నిర్మాతలకు ఎగ్జిబిటర్స్ వార్నింగ్.. అలా చేయకపోతే థియేటర్స్ క్లోజ్
తెలంగాణ మూవీ ఎగ్జిబిటర్లు సినీ నిర్మాతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. మల్టీప్లెక్స్, థియేటర్లకు సమాన వాటా ఇవ్వాలని, లేకుంటే థియేటర్లను మూసేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూసివేతకు గల కారణాల్లో నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్ మధ్య వాటాల పంపిణీ సరిగ్గా లేకపోవటమే ప్రధానమని స్పష్టమైంది. ఈ మేరకు నిన్న మంగళవారం మీటింగ్ పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. నైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
అయితే ఈ వాటాల విషయం చాలా మంది నిర్మాతలకు ఇష్టం లేదు. మల్టిప్లెక్స్‌లతో సమానంగా సింగిల్ స్క్రీన్స్‌కు రెవెన్యూ షేర్ ఇవ్వటానికి ఇష్టత చూపటం లేదు. అయితే ఈ విషయం బహిరంగంగా తెలియచేయలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ థియేటర్ల సంఘం ఓ మీడియా సమావేశం ద్వారా నిర్మాతలకు హెచ్చరిక పంపింది.
అద్దె ప్రాతిపదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు.
విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ... ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూసేయక తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేసిన విషయం చాలా మందికి తెలుసు. కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, ఎక్స్‌స్ట్రా షోలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, ఎక్స్‌స్ట్రా షోలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం’’ అని అన్నారు.
‘‘జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి వెల్లడించారు.
మొదటి నుంచి మల్టీప్లెక్స్‌లో సినిమాలపై వచ్చే ఆదాయంపై నలభై నుంచి యాభై శాతం వరకూ పర్సెంటేజీ రూపంలో లాభాలు షేర్ ఉంటూ వస్తోంది. అదే సింగిల్ థియేటర్లకు అయితే కేవలం అద్దె ప్రాతిపదికన డబ్బు చెల్లిస్తున్నారు. దాంతో అద్దెలు పెంచమని కూడా చాలా కాలం నుంచి అడుగుతున్నారు. అదీ జరగటం లేదు. ఈ క్రమంలో మల్టిప్లెక్స్ లతో సమానంగా షేర్ ఇవ్వమని అంటున్నారు.
దాంతో మే 17 నుంచి తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్ తో సహా కొన్ని ద్వితియ శ్రేణి నగరాల్లో సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసి వేసారు. దాదాపు 10 రోజులు పాటు ధియేటర్లను బంద్ చేయనున్నట్టు తెలంగాణా ఎగ్జిబిటర్ కౌన్సిల్ తెలిపింది . ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 సింగిల్ స్క్రీన్లలో మెజారిటీ థియేటర్లు మూతపడ్డాయి. వీటిలో చాలా థియేటర్స్ దిల్ రాజు సోదరుడు కుమారుడు సినిమా రిలీజ్ లవ్ మీ కోసం ఓపెన్ చేయటానికి రంగం సిద్దమవుతోంది. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.