ఓటీటీలో అదరగొట్టిన సినిమా తరుణ్ భాస్కర్‌తో రీమేక్.. ఏ ధైర్యంతో చేస్తున్నారో!
x

ఓటీటీలో అదరగొట్టిన సినిమా తరుణ్ భాస్కర్‌తో రీమేక్.. ఏ ధైర్యంతో చేస్తున్నారో!

ఓటీటిలో తెగ చూసిన సినిమాని తరుణ్ భాస్కర్‌తో ఏ ధైర్యంతో రీమేక్ చేస్తున్నారో కానీ ...కథ మాత్రం కేక


మలయాళంలో వచ్చి తెలుగు తమ్ముళ్లను కూడా ఆకట్టుకున్న మూవీ జయ జయ జయ జయహే. ఈ సినిమాను ఇప్పుడు తరుణ్ భాస్కర్ రీమేక్ చేయనున్నాడు. గత కొంతకాలంగా మలయాళ చిత్ర పరిశ్రమలో కంటెంట్‌ ఉన్న సినిమాలకే థియేటర్‌లో ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. స్టార్లు లేకపోయినా, మంచి కథ, కథనాలతో, రెండున్నర గంటల పాటు ఎంటర్టైన్ చేస్తే చాలు. ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటున్నారు. వాటిని మనం ఓటిటిలలో చూసి ఎంజాయ్ చేస్తున్నాము. అలా కంటెంట్‌తో వచ్చి భాక్సాఫీస్ దుమ్ము దులిపిన మలయాళ చిత్రం ‘జయ జయ జయ జయహే’.

కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌తో సినిమా తీస్తే, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా రూ.50కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఆ తర్వాత ఓటీటీలోనూ విడుదలైన ఈ సినిమా తెలుగు ఆడియోతోనూ అందుబాటులో ఉండటంతో ఇక్కడివాళ్ళూ దాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అంటారా… మన తరుణ్ భాస్కర్ హీరోగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తూండటమే గుర్తు చేసుకోవటానికి కారణం. ఇంతకీ ఈ సినిమా కథేంటి? తెలుగులో ఆల్రెడీ ఓటిటిలో వచ్చిన ఈ చిత్రాన్ని మనవాళ్ళు మళ్లీ చూస్తారా ?

ఈ చిత్రం కథ ఓ సారి చూస్తే.... జయభారతి (దర్శన రాజేంద్రన్‌) ఇండివీడ్యువల్ ఐడియాలజీ ఉన్న మధ్యతరగతి అమ్మాయి. ఇంటర్‌ పూర్తయి నెక్ట్స్ పెద్ద చదువులు చదుకోవాలనుకుంటుంది. ఇంట్లో వాళ్లని ఒప్పించి డిగ్రీలో చేరుతుంది. అదే కాలేజీలో ప‌నిచేసే అభ్యుద‌య భావాలు క‌లిగిన లెక్చ‌ర‌ర్‌ను ప్రేమిస్తుంది. కానీ ప్ర‌తి విష‌యంలో జ‌య‌ను అత‌డు అనుమానిస్తుంటాడు. వారి ప్రేమ విష‌యం ఇంట్లో తెలియ‌డంతో జ‌యకు ఇష్టం లేక‌పోయినా పెళ్లి నిర్ణయిస్తాడు. దాంతో ఆమె చదువు ఆపేసి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. పెళ్లయిన తర్వాత కూడా ఆపేసిన చదువును పూర్తి చేసి, ఉద్యోగం చేయాలన్నది ఆమె కోరిక.

అందుకు పెళ్లి చూపుల సమయంలో రాజేశ్‌ (బసిల్‌ జోసెఫ్‌) కూడా ఓకే చెప్తాడు. రాజేష్ కోళ్ల వ్యాపారం చేస్తుంటాడు. పెళ్లయిన తర్వాత అతడిలోని పురుషాహంకారం నిద్రలేస్తుంది. దానికి తోడు రాజేష్ ముక్కోపి. ప్రతి చిన్న విషయానికి అంతెత్తున లేస్తూంటాడు. తనదే పైచేయిగా ఉండాలనుకుంటాడు. భార్యని పూచిక పుల్లలా చూస్తూంటాడు. వ్యాపారంలో చిరాకులు కూడా భార్యపైనే చూపిస్తూ జయపై చేయి చేసుకుంటాడు. ఆమె ఇలా కొట్టడాన్ని సహించలేకపోతుంది.

పెళ్లికి ముందు అన్నింటికీ సరేనన్న భర్త, ఆ తర్వాత ఏది అడిగినా ‘తర్వాత చూద్దాంలే’ అనే మాటతో ‘పెళ్లి చేసుకుని తప్పు చేశానా’ అన్న భావన కలుగుతుంది. జయ తన తల్లిదండ్రులతో చెబితే ‘సర్దుకుపో అమ్మా’ అని సముదాయిస్తూంటారు. ఇంట్లో టార్చర్ ఎక్కువైపోతుంది. దాంతో పిల్లిని అయినా తలుపు లేసి కొడితే తిరగబడుతుందన్నట్లు ...ఓ సారి అలా కోపంగా కొడుతున్న భర్త రాజేశ్‌పై జయ తిరగబడుతుంది. రాజేష్‌కు అది ఊహించని పరిణామం. అక్కడ నుంచి జయను చూసి భయపడిపోతుంటాడు.

మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకొని జ‌య‌పై త‌న‌పై దాడి చేసింద‌ని రాజేష్ గ్ర‌హిస్తాడు. తాను మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకొని భార్య జ‌య‌పై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని అనుకుంటాడు. కానీ మ‌రోసారి భ‌ర్త‌ను చిత్తుగా కొట్టేస్తుంది జ‌య‌. మరో ప్రక్క రాజేశ్‌ను జయ కొడుతున్న వీడియో కాస్తా వైరల్‌ అవుతుంది. ఈ క్రమంలో భార్య‌పై ప్రతీకారం తీర్చుకోవ‌డానికి అత‌డు వేసిన మ‌రో ప్లాన్ ఏమిటి? రాజేష్ వేసిన ప్లాన్స్‌ను జ‌య ఎలా తిప్పికొట్టింది? జ‌య‌పై కోపంతో విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన రాజేష్‌కు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌య్యాయి? విడాకుల వరకూ వెళ్లిన ఈ జంట కథ ఏమైంది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఈ మూవీకి విపిన్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్‌గా పెద్ద విజ‌యాన్ని సాధించింది. భ‌ర్త పెట్టే చిత్ర‌హింస‌ల‌ను భ‌రించ‌లేక అత‌డిపై ఎదురుతిర‌గే భార్య పాత్ర‌లో ద‌ర్శ‌న రాజేంద్ర‌న్ న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఆడ‌పిల్ల‌ల ప‌ట్ల కుటుంబం, స‌మాజంలో క‌నిపించే వివ‌క్ష‌ను జ‌య క్యారెక్ట‌ర్ ద్వారా అర్థ‌వంతంగా చూపించారు ద‌ర్శ‌కుడు. మధ్య తరగతి కుటుంబంలో ఆడపిల్లను ఎలా పెంచుతారో వాటన్నింటినీ దర్శకుడు విపిన్‌ దాస్‌ చాలా చక్కగా చూపించారు. ప్రతి సన్నివేశం మన పక్కింట్లో లేదా మన ఇంట్లో జరుగుతున్నట్లు దీన్నొక న్యూఏజ్‌ డ్రామాగా తీర్చిదిద్దారు. అసలు ఆ అమ్మాయిదే సినిమా. జయ పాత్రలో ఈషా రెబ్బా కనిపించనుంది.

రాజేశ్‌ పాత్రలో బసిల్‌ జోసెఫ్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త పాత్రలో నవ్వులు పంచారు. ఆ పాత్రనే ఇప్పుడు తరుణ్ భాస్కర్ చేయబోతున్నారు. లాంగ్ గ్యాప్ త‌ర్వాత కీడాకోలా మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు త‌రుణ్ భాస్క‌ర్‌. నటుడుగానూ బిజీగా ఉంటున్నారు. నాగ‌చైత‌న్య దూత వెబ్‌సిరీస్‌లో నెగెటివ్ షేడ్ రోల్ చేశాడు. మంగ‌ళ‌వారం, దాస్ కీ ధ‌మ్కీతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌లు పోషించాడు త‌రుణ్ భాస్క‌ర్‌. చిన్న సినిమాల‌లో, వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తున్న త‌రుణ్ భాస్క‌ర్.. భార్య చేతిలో తన్నుల తినే పాత్రకు న్యాయం చేయగలరు. అయితే ఆల్రెడీ ఓటిటిలో చూసేసిన ఈ సినిమాని మళ్లీ పెద్ద తెరపైనా, ఓటిటిలో ఎంతమంది చూస్తారనేదే కీలకమైన ప్రశ్న.

Read More
Next Story