సూపర్ నేచురల్ హారర్ సినిమా ‘అమ్మ’ (Umma) రివ్యూ
ఈ సినిమాలో విచిత్రం ఏమిటంటే... చనిపోయిన తల్లి.. కూతురి మీద పగతీర్చుకోవడం కోసం ఆత్మగా తిరిగొస్తుంది.
సాధారణంగా మన సినిమాల్లో తల్లి చనిపోయి ఆత్మగా మారి తన పిల్లలుకు వచ్చే కష్టాల నుంచి బయిటపడేయటానికి ట్రై చేస్తూంటుంది. కానీ ఈ సినిమాలో విచిత్రం ఏమిటంటే... చనిపోయిన తల్లి.. కూతురి మీద పగతీర్చుకోవడం కోసం ఆత్మగా తిరిగొస్తుంది. గమ్మత్తుగా అనిపిస్తోంది కదూ.. కొత్త తరహా కథలు చేయకపోతే జనం ఆదరించరనుకుంటున్నారో ఏమో కానీ ఇలాంటి కాన్సెప్ట్ తో ఈ సూపర్ నాచురల్ హారర్ చిత్రాన్ని రూపొందించారు.
అమాండ (సాండ్రా ఓ) తన టీనేజ్ కూతురు క్రిస్ (ఫివెల్ స్టెవార్ట్) తో కలిసి సిటీకి దూరంగా ఒక ఫార్మ్ హౌజ్‌లో జీవిస్తుంటారు. (అలా జనాలకు దూరంగా ఇద్దరే ఉండకపోతే హారర్ సెటప్ కుదరదు కదా)., వీరిద్దరూ తేనెటీగలు పెంచుతూ వాటి నుంచే తేనె ను అమ్ముతూ జీవితాన్నిలాగుతూంటారు. మధ్య మధ్యలో పుస్తకాలు చదవటం, కోళ్ల పెంచటం వంటి వ్యాపకాలు కూడా ఉంటాయి. ఇక అమాండకు ఎలక్ట్రానిక్ గూడ్స్ అంటే విరక్తి. చివరకు ఫోన్ కూడా వాడదు. మొత్తం ఇంట్లో ఉన్న వైర్లు అన్ని తీసేసి బేస్మెంట్ లో పడేసి తాళం వేస్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉంటారా అంటే అలా ఉంటేనే కదా హారర్ కథ రక్తి కట్టేది. భవిష్యుత్తులో అంటే కథలో కొంతదూరం వెళ్లాక హారర్ మొదలయ్యాక వేరే వారికి ఫోన్ చేద్దామంటే ఫోన్ కూడా ఉండకూడదు కదా. ఇలా వాళ్లు మనుష్యులతో పెద్దగా రిలేషన్ కూడా పెట్టుకోరు. ఇంటికే వచ్చి తేనె కొనక్కుని వెళ్లే వ్యక్తి ఒకరే వస్తూంటారు.
కథ ఇలా నడుస్తూంటే...అమాండా బాబాయ్ ఓ రోజు ఆమెను వెతుక్కుంటూ వస్తాడు. అతను తనతో పాటు అమాండ తల్లి అస్దికలు తెస్తాడు. అమాండాకు తల్లికి సంభంధ భాంధవ్యాలు లేవు అన్నమాట. దాంతో తల్లి అస్దికలు తెచ్చారన్నా పెద్దగా ఆసక్తి చూపించదు. కానీ కూతురుగా అమాండ తన తల్లి కు కర్మ కాండలు కొరియన్ సంప్రదాయాలు ప్రకాకరం చేస్తే ఆమె ఆత్మ శాంతిస్తుందని చెప్తాడు. ఓ భాక్స్ ఇస్తాడు. అందులో తల్లి ఉపయోగించే మాస్క్, ఆమె ధరించే డ్రెడిషనల్ గౌన్ ఉంటుంది. అయితే ఎప్పుడైతే అవి ఆ ఇంటికి వస్తాయో అక్కడ నుంచి అమాండకు సమస్యలు వస్తాయి.
అమాండకు తల్లి ఆత్మ కనిపించటం మొదలవుతుంది. తల్లి బ్రతికుండగా అంటే అమాండ చిన్నప్పుడు చాలా టార్చర్ పెట్టిందన్నమాట. ఇప్పుడు కూడా చచ్చి సాధించటానికి ఆత్మ రూపంలో ఆ ఇంటికి వచ్చిందన్నమాట. అప్పుడు తల్లితో ఆమెకు ఉన్న ఎక్సపీరియన్స్ లు ప్లాష్ బ్యాక్ లుగా వస్తాయి. అప్పుడు మనకు అర్దమవుతుంది అమాండకు కరెంట్ అన్నా ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్నా ఎందుకు అంత భయమో..ఎందుకంత.దూరం పెడుతుందో అని. అక్కడ నుంచి ఆ తల్లి ఆత్మ రూపంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అమాండా ఎలా తప్పించుకుంది..చివరకు ఏమైంది అనేది మిగతా కథ.
ఐరిస్ అనే ఈ దర్శక,రచయితకు ఇదే మొదటి సినిమా. యాంటి సెంటిమెంట్ తో తెరకెక్కించాడు. ఇందులో కొరియన్ ఆచార,వ్యవహారాలు, సంప్రదాయాలును కూడా కలిపి భయపెట్టాడు. సైక్లాజికల్ సోషియాలజికల్ అంశాలను టచ్ చేస్తూ స్టోరీని నేరేట్ చేసారు. అయితే అనుకున్న స్దాయిలో భయపెట్టలేకపోయారు. రెగ్యులర్ హర్రర్ ట్రాపింగ్స్, ఎత్తుగడలు పెద్దగా ఆసక్తి కలిగించవు. సౌండ్ తో భయపెట్టాలనుకునే కార్యక్రమం మన హారర్ సినిమాల్లో ఎన్నో ఏళ్లగా చూస్తున్నదే. అలాగే కేవలం భయపెట్టడం ఒకటే లక్ష్యమైనా, సస్పెన్స్, టెన్షన్ లేకపోతే ఇలాంటి కథలు రక్తి కట్టవు. ఏదమైనా అప్పటికప్పుడు ఏదో అలా చూసేసే సినిమానే కానీ చాలా కాలం పాటు గుర్తుండే సినిమా మాత్రం కాదు.
చూడచ్చా
పెద్దగా భయపెట్టని ఈ హారర్ సినిమా ఎక్సపెక్టేషన్స్ లేకుండా చూడటానికి పనికొస్తుంది.
ఎక్కడుంది.
అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. (తెలుగులో...)