
సుహాస్ ‘హే బలవంత్’ రివ్యూ
ఫస్ట్ హాఫ్ నవ్వులు… క్లైమాక్స్‌లో కన్నీళ్లు?
ఏ కొడుకుకి అయినా తండ్రే రోల్ మోడల్. అయితే కృష్ణ (సుహాస్) కి ఇంకాస్త ఎక్కువ. తల్లిలేకపోవటంతో అన్ని తానే చూసుకునే తండ్రి రావు బల్‌వంత్ (నరేశ్) అంటే ఆరాధన. ఎప్పటికైనా ఆయనలా అవ్వాలని, ఆయన స్దాయికి వెళ్ళాలని, ఆయన బిజినెస్ ని టేకోవర్ చేసుకోవాలని కోరిక. అందుకోసం ఓ వయస్సు వచ్చే దాకా వెయిట్ చేసి, ఓ సుముహూర్తం చూసి తన తండ్రిని ఆ వ్యాపారం తన చేతిలో పెట్టమని అడుగుతాడు. మొదట ఒప్పుకోకపోయినా తర్వాత కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో వేరే దారిలేక ఆ వ్యాపారం తన కొడుక్కి అప్పచెప్తాడు. దాంతో తను పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యిపోయాడని కలలు కని, ఎంతో ఊహించుకుంటూ ఆ బిజినెస్ సామ్రాజ్యంలోకి అడుగుపెడతాడు.
ఇంతాచేస్తే ఇంతకాలం అతనికి తన తండ్రి వ్యాపారం గురించి తెలియదు. ఇప్పుడే తెలుస్తుంది. తెలిసాక అతనికి షాక్ కలుగుతుంది. ఇంతకాలం ఇలాంటి వ్యాపారం కోసమా తను ఎదురుచూసింది అని క్రిందపడి ఏడవాలి అనిపిస్తుంది. ఇంక ఆ వ్యాపారం చేతికి వచ్చాక , ఈ విషయం తెలిసి గర్ల్ ప్రెండ్ మిత్ర (శివానీ నగరం) దూరం అవుతుంది. జీవితంలో చాలా జరుగుతాయి. ఓ టైమ్ లో వ్యాపారం వదిలేద్దామనుకుంటాడు. వద్దనుకుంటాడు. కానీ వదిలేసి వెళ్లలేని పరిస్దితిలు ఏర్పడతాయి. ఇంతకీ వారసత్వంగా వచ్చిన ఆ వ్యాపారం ఏమిటి..ఆ వ్యాపారం ..కృష్ణ జీవితంలో ఎలాంటి తుపాన్లు రేపింది. చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
కొన్ని సినిమాలు కథ వల్ల కాదు… కథ చెప్పే విధానం వల్ల గుర్తుండిపోతాయి. Hey Balwanth కూడా అలాంటి ప్రయత్నం చేసిన సినిమా. ఇది అసలు కొత్త కథ కాదు. ఒక సామాజికంగా అసౌకర్యం కలిగించే వృత్తి చుట్టూ తిరిగే మనిషి కథ. కానీ దర్శకుడు గోపీ అచ్చర దాన్ని సీరియస్ డ్రామాగా కాకుండా కామెడీగా మొదలుపెట్టడం మంచి నిర్ణయం. ఫస్టాఫ్ చూసేటప్పుడు దర్శకుడు చెప్పాలనుకున్నది, చూపించాలనుకున్నది ఒకటి కాదు అని అర్దమవుతుంది.
సినిమా ఫస్టాఫ్ ఎందుకు బాగా వర్క్ అయిందంటే, అది కథ బలం వల్ల కాదు… స్క్రీన్‌ప్లే బలం వల్ల. నరేష్ చేసే బిజినెస్‌ను సినిమా ఆరంభంలోనే ప్రేక్షకుడికి చెప్పారు. కానీ హీరోకి మాత్రం తెలియదు. ఇక్కడినుంచి ప్రతి సీన్‌కి ఒక ప్రత్యేకమైన టెన్షన్ వస్తుంది. హీరో సాధారణంగా మాట్లాడే మాటలు ప్రేక్షకుడికి డబుల్ మీనింగ్‌గా వినిపిస్తాయి. అదే నవ్వు పుట్టిస్తుంది. ఇది చాలా పాతదే కానీ చాలా ఎఫెక్టివ్ టెక్నిక్.
ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ ఒకసారి చెప్పినట్లు ...“ప్రేక్షకుడికి ముందే నిజం తెలిస్తే సీన్ ఆసక్తికరంగా మారుతుంది.” ఇక్కడ అదే జరిగింది. ఇది సస్పెన్స్‌కు మాత్రమే కాదు, కామెడీకి కూడా పనిచేస్తుంది. లాడ్జ్ సీన్స్, మిస్ అండర్‌స్టాండింగ్స్, అన్నీ ఈ ఒకే విషయం మీద నిలబడ్డాయి. అందుకే సినిమా ఫస్టాఫ్ తేలికగా, సరదాగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగానే పండింది. అజయ్ ఘోష్, హర్షవర్ధన్ పాత్రలు ముందే ప్లాంట్ చేయటంతో, హీరోయిన్ ఆర్థోడాక్స్ ఫ్యామిలీ ట్రాక్ ముందుగానే సూచించడం వంటివన్నీ తర్వాత పే ఆఫ్ అయ్యాయి.
అయితే ఇక్కడినుంచి సినిమా వేరే దారిలోకి వెళ్లిపోతుంది. ఫస్టాఫ్ అంతా ఒక సీక్రెట్ ని హీరో నుంచి దాస్తూ కామెడీగా సాగిన కథ, ఒక్కసారిగా కిడ్నాప్ డ్రామాగా మారుతుంది. డెడ్ బాడీ కోసం తిరిగే గ్యాంగ్స్, అజయ్ ఘోష్ ఇంటి ఎపిసోడ్, గందరగోళం — కొన్ని చోట్ల నవ్వులు ఉన్నా కథ భావం మారిపోతుంది. మనం చూస్తున్న సినిమా జానర్ మారిపోతుంది. మనం కామెడీ చూస్తున్నామని అనుకుంటే సినిమా క్రైమ్ డ్రామా అవుతుంది.
అలాగే డెడ్ బాడీ ట్రాక్ ముగిసిన తర్వాత చివరి ఇరవై నిమిషాల్లో సినిమా పూర్తిగా మరో యాంగిల్ లోకి మారిపోతుంది. దర్శకుడు ఇప్పటిదాకా నవ్వించాం కదా అనుకుని భావోద్వేగాన్ని బలంగా చెప్పాలనుకుంటాడు. తండ్రి–కొడుకు సంబంధం, వృత్తి వెనుక ఉన్న మనిషి బాధ, సమాజం తీర్పు — ఇవన్నీ ఒకేసారి చెప్పాలని ప్రయత్నిస్తాడు. సమస్య ఏమిటంటే ప్రేక్షకుడు అంతవరకు నవ్వుతున్నాడు. ఒక్కసారిగా అతనిని ఏడవమంటే అతను సిద్ధంగా ఉండడు.
టెక్నికల్ గా ...
పాటల్లో వివేక్ సాగర్ మార్క్ మిస్ అయినా, నేపథ్య సంగీతం (BGM) మాత్రం ఆకట్టుకుంది. కెమెరా పనితనం పర్వాలేదు. కథా నేపథ్యం వల్ల అక్కడక్కడా డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్నాయి. అయితే డైలాగ్స్ మాత్రం బాగా రాసారు. సినిమాకు ఇవి బాగా ప్లస్ అయ్యాయి. నవ్విస్తూనే ఎమోషనల్ కథ చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం చాలా వరకూ వర్కవుట్ అయ్యినట్లే.
ఎవరెలా చేసారు.
సుహాస్ నటన ఓకే, అలాగే నరేష్ తన హుందాతనంతో సినిమాను నిలబెట్టారు. హీరోయిన్ శివాని పర్వాలేదు, మిగిలిన నటులు తమ పరిధి మేరకు నటించారు. వెన్నెల కిషోర్, అజయ్ ఘోష్ , సుదర్శన్ సినిమాని పడిపోకుండా ఓ రకంగా కాపు కాచారని చెప్పాలి.
ఫైనల్ థాట్
సినిమా చూసేటప్పుడు బాగానే టైమ్ పాస్ అవుతుంది… బయటకు వచ్చేసరికి మాత్రం అది మనసులో బలంగా మిగలదు. ఎంటర్టైన్‌మెంట్ నుంచి ఎమోషన్‌కు వెళ్లే ఆ అంతర్గత ప్రయాణం స్క్రీన్‌ప్లేలో కరెక్ట్ గా సెట్ అయితే సినిమా నెక్ట్స్ లెవిల్ లో ఉండేది. అయితేనేం ఓ సారి చూడచ్చు.

