భాక్సాపీస్ దగ్గర బామ్మ రచ్చ !
x

భాక్సాపీస్ దగ్గర బామ్మ రచ్చ !

'తాయ్ కిళవి' నే హాట్ టాపిక్ !


తమిళ బాక్సాఫీస్ వద్ద ప్రస్తుతం ఒకే ఒక పేరు మార్మోగిపోతోంది. భారీ అంచనాలతో వచ్చిన స్టార్ సినిమాలే బోల్తా కొట్టిన వేళ, ఒక ముసలావిడ కథతో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. శివకార్తికేయన్ నిర్మాణంలో, వెటరన్ నటి రాధికా శరత్‌కుమార్ టైటిల్ రోల్ పోషించిన 'తాయ్ కిళవి' (Thaai Kizhavi) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. నోరు తెరిస్తే బూతులు, ఎదురు తిరిగితే తల పగులగొట్టే క్యారెక్టరైజేషన్‌తో రాధికా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

అసలు కథ ఏంటంటే?

ఒక పల్లెటూరిలో వడ్డీ వ్యాపారం చేస్తూ, ఊరి జనాన్ని గజగజ వణికించే 70 ఏళ్ల బామ్మ పావునుతాయ్ (రాధికా శరత్‌కుమార్). ఆవిడకి కోపం ఎక్కువ, డబ్బుపై ఆశ ఇంకా ఎక్కువ. బాధ్యత లేని ముగ్గురు కొడుకులను ఇంటి నుంచి తరిమేసి, తన కూతురు, మనవడితో కలిసి ఒంటరిగా రాజ్యాంగం నడుపుతుంటుంది. అయితే, ఆ బామ్మ దగ్గర కోట్ల విలువైన 'బంగారు నిధి' ఉందనే ప్రచారం ఊళ్ళో ఊడలు దిగుతుంది.

కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. హఠాత్తుగా పావునుతాయ్‌కి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది. ఇంకేముంది, ఆ నిధి ఎక్కడుందో తెలుసుకోవడానికి, అప్పటివరకు మొహం చాటేసిన కొడుకులు, కోడళ్లు మళ్ళీ క్యూ కడతారు. చనిపోతుందనుకున్న బామ్మ నోరు విప్పితే తప్ప ఆ నిధి దక్కదు. ఈ క్రమంలో సాగే డ్రామా, ఆస్తి కోసం కొడుకులు చేసే వెధవ పనులు చూస్తుంటే ప్రేక్షకులకు నవ్వుతో పాటు కడుపు మండిపోవడం ఖాయం.

హైలైట్స్ ఇవే..

రాధికా విశ్వరూపం: 140 నిమిషాల సినిమాలో రాధికా కనిపించేది తక్కువ సేపే అయినా, ఆవిడ ఉనికి సినిమా అంతా కనిపిస్తుంది. మధురై యాసలో ఆవిడ విసిరే డైలాగులు థియేటర్లో ఈలలు వేయిస్తున్నాయి.

మైండ్ బ్లోయింగ్ కామెడీ: కమల్ హాసన్ సినిమాల రిఫరెన్స్‌లు, ముఖ్యంగా కమల్ ఫ్యాన్ గా సింగం పులి చేసే హంగామా మామూలుగా లేదు. ఫస్టాఫ్ అంతా పొట్ట చెక్కలయ్యే కామెడీతో సాగిపోతుంది.

బోధనలు లేని నిజాయితీ: డబ్బు కంటే మనుషులు ముఖ్యం అని క్లాసులు పీకకుండా, వాస్తవ పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు శివకుమార్ మురుగేశన్. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్లు గుండెను హత్తుకుంటాయి.

తమిళనాడు నేటివిటీ ఎక్కువగా ఉండటం, టాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిన ఆర్టిస్టులు లేకపోవడంతో ప్రస్తుతానికి తెలుగు డబ్బింగ్ ఆలోచన లేదు. కానీ, సినిమా చూసిన ప్రతి ఒక్కరూ "బామ్మ అంటే ఇలా ఉండాలిరా" అని ఫిక్స్ అయిపోతున్నారు. కేవలం ఒక సినిమాగానే కాకుండా, మహిళా సాధికారతను, ఆర్థిక స్వేచ్ఛను ఈ చిత్రం అద్భుతంగా చాటి చెప్పింది. ల్యాగ్ ని భరించగలిగితే, ఒక కంప్లీట్ రూరల్ మాస్ ఎంటర్‌టైనర్ చూడాలనుకునే వారికి 'తాయ్ కిళవి' బెస్ట్ ఛాయిస్.

Read More
Next Story