
'సుమతీ శతకం' మూవీ రివ్యూ
కామెడీ కాపాడిందా.. ముంచేసిందా?
తూర్పుగోదావరి జిల్లా వైకుంఠపురం గ్రామానికి చెందిన కృష్ణ (అమర్‌దీప్)కి చిన్నప్పటి నుంచి ఒకటే కోరిక.. అది 'పెళ్లి'. ఊరిలో ఎవరి పెళ్లి జరిగినా అక్కడ కృష్ణ ఉండాల్సిందే, "నాకూ పెళ్లి చేయండ్రా బాబూ" అని గోల గోల చేస్తూంటాడు. కానీ పెద్దయ్యాక అందరికీ పెళ్లిళ్లు అవుతాయి. తప్పించి అతనికి మాత్రం కాదు, అందుకు కారణం కృష్ణ కిరాణా కొట్టు నడుపుకోవటమే. అది అతనికి పెద్ద బెంగగా మారుతుంది. దానికి తోడు జాతరలో పెళ్లి చేసుకుంటానని నానమ్మకు ఇచ్చిన మాట అతడిని వేధిస్తూనే ఉంది.
ఇలా పూర్తి నిరాశలో ఉన్న కృష్ణకు ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాట కొత్త ఆశలు రేకెత్తిస్తుంది. "నీకు దేవత లాంటి భార్య వస్తుంది" అని చెప్పడంతో వెతుకులాట మొదలుపెడతాడు. ఆ క్రమంలోనే పక్క ఊరి అంగన్‌వాడీ టీచర్ సుమతి (సైలీ చౌదరి)ని చూసి తొలిచూపులోనే ఫ్లాట్ అయిపోతాడు. కొన్నాళ్లకు సుమతి కూడా కృష్ణ ప్రేమను అంగీకరిస్తుంది కానీ.. అక్కడ ఒక ఊహించని ట్విస్ట్ పెడుతుంది!
"నన్ను పెళ్లి చేసుకోవాలంటే నీకు చాలా ధైర్యం ఉండాలి.. ధైర్యం ఉంటే ఒకసారి శుక్రవారం మా ఊరికి రా" అని సుమతి కండీషన్ పెడుతుంది. ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఆ ఊరెళ్లిన కృష్ణకు అక్కడ కనిపించిన సీన్ చూసి కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. తాను ప్రాణంగా ప్రేమించిన సుమతి గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఆ క్షణం వరకు ఉన్న 'ప్రేమ' కాస్తా వెన్నులో వణుకు పుట్టించే 'భయం'గా మారిపోతుంది. అసలు సుమతి వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? దేవత అనుకున్న సుమతిలో కృష్ణ ఏం చూశాడు? కిరాణా కొట్టు కృష్ణ.. ఆ భయాన్ని జయించి సుమతిని పెళ్లి చేసుకున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే!
ఎనాలసిస్
టాలీవుడ్‌లో ఇప్పుడు చిన్న సినిమాల హవా నడుస్తోంది. కోట్ల రూపాయల బడ్జెట్, భారీ స్టార్ కాస్టింగ్ లేకపోయినా.. కేవలం 'కంటెంట్' నమ్ముకుని వచ్చిన సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. అయితే, ఒక చిన్న సినిమా ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించాలంటే కేవలం కథ ఉంటే సరిపోదు.. ఆ కథను చెప్పే విధానంలో (Screenplay) కొత్తదనం, పాత్రల్లో నిజాయితీ ఉండాలి. ముఖ్యంగా స్టార్ ఇమేజ్ లేని చోట, నటులు తమకంటూ ఒక సొంత ముద్ర వేసుకోవాలి. మరి ఈ సూత్రాలు అమర్‌దీప్ నటించిన 'సుమతీ శతకం'లో వర్కవుట్ అయ్యాయా అంటే లేదనే చెప్పాలి.
అలాగే చిన్న సినిమాలకు కామెడీనే పెద్ద దిక్కు. కానీ అది కథలో అంతర్భాగంగా ఉండాలి. 'సుమతీ శతకం'లో టేస్టీ తేజ కామెడీ ట్రాక్ సినిమాకు ప్రధాన మైనస్‌గా మారింది. కామెడీ అంటే కేవలం పంచ్ డైలాగులు వేయడం కాదు, సందర్భానుసారంగా నవ్వించాలి. కానీ ఇక్కడ తేజ చేసిన ఓవరాక్షన్, సాగదీసిన సన్నివేశాలు ఆడియన్స్‌కు వినోదాన్ని ఇవ్వకపోగా, చిరాకు తెప్పించాయి. మహేష్ విట్టా లాంటి నటులు ఉన్నా, వారిని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు.
కథలో హీరో ఎదుర్కొనే సమస్య (Conflict) ఎంత బలంగా ఉంటే, క్లైమాక్స్ అంత పండుతుంది. ఈ సినిమాలో పెళ్లి చుట్టూ అల్లుకున్న సెంటిమెంట్ బాగున్నా, విలనిజం చాలా వీక్‌గా ఉంది. హీరో ఎదుర్కొనే సవాళ్లు చాలా సాధారణంగా, ఊహకందేలా ఉండటంతో సినిమాలో ఉత్కంఠ (Suspense) లోపించింది. ఇంటర్వెల్ లో ఇచ్చిన ట్విస్ట్ బాగున్నా, సెకండాఫ్ ఆ వేగాన్ని అందుకోలేక చతికిలపడింది.
ఎవరెలా చేసారు
హీరోగా చేసిన అమర్‌దీప్ తన ఫేవరెట్ హీరో రవితేజను ఇమిటేట్ చేస్తున్నట్లు అనిపించింది. బాడీ లాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీ వరకు రవితేజను దింపేయడంతో, అమర్ తన సొంత మార్కును మిస్ అయ్యాడు.
హీరోయిన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే... లవ్ సీన్స్‌లో ఓకే అనిపించిన సైలీ చౌదరి, 'దేవత' ఆవహించినప్పుడు చేయాల్సిన పవర్‌ఫుల్ నటనలో తేలిపోయింది. ఆమెలో అమ్మవారిని చూడలేకపోవడం సినిమాకు పెద్ద మైనస్. మిగతా ఆర్టిస్ట్ లు సోసోగా చేసుకుంటూ పోయారు.
టెక్నికల్ గా..
ఇలాంటి సినిమాలకు అవసరమైన స్క్రిప్టే మైనస్ గా మారటం దెబ్బ కొట్టింది. సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ కెమెరామెన్ హలేష్ ఎస్. తూర్పుగోదావరి జిల్లాలోని పల్లెటూరి అందాలను, నేచురల్ లొకేషన్లను తన లెన్స్ లో చాలా అందంగా బంధించారు. విజువల్స్ అన్నీ కళ్లకు కట్టినట్లు ఉన్నాయి. అయితే, ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు సాగదీసినట్లు అనిపించడం సినిమా ఫ్లోను దెబ్బతీసింది. ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉంటే సినిమా వేగం పెరిగేది. పల్లెటూరి లొకేషన్లు, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నా, కథనం ఊహకందేలా సాగడం వల్ల ఆడియన్స్‌లో ఆసక్తి తగ్గుతుంది.
ఫైనల్ థాట్
ఒక్క మాటలో చెప్పాలంటే: బాటిల్ కొత్తదే కానీ.. లోపల ఉన్న మందు పాతదే!

