ఈ నారదుడి పాత్ర ఆ రోజుల్లో సెన్సేషన్ ... కాని
x

ఈ నారదుడి పాత్ర ఆ రోజుల్లో సెన్సేషన్ ... కాని

చిత్రం వెనక విచిత్రాలు. ఆమె ఎవరు? నారదుడి వేషానికి ఎలా ఎంపిక చేశారు? ఒక నటికి సూట్ అయ్యేలా నాటి దర్శకుడు నారదుడి వేషాన్ని ఎలా మార్చారు?


ఈ ఫీచర్ ఫోటోని గమనించండి. ఫోటోలో ఉన్నదెవరు? అంత సులభంగా అంతా గుర్తు పట్టలేరు. సినిమా చరిత్రను గమనిస్తూ వస్తున్న వాళ్లు మాత్రమే గుర్తుపట్టగలరు. చూస్తూనే ఇది నారుదుడి వేషం అని కొందరు గుర్తుపట్టొచ్చు.మరి ఆ పాత్ర ధరించిన యాక్టర్ ఎవరు? ఈ ఫోటో వెనక పెద్ద చరిత్ర ఉంది. అది తెలుగు వెండి తెర చరిత్ర ‘ స్వర్ణ యుగం’ లో ఒక అధ్యాయానికి సంబంధించింది.


కొన్ని సినిమాల నిర్మాణం సంవత్సరాలు తీసుకుంటూంటుంది. అపుడు సినిమా కథ కంటే చిత్ర నిర్మాణ కథ ఆసక్తిగా ఉంటుంది. ఈ ఫోటో వెనక అలాంటి ఆసక్తి కరమయిన చిత్ర నిర్మాణ కథ ఉంది.


ఫోటో లో నారదుడి వేషం వేసింది ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసురాలు ఎం ఎస్ సుబ్బులక్ష్మి. అదొక విశేషం. ఎందుకంటే, అంతకు ముందు ఒక మహిళ నారుదుడి వేషం వేయడం ఎపుడూ జరగలేదు. ఇదే మొదటి సారి. ఈ చిత్రం పేరు ‘సావిత్రి’. 1941లో చిత్రం నిర్మాణమయింది. ఇంతకంటే మరొక విశేషమేమిటంటే ఈ చిత్ర దర్శకుడు తెలుగు వాళ్ళంతా మర్చిపోయిన ఒక నాటి తెలుగు మహానటుడు వైవి రావు. పూర్తి పేరు ఎర్రగుడిపాటి వరదారావు. రావుగారు మహానటుడే కాదు, ఆల్ రౌండర్. నటుడు, దర్శకుడు, ఎడిటర్, డిజైనర్...చిత్ర నిర్మాణంలో ఆయన ముద్ర లేని రంగం లేదు.



వైవి రావు, డైరెక్టర్ (1903 -1973)


1940 దశకంలో ఆయన సూపర్ స్టార్. దర్శకుడు కూడా. తెలుగు, హిందీ, తమిళం, కన్నడలలో సినిమాలు తీసిన తొలిదర్శకుడు ఆయనే. ఆయన చాలా రంగాలలో ఆధ్యుడు.

వైవి రావు తమిళలో ‘సావిత్రి’ తీయాలనుకున్నారు. నటుల ఎంపిక మొదలయింది. సావిత్రి పాత్ర కు నాటి మరాఠీ, హిందీ నటి శాంతా అప్టే అంగీకరించారు. ఆప్పటికి ఆమె పాపులర్ స్టార్. శాంతారామ్ ‘ దునియా నా మానే’ తో ఆమె సెలెబ్రిటీ అయింది. అయినా సరే, ఇటు వైపు దర్శకుడు కూడా సెలెబ్రిటీయే కాబట్టి ఆమె తమిళ చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.

అయితే, ఇక్కడొ చిక్కువచ్చింది. ఆమెకు తమిళం రాదు. డబ్బింగ్ కు ఒప్పుకోలేదు. తమిళంలోనే మాట్లాడతానని పట్టుబట్టింది. దీనితో చిత్రనిర్మాణాన్ని ఆమె తమిళం నేర్చుకునే దాకా వాయిదావేయాల్సి వచ్చింది. సాధారణంగా వైవి రావు రెండునెలల్లో సినిమా తీసేస్తారు. అలాంటిది కేవలం హీరోయిన భాష నేర్చుకునేందుకు ఒక ఏడాది చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. ఆరోజులో ఆమె పుణే లో ఉండేవారు. అపుడు ఆమెకు తమిళం నేర్పించేందుకు వడివేలు నాయకర్ అనే డైలాగ్ రైటర్ ని, మద్రాసు మైలాపూర్ కు చెందిన మరొక మహిళను ట్యూటర్లుగె పెట్టారు. ఈ మహిళ వివాహమయ్యాక పుణేలో స్థిరపడింది. ట్యూషన్ ఈ మహిళా ట్యూటర్ ఇంట్లో సాగేది. దీనికోసం సూపర్ స్టార్ శాంత పనిమనిషిలాగా మారువేషం వేసుకుని దొడ్డి వాకిట నుంచి ఇంట్లో ప్రవేశించేది. ఇలా ఒక ఏడాది పాటు కష్టపడి ఆమె తమిళం నేర్చుకున్నారు. ఆమె తమిళ భాష మాట్లాడటం మొదలు పెట్టాక చిత్ర నిర్మాణం పున: ప్రారంభమయింది.


నారుదుడి పాత్ర కు వైవి రావు ఎంఎస్ సుబ్బులక్ష్మిని ఎంపిక చేశారు. ఆమె మొదటి సారి పురుష పాత్ర వేస్తున్నారు. ఇక్కడ రెండు సమస్యలొచ్చాయి. ఒకటి నారదుడు రుషి కాబట్టి నడుము పైన వస్త్ర ధారణ ఉండదు. ఒక పూల మాల వేసుకుని ఉంటాడు. నాటకాలలో సినిమాలలో ఇలాంటి నారదుడు ప్రేక్షకులకు పరిచయం. ఇది పురుషులకయితే ఒకె. మరి, ఎం ఎస్ సుబ్బులక్ష్మి మహిళ, ఇది ఎలా సాధ్యం? అందుకే మన వైవి రావు పూర్తి ఫ్రీడమ్ తీసుకున్నారు. నిండా వస్త్రధారణతో ఉన్న నారదుని ప్రవేశపెట్టారు. ఇలాంటి ఫుల్ డ్రెస్ నారదుడు కనిపించడం ఇదే మొదటి సారి, ఆఖరు సారి కూడా.


సావిత్రి చిత్రంలో నారద (ఎంఎస్), సావిత్రి (శాంతా ఆప్టే) (source: Wikimedia Commons)


మరొక సమస్య వచ్చింది. అది నారుదుడి వీణతో . వీణ చాలా బరువు ఉంటుంది. అది ఎంఎస్ మోయడం కష్టమవుతుంది. అందుకే మన రావుగారు మరొక ప్రయోగం చేసి వీణ బదులు తంబూర అందించారు. ఎందుకలా చేశారు. దీని వెనక మరొక కథ ఉంది.


నారదుడు ఆకాశంలో అలవోకగా నడుస్తూ వస్తుంటాడు. నారదుడిని ఆకాశంలో ఎలా చూపించాలి. ఆ రోజులో టెక్నాలజీ ఇపుడున్నంత లేదు. డబుల్ ప్రింటింగ్ అప్పటికింకా రాలేదు. అందువల్ల ఒక గోడకట్టారు. నారదుడు ఈ గోడ మీద నడుస్తూ పోతున్నపుడు చాలా కింది భాగం లో కెమెరా పెట్టి నారదుడు ఆకాశంలో కనిపించేలా షూట్ చేయాలి. ఇలా బరువైన వీణ మోస్తూ ఎం ఎస్ సుబ్బులక్ష్మి గోడ మీద బ్యాలెన్స్ తప్పకుండ నడవడం కష్టం కాబట్టి వీణ కు బదులు తేలికగా ఉండే తంబూరా అందించారు.


అసలు కర్నాటక సంగీత గాయకురాలైన ఎంఎస్ ని నారదుడి పాత్రకు ఎందుకు ఎంపిక చేశారు? దీని వెనక వైవి రావు దూరాలోచన ఉంది. ఆ రోజుల్లో యాక్టర్లంతా సొంతంగా పాడుకునే వారు. అంతేకాదు, చిత్రాలన్నీ కూడా సంగీత ప్రధానంగా ఉండేవి. ఇందులో నారదుడికి చాలా పాటలున్నాయి. వీటికి సుబ్బలక్ష్మి అయితే పాటలు హిట్ అవుతాయని వైవి రావు భావించారు. ఆమెను ఒప్పించారు. ఈ సినిమాలో 18 పాటలున్నాయి. వాటిని పాపానాశం శివన్ రాశారు.


మొత్తానికి సావిత్రి చిత్రం తయారయింది. నిర్మాణమంతా కలకత్తా లోని న్యూ ధియోటర్ స్టూడియోలో జరిగింది. ఆ రోజుల్లో మద్రాసులో స్డూడియోలు లేవు. స్టూడియోలు కావాలంటే కోల్లాపూర్ లేదా కలకత్తా వెళ్లాల్సిందే. ఈ సినిమాలో సావిత్రి చెలికత్తెల్లో ఒకరి పేరు వి. ఎన్ జానకి. తర్వాత ఆమె ఎంజి రామచంద్రన్ భార్య అయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా కొన్నాళ్లు పని చేశారు.


ఇప్పటిలాగానే ఆ రోజుల్లో చిత్ర నిర్మాణ వార్తలని కూడా తెగ చదివేవారు, చర్చించుకునే వారు. వైవి రావు నారదుడి పాత్రకు ఎంఎస్ సబ్బులక్ష్మిని ఎంపిక చేశారనే వార్త వైరలయ్యింది. కొద్ది రోజుల పాటు ఎక్కడ చూసినా అదే చర్చ సాగింది.


ఈ చిత్రం సెప్టెంబర్ 4,1941 లో విడుదలయింది. అంతా అనుకున్నట్లే నారదుడి పాత్రలో ఎంఎస్ పాడిన కీర్తనలు సూపర్ హిట్ అయ్యాయి. సంగీత ప్రియులు ఇప్పటికీ వాటిని విని తరిస్తుంటారు. అయితే, సినిమా విజయవంతంకాలేదు. చిత్రంలో సంత్యవంతుడిగా వైవి రావే నటించారు.


అన్నట్లు మరొక విషయం, సావిత్రి చిత్రంలో ఎంఎస్ సుబ్బులక్ష్మికి వచ్చిన పారితోషికంతోనే ఆమె భర్త సదాశివన్ కల్కి తమిళ పత్రిక స్థాపించారని చెబుతారు.


Read More
Next Story