
సందీప్ కిషన్ 'మజాకా' రివ్యూ
తెలుగు,తమిళ్ లో సక్సెస్ ఫుల్ ఫార్ములా ఒకటి చాలా కాలంగా నడుస్తోంది.
తెలుగు,తమిళ్ లో సక్సెస్ ఫుల్ ఫార్ములా ఒకటి చాలా కాలంగా నడుస్తోంది. అది మరేదో కాదు. కొద్దిగా డిఫరెంట్ స్టోరీ లైన్ , దాన్ని ఎంటర్ట్మెంట్ వేలో చెప్పే స్క్రీన్ ప్లే, మధ్యలో కొంచెం యాక్షన్, పాటలు, చివర్లో కాస్తంత సెంటిమెంట్. అయితే ఏది మోతాదు ఎక్కువైనా రొటీన్ సినిమాగా మిగిలిపోతుంది. ప్రిడిక్టబుల్ అని తేల్చేశారు. ఇది కత్తిమీద సాము లాంటి వ్యవహారం. సందీప్ కిషన్ తాజా మూవీ 'మజాకా' కూడా కొంచెం అటూ ఇటూలో అదే ఫార్మలా ఫాలో అయ్యింది . కాలక్షేపమే ప్రధాన ఎలిమెంట్ గా తీసిన ఈ సినిమా సందీప్ కిషన్ కు హిట్ ఇచ్చిందా, అసలు కథేంటి, ప్లస్ లు, మైనస్ లు ఏమిటో చూద్దాం.
స్టోరీ లైన్
తండ్రి కొడుకులైన రమణ (రావు రమేష్), కృష్ణ (సందీప్ కిషన్) ఫ్రెండ్స్ లా తిరుగుతూంటారు. ఇద్దరూ బ్యాచిలర్స్. దాంతో ఆ ఇంట్లో ఆడదిక్కు లేకపోవటంతో మెల్లిమెల్లిగా అదే పెద్ద సమస్యగా మారిపోతుంది. ముఖ్యంగా కృష్ణ కు పెళ్లి సంబంధాలు దగ్గరకి వచ్చేసరికి ఆ సమస్య బాగా హైలెట్ అవుతూ, ఏదీ సెట్ కాదు. ఈ సమస్య పోవాలంటే లేటు వయసులో రమణ మరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అప్పుడే రమణ కు యశోద (అన్షు) కనిపిస్తుంది. ఆమెని చూడగానే అన్షునే తమ ఇంటికి ఆడదిక్కు అని ఫిక్సైపోతాడు. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. ఆమెను ప్రేమలో పడేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూంటాడు.
మరో ప్రక్క కృష్ణ తన కాలేజీలోనే చదివే మీరా (రీతూ) ప్రేమలో పడతాడు. దాంతో తండ్రి, కొడుకులు ఇద్దరూ పోటీపడి మరీ ప్రేమ లేఖలు రాసుకుంటూ, తమ ప్రేయసిలను ఇంప్రెస్ చేసే పనిలో ఉంటారు. ఈ క్రమంలో ఇద్దరి ప్రేమ కథ కొలిక్కి వచ్చే ఓ రోజు వస్తుంది. అప్పుడే ఓ ట్విస్ట్ పడుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి..దాని వలన వారి ప్రేమ లో ఎలాంటి కొత్త సమస్యలు వచ్చాయి. అంతేకాదు. వీరి కథలోకి పగే ప్రాణంగా బ్రతుకుతున్న భార్గవ్ వర్మ (మురళీ శర్మ) ఎలా ఎంటరయ్యాడు. అసలు భార్గవర్ వర్మ ఎవరు...చివరకు ఈ ప్రేమ కథలు ఎలా సుఖాంతం అయ్యాయి అనేది తెరపై చూడాల్సిన మిగతా కథ.
విశ్లేషణ
పైన చెప్పుకున్నట్లు స్టోరీ పాయింట్ గా కొత్తగా అనిపించినా, ఇది పూర్తిగా ఫార్ములాతో నడిచే కథనమే. అయితే రావు రమేష్ ఏజ్ బార్ ప్రేమ కథ ఇంట్రెస్టింగ్ గా మలచటంతో ఉన్నంతలో నవ్వులు బాగానే కురిసాయి. ఇంట్రవెల్ కూడా బాగా సెట్ అయ్యింది. అయితే ట్విస్ట్ రివీల్ అయ్యే దాకా సరదాగా నడిచిన ఈ కథ సెకండాఫ్ కొద్దిగా సీరియస్ గా మారుతుంది. అక్కడ నుంచి నత్త నడక నడవడం మొదలెడుతుంది. సినిమాలో మేజర్ కాంప్లెక్స్ కు సంబంధించిన సీన్స్ ను మాత్రం సరిగ్గా డీల్ చేయలేదు. ఆ ప్లేస్ లో డ్రామా పండలేదు.
ఏదో మొక్కుబడిగా కథను ఎక్కడో చోట, ఎలాగోలా రివీల్ చేయాలి కాబట్టి చేసినట్లు ఉంటుంది. దాంతో ఫస్టాఫ్ లాగే సెకండాఫ్ కూడా ఫన్ ఉంటుందని భావించిన మనం బోల్తా పడతాం. ఏదో హడావిడిగా ముగిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎమోషన్ ని క్లైమాక్స్ లో కి తెచ్చినా జస్ట్ ఓకే అన్నట్లుంటుంది. సెంటిమెంట్ ని పండించాలనుకున్నప్పుడు అందుకు తగ్గ బేస్ స్ట్రాంగ్ గా ఉండాలి. కామెడీ సీన్స్ కు ఇచ్చిన ప్రయారిటీ ఈ బాక్స్ కు ఇవ్వలేదు.
ఎవరెలా చేశారు
ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా సందీప్ కిషన్, రావు రమేష్ కాంబినేషన్ అయితే బాగా పడింది. కొన్ని సీన్స్ లో ఇద్దరు పోటీపడి చేశారు.. రావు రమేష్ కామెడీ టైమింగ్, పంచులు బాగా పేలాయి. పర్ఫెక్ట్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కాదు కానీ ఓ మోస్తరు కామెడీ సినిమా చూసిన ఫీల్ వీళ్లిద్దరూ తేగలిగారు
దర్శకుడుగా నక్కిన త్రినాథరావు ప్రత్యేకమైన మెరుపులు ఏమి ఉండవు. అయితే కామెడీని బాగా పండించారు. అదే కష్టం. ఆ విషయంలో వంద శాతం మార్కులు పడతాయి. రచయితగా బెజవాడ ప్రసన్న కుమార్..కూడా కామెడీ సీన్స్ బాగా రాస్తున్నారు. కానీ వాటిని కథలో పూర్తిగా బ్లెండ్ చేయలేకపోతున్నారు. ఆ కనెక్టివిటీ ఇవ్వగలిగితే నెక్స్ట్ లెవల్ లో ఉండేది.
టెక్నికల్ గా ..లియోన్ జేమ్స్ మ్యూజిక్ కి ఈ సినిమాకు ఏమీ ఉపయోగపడలేదు. పాటలు క్లిక్ అవ్వలేదు. సొమ్మసిల్లి పాట బాగున్నా ప్లేస్ మెంట్ సరిగ్గా లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఫాస్ట్ ఫేస్ లో నడిచిన ఎడిటింగ్ ఈ సినిమాని చాలా చోట్ల కాపాడింది.
చూడచ్చా
ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా కాలక్షేపం కోసం చూడాలనుకుంటే ట్రై చేయాలి. నాన్ స్టాప్ కామెడీ మాత్రం ఎదురు చూడవద్దు.
నటీనటులు: సందీప్ కిషన్, రావు రమేష్, రీతూవర్మ, అన్షు, మురళీశర్మ, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు, హైపర్ ఆది తదితరులు;
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్నకుమార్ బెజవాడ, సాయి కృష్ణ;
సంగీతం: లియోన్ జేమ్స్;
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ;
నిర్మాణం: రాజేశ్ దండ;
దర్శకత్వం: త్రినాథరావు నక్కిన;
విడుదల: 26-02-2025