
ఎల్లమ్మ సినిమా ట్రైలరు దృశ్యం : రాజుకున్న వివాదం
‘ఎల్లమ్మ’ ట్రైలర్‌లో జంతుబలి వివాదం, సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు
జంతుబలి నిషేధం ఉన్నా ట్రైలర్‌లో హింస? ‘ఎల్లమ్మ’పై స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ అభ్యంతరాలు
జంతు సంక్షేమ చట్టాలకు విరుద్ధంగా ‘ఎల్లమ్మ’ సినిమా ట్రైలర్‌లో జంతుబలిని చూపించారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. చట్టవిరుద్ధ కంటెంట్‌ను తొలగించాలని కోరుతూ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ దర్శకుడు వేణు యెల్దండి, రాజు శిరీష్ చిత్రీకరిస్తున్న ‘యెల్లమ్మ’ సినిమా చిత్ర గ్లింప్స్/ట్రైలర్ లో చట్టవిరుద్ధమైన జంతుబలిని చిత్రీకరించారని, దీన్ని ఈ సినిమా నుంచి తొలగించాలని స్ట్రే ఎనిమల్ ఫౌండేషన్ ఇండియా క్రూరత్వ నివారణ మేనేజర్ ఎదులాపురం గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గౌతం ముంబయిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్ పర్సన్ ప్రసూన్ జోషి,ఢిల్లీలోని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా (AWBI) కార్యదర్శి డాక్టర్ సుజిత్ కుమార్ దత్తాలకు ఆయన ఫిర్యాదు చేశారు.
జంతువుల బలి నిషేధ చట్టం ఉల్లంఘన
తెలంగాణలో అమలులో ఉన్న జంతువులు,పక్షుల బలి నిషేధ చట్టం 1950ని ఉల్లంఘిస్తూ ‘ఎల్లమ్మ’చిత్ర ట్రైలర్‌లో చట్టవిరుద్ధమైన జంతుబలిని చిత్రీకరించడం, ప్రోత్సహించడంపై ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సన్నివేశాలను తొలగించాలని ఆయన అభ్యర్థించారు. ఎల్లమ్మ పేరుతో సినిమా గ్రింప్స్, ట్రైలరును జనవరి 16వతేదీన టీ సిరీష్ స్టూడియో ప్లాట్ పాంలో విడుదల చేశారని ఆయన పేర్కొన్నారు.
ట్రైలరులో ఏముందంటే...
ఒక నిమిషం 59 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్‌లో జంతుబలిని స్పష్టంగా చిత్రీకరించి, ప్రోత్సహించే దృశ్యాలు ఉన్నాయని గౌతం ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘‘జంతుబలి అనేది తెలంగాణ రాష్ట్రంలో చట్టప్రకారం నిషేధించిన ఆచారం. ఇది జంతువులపై క్రూరత్వ నివారణ చట్టం 1960 ప్రకారం కూడా నేరం. వీడియో ప్రారంభంలో ఒక మేక స్పష్టంగా భయపడిన, ఆందోళన చెందిన స్థితిలో చూపించారు. ఆ తర్వాత నటుడిగా డీఎస్పీ ప్రధాన పాత్రధారి సన్నివేశంలోకి ప్రవేశించి, ఆ జంతువులో భయాన్ని మరింత పెంచుతుంది. ఎల్లమ్మ దేవత ముందు మేకను బలి ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నట్లు అది జలధరించడం చూపించారు. ట్రైలర్ చివరిలో, ఒక పెద్ద కత్తిని ప్రముఖంగా ప్రదర్శించారు. ప్రధాన పాత్రధారి శరీరంపై రక్తంతో కనిపిస్తాడు. ఆ తర్వాత పొట్టేలు సన్నివేశం నుంచి అదృశ్యమవుతుంది. ఇది ఆ జంతువును బలి ఇచ్చారని సూచిస్తుంది’’అని గౌతం తెలిపారు.
జంతువులపై క్రూరత్వం పులికొల్పేలా ఉంది...
ఇటువంటి చిత్రీకరణ జంతువుల పట్ల క్రూరత్వాన్ని సాధారణీకరిస్తుందని, ప్రోత్సహిస్తుందని ప్రజలను ఒక చట్టవిరుద్ధమైన ఆచారాన్ని అనుసరించడానికి ప్రేరేపించేలా ఉందని గౌతం చెప్పారు. రాష్ట్ర చట్టం ప్రకారం నిషేధించిన చర్యను ప్రోత్సహించడం ద్వారా, ఈ కంటెంట్ ప్రజా శాంతికి, జంతు సంక్షేమ రక్షణలకు విఘాతం కలిగిస్తుందన్నారు.ఈ ట్రైలరు చట్టవిరుద్ధమైన, హింసాత్మకమైన నిషేధించే చలనచిత్రాల ధృవీకరణ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందని ఆయన ఫిర్యాదులో వివరించారు.
జంతుబలి సన్నివేశం తొలగించాలి
ఎల్లమ్మ ట్రైలర్, సినిమా నుంచిజంతుబలికి సంబంధించిన అన్ని సన్నివేశాలను తక్షణమే తొలగించాలని నిర్మాతలను ఆదేశించాలని ఎదులాపురం గౌతం డిమాండ్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్‌ను పూర్తిగా తొలగించే వరకు సినిమాకు ఏ కేటగిరీలోనూ (యూ, యూఏ, లేదా ఏ) ధృవీకరణ పత్రం మంజూరు చేయకూడదని ఆయన కోరారు. జంతు సంక్షేమం, చట్టపరమైన సమ్మతి , చలనచిత్రాల బాధ్యతాయుతమైన ప్రజా ప్రదర్శన ప్రయోజనాల దృష్ట్యా ఈ ట్రైలర్‌ను సమీక్షించాలని సెన్సార్ బోర్డు అధికారులను ఆయన అభ్యర్థించారు.
జంతు సంక్షేమ చట్టాలు అమల్లో ఉన్న నేపథ్యంలో ‘ఎల్లమ్మ’ ట్రైలర్‌పై సెన్సార్ బోర్డు, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఏ నిర్ణయం తీసుకుంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.జంతువులపై క్రూరత్వాన్ని అరికట్టే దిశగా ఈ ఫిర్యాదు కీలకమవుతుందా అన్నది అధికారుల నిర్ణయంపై ఆధారపడి ఉంది.
Next Story

