ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా డి.సురేశ్‌బాబు
x

ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడిగా డి.సురేశ్‌బాబు

అనుభవమే ఆయుధమా?

టాలీవుడ్‌లో సినిమాల కంటే ఎక్కువ హీట్ కలిగించే ఉన్న విషయం ఏదైనా ఉందంటే… అది ఫిల్మ్ ఛాంబర్ రాజకీయాలే. తెర ముందు హీరోల పోటీ అయితే, తెర వెనుక నిర్మాతల మధ్య శక్తి సమీకరణాలు మారుతుంటాయి. అలాంటి కీలక సమయంలోనే తెలుగు సినిమా పరిశ్రమలో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సారి అనుభవం, సమతూకం, పరిశ్రమపై పట్టున్న వ్యక్తి మళ్లీ ముందుకు వచ్చారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కొత్త అధ్యక్షుడిగా దగ్గుబాటి సురేష్ బాబు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక కేవలం ఒక పదవి మార్పు మాత్రమే కాదు… రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో తీసుకోబోయే కీలక నిర్ణయాలకు ముందుమాటగా ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

హైదరాబాద్‌లో జరిగిన ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య నేరుగా పోటీ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ స్పష్టమైన ఆధిక్యతతో విజయం సాధించింది. మొత్తం 48 కార్యవర్గ స్థానాలకు గానూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 31 మంది గెలుపొందగా, మన ప్యానెల్ నుంచి 17 మంది విజయం సాధించారు. ఈ ఫలితాలతో అధ్యక్ష పదవి డి.సురేశ్‌బాబుకు దక్కింది.

ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు, స్టూడియో సెక్టార్ అనే నాలుగు విభాగాలు ఉంటాయి. ప్రతి ఏడాది ఒక విభాగానికి చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు. ఈసారి ప్రదర్శనకారుల విభాగం నుంచి డి.సురేశ్‌బాబు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నాలుగు విభాగాలు కలిసి కార్యవర్గాన్ని ఎంపిక చేయగా, కీలక పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఖాతాలోకే వెళ్లాయి.

కొత్త కమిటీలో కార్యదర్శిగా కె. అశోక్ కుమార్ ఎంపిక కాగా, ఉపాధ్యక్షులుగా నాగవంశీ, భరత్ చౌదరి, పి. కిరణ్ బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా ముత్యాల రామదాసు ఎన్నికయ్యారు. హైదరాబాద్, విజయవాడ, గుంటకల్లు, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రాంతాల నుంచి సంయుక్త కార్యదర్శులు కూడా నియమితులయ్యారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు ఛాంబర్ బాధ్యతలు నిర్వర్తించనుంది.

ఎవరెవరు...

అధ్యక్షుడిగా డి.సురేశ్‌బాబు, ఉపాధ్యక్షులుగా సూర్యదేవర నాగవంశీ, భరత్‌ చౌదరి, పి.కిరణ్, కార్యదర్శులుగా కె.అశోక్‌కుమార్‌ (హైదరాబాద్‌), కె.వి.వి.ప్రసాద్‌ (విజయవాడ), కోశాధికారిగా ముత్యాల రామదాసు, సంయుక్త కార్యదర్శులుగా విజేందర్‌రెడ్డి (హైదరాబాద్‌), మోహన్‌ వడ్లపట్ల (హైదరాబాద్‌), జి.వీరనారాయణ బాబు(విజయవాడ), జి.మహేశ్వర రెడ్డి(గుంతకల్లు), ఎన్‌.నాగార్జున(తిరుపతి), కె.అప్పలరాజు (విశాఖపట్నం)లను ఎన్నుకున్నారు.

ఇక డి.సురేశ్‌బాబు పేరు చెప్పగానే టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆయన సీనియర్ నిర్మాత మాత్రమే కాదు, నటుడు రానా దగ్గబాటి తండ్రి, హీరో వెంకటేష్ సోదరుడు. గత కొన్నేళ్లుగా నేరుగా సినిమాలు నిర్మించకపోయినా, ఆయన నిర్వహిస్తున్న రామానాయుడు స్టూడియోస్ మాత్రం ఇప్పటికీ తెలుగు సినిమా పరిశ్రమకు కీలక కేంద్రంగా కొనసాగుతోంది. షూటింగ్ ఫ్లోర్లు, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు, స్టూడియో వ్యవస్థల పరంగా ఈ సంస్థ పాత్ర ఎవరూ కాదనలేనిది.

ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిలోకి సురేశ్‌బాబు రావడం అంటే కేవలం ఒక ఎన్నికల ఫలితం మాత్రమే కాదు. పరిశ్రమలో ఉన్న సమస్యలు, విభేదాలు, మారుతున్న మార్కెట్ పరిస్థితుల్లో ఒక సమతూకమైన నాయకత్వం అవసరం అనే సంకేతంగా కూడా దీనిని చాలామంది చూస్తున్నారు. నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? చిన్న సినిమాల సమస్యలు, థియేటర్ సిస్టమ్, డిజిటల్ ప్రభావం వంటి అంశాలపై ఛాంబర్ ఎలా స్పందిస్తుంది? అన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తోంది.

మొత్తానికి, తెర వెనుక టాలీవుడ్ పాలనలో కీలక అధ్యాయం మొదలైంది. డి.సురేశ్‌బాబు అధ్యక్షత్వంలో ఫిల్మ్ ఛాంబర్ ఏ దిశగా నడుస్తుందన్నది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

Read More
Next Story