారు. హిట్స్ పడుతున్నాయి కానీ సాలిడ్ హిట్ పడటం లేదు. ‘గ్యాంగ్ లీడర్’, ‘ఘరానా మొగుడు’లాంటి ఇండస్ట్రీ హిట్ ని చిరంజీవి అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం మంచి మాస్ మూవీ కావాలి. కానీ చిరంజీవికి ఓ ఫ్యామిలీ స్టోరీ చేయాలని ఉంది. అప్పుడే రచయిత చిన్నికృష్ణ...అశ్వనీదత్, బి.గోపాల్ లను కలిసి ఈ కథను చెప్పారు.

అయితే ఫ్యాక్షన్ సినిమాలు తెగ వస్తున్నాయి అప్పుడు చిరంజీవి కూడా అదే నేఫధ్యంలో సినిమా చేస్తే బాగుంటుందా అనే సందేహం బి.గోపాల్ కు. అందులోనూ వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘మెకానిక్‌ అల్లుడు’వర్కవుట్ కాలేదనే బాధ బి. గోపాల్‌ ది. రచయిత పరుచూరి గోపాలకృష్ణ పట్టుబడ్డి మంచి కథ, ‘సక్సెస్‌ఫుల్‌ ఎలిమెంట్‌ ఈజ్‌ ఆల్వేస్‌ సక్సెస్‌ ఆన్‌ అదర్‌ ఫేస్‌’ అని ఆయనకు నచ్చజెప్పి ఒప్పించారు. బి.గోపాల్ ఓకే చేసాక కథలో చిన్ని కృష్ణ మార్పులు చేయటం మొదలెట్టారు.

మొదట ఈ చిత్రం కథ నేపథ్యాన్ని కృష్ణా- గోదావరి నదీ పరివాహక ప్రాంతాన్ని తీసుకున్నారు.కానీ పరుచూరి గోపాలకృష్ణతో స్క్రిప్టు డిస్కషన్స్ లో దాన్ని కాశీ, గంగానది బ్యాక్‌డ్రాప్‌నకు మార్చారు. అక్కడే కొత్తదనం వచ్చేసింది. అలా ప్రతీసీన్ కొత్తదనం సంతరించుకుని హిట్ లక్షణాలు పుష్కలంగా కనపడటం మొదలెట్టింది. బౌండ్ స్రిప్టు చేతికి వచ్చాక మొత్తం 120 రోజుల్లో సినిమాని పూర్తి చేశారు. 'మీది తెనాలి.. మాది తెనాలి' అంటూ కాశీలో బ్రహ్మానందం అండ్‌ కో చేసే కామెడీ సీన్లు బాగా రావటంతోనే సూపర్ హిట్ కొడుతున్నామని అర్దమైంది. ఇక ఈ సినిమాలో అన్నీ సూపర్ హిట్ సాంగ్సే.

'భం భం భోలే', 'రాధే గోవిందా', 'అమ్మడో అప్పచ్చి', 'ఘల్లు ఘల్లుమని', 'అయ్యో అయ్యో' ఇలా ప్రతీపాట ఆకట్టుకుంది. మణిశర్మ మొత్తం పదకొండు పాటలకి చేయగా అందులో అయిదు పాటలని ఓకే చేశారు. ఇందులో ‘అయ్యో అయ్యో’ సాంగ్‌కి మణిశర్మ అందుబాటులో లేకపోవడంతో ఆర్పీ పట్నాయక్ దానికి స్వరాలు సమకూర్చారు. చిరంజీవి అయితే ఇంద్ర పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసారు. అలాగే సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన పాట.. 'దాయి దాయి దామ్మ'. అందులో చిరు వేసే వీణ స్టెప్పుకు ఫిదా కానీ వారు లేరు. ఇలా ఓ సక్సెస్ ఫుల్ సినిమా

"ఎవరి పేరు చెబితే సీమ ప్రజల ఒళ్లు ఆనందం తో పులకరిస్తుందో, ఎవరి పేరు చెప్తే కరువు సీమలో మేఘాలు గర్జించి వర్షిస్తాయో, ఎవరి పేరు చెప్తే బంజరు భూములు పంట పొలాలుగా మారతాయో.. ఆయనే ఇంద్ర సేనా రెడ్డి."

Read More
Next Story