దొంగా… రాబిన్ హుడ్డా? ఐ బొమ్మ రవి ఎవరు?!
x

దొంగా… రాబిన్ హుడ్డా? 'ఐ బొమ్మ రవి' ఎవరు?!

రవిపై నెటింట్లో పోస్టుల యుద్ధం! నిజానిజాలేమిటి


అతనో దొంగనా…?

లేక నిజంగానే జనాల కోసమే పోరాడిన రాబిన్ హుడ్డా?

తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని గడగడలాడించిన ఆ పేరు— ఐ బొమ్మ రవి. సినిమా థియేటర్లలో టైటిల్ కార్డ్ పడకముందే… అతని సైట్‌లో హెచ్‌డీ ప్రింట్ రెడీ! పోలీసులు వెతికితే దేశం మారాడు… ఇండస్ట్రీ ట్రాక్ చేస్తే కరేబియన్ దీవుల్లోకి జారిపోయాడు. టెక్ స్కిల్‌తో సర్వర్లు విరగ్గొట్టి, నెలకు పది లక్షలకుపైగా సంపాదించి, బెట్టింగ్ నెట్‌వర్క్‌లకు డేటా అమ్మి కోట్లలో లాభాలు దండుకున్న వాడు… ఇతనే ఇప్పుడు సోషల్ మీడియాలో “సపోర్ట్ రవి” అంటూ దేవతలా పొగడేలా పరిస్దితి కనపడుతోందంటే!?

అతని అరెస్ట్‌పై కొందరు రియాక్షన్:

“టిక్కెట్లు తగ్గించండి… ఆపై పైరసీ ఆపండి!”

ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. నేరాల కేసులు ఉన్న వ్యక్తిని… సినిమా టిక్కెట్ రేట్లపై ప్రజల కోపం హీరోలా మార్చేసిందా? కానీ…ఒక్కో హ్యాక్‌తో సినీ పరిశ్రమను కోట్లకు గండికొట్టిన ఈ వ్యక్తి — వేధింపులకు గురైన సాధారణ వాడా? లేక డబ్బే దేవుడుగా భావించిన దొంగనా? పోలీసులకు సవాలు విసిరి, పౌరసత్వం వదిలి పారిపోయి, మరో దేశంలో దాగి పైరసీ నడిపిన వాడిని…“జనాల కోసం పోరాడుతున్న యోధుడు” అని నిజంగానే పిలవాలా?

69 వెబ్‌సైట్లను బ్లాక్ చేశారు. 65 మిర్రర్ సైట్లు కూల్చేశారు. రవి అరెస్ట్ అయ్యాడు. అయితే అసలు ప్రశ్న ఇప్పుడు మొదలైంది— ఇది పైరసీకి శుభం కార్డా? లేక ఇంకా పెద్ద monsters రెడీగా ఉన్నాయా? ఐ బొమ్మ రవి గేమ్ ముగిసినా… పైరసీ యుద్ధం వాస్తవానికి ఇప్పుడు ప్రారంభమైంది. అతనో రాబిన్ హుడ్డా…? లేక సాఫ్ట్‌వేర్‌లో దిట్టైన సూపర్ క్రిమినలా? అతడే నిజంగా పైరసీ సిండికేట్‌కు బాస్? అతని పతనం ఇండస్ట్రీకి గుడ్ న్యూసా… లేక మరో ప్రమాదానికి డోర్ ఓపెన్ అయ్యిందా? కథలో ట్విస్టులు వరుసగా రెడీగా ఉన్నాయి.

టాలీవుడ్ని షేక్ చేసిన పైరసీ కింగ్ అసలు కథ ఇదే!

పుట్టు క్రిమినల్ కాదు...చదువుకున్న MBA స్టూడెంట్. కానీ డబ్బు దాహం… అతన్ని భారతదేశంలోనే అత్యంత పెద్ద పైరసీ సిండికేట్ బాస్ గా మార్చింది.

ఎవరీ రవి? – సాధారణ యువకుడు నుంచి డిజిటల్ మాఫియాగా…

విశాఖపట్నం కుర్రాడు. ముంబైలో MBA. మధ్యతరగతి ఇబ్బందులు. పెళ్లయ్యాక డబ్బు తక్కువని భార్య-అత్తల హేళనలు. హృదయంలో మిగిలింది అవమానం… కోపం… ప్రతీకారం. డబ్బే అన్నిటికీ సమాధానం అని నిర్ణయించుకున్న రవి— సాఫ్ట్‌వేర్ జ్ఞానంతో పైరసీ ప్రపంచానికి డోర్ ఓపెన్ చేసాడు. ఐ బొమ్మ & బప్పం టీవీ… ఇదే అతని డిజిటల్ సామ్రాజ్యానికి మొదటి రెండు పిలర్లు.

ఒక సాధారణ వెబ్‌డిజైనర్… ఎలా కరేబియన్ దీవుల నుంచి ప్రపంచ సర్వర్లను హ్యాక్‌ చేసే మోన్స్టర్ అయ్యాడో చెబితేనే గుండె ఉలిక్కిపడుతుంది.

హ్యాకింగ్ లెజెండ్ – యూఎస్ సర్వర్ అయినా, OTT అయినా… క్లిక్ అంటే క్లాక్!

రవి చేసిన పని ఏంటో తెలుసా? క్లౌడ్ ఫ్లేర్‌లో లాక్ చేయబడిన కొత్త సినిమాల సర్వర్లే హ్యాక్ చేశాడు! OTTలో DRM ఉన్నా… అతని చుట్టూ అది పేపర్ డోర్ మాత్రమే.

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ… అన్ని భాషల సినిమాలు HDలో దొంగిలించి, కరేబియన్ దీవుల్లో దాచిన సర్వర్లలో దాచిపెట్టి… ఓ రేంజ్‌లో ఉచిత వినోదం అని ప్రపంచానికి వడ్డించాడు.

ఇక్కడే అతని ఇంటిలిజెన్స్ తెరచుకుంది— ఐబొమ్మలో సినిమాలు చూసే వారిని… బెట్టింగ్ యాప్‌ల్లోకి లాగడం. ఇదే అతని నిజమైన దందా.

దీంతో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు లక్షలాది మంది జీవితాలు నాశనం అయ్యాయి.

విడాకులు, విదేశీ పౌరసత్వం, కరేబియన్ ప్లాన్… పూర్తిగా సినిమా స్క్రిప్ట్!

రవి సంపాదన పెరిగినకొద్దీ… అతని వ్యక్తిగత జీవితం మారిపోయింది. భార్య 2021లో విడిపోయింది. ఆ తర్వాత రవి స్టెప్ స్టెప్‌గా సినిమా విలన్‌గా మారాడు— భారత పౌరసత్వం వదిలాడు. 80 లక్షలకే కరేబియన్ సిటిజన్‌షిప్ కొన్నాడు. దీవుల్లో మాఫియా లా జీవించాడు. 50 లక్షల యూజర్ల డేటా సైబర్ గ్యాంగులకు అమ్మి 20 కోట్లు దండుకున్నాడు.

నిజంగా చూస్తే…

అతని హిస్టరీ "టెక్ నిపుణుడు మాఫియా లీడర్‌గా ఎలా మారాడు" అనే హాలీవుడ్ మూవీ రేంజ్‌లో ఉంటుంది!

పోలీసులు హంట్ ఎలా మొదలుపెట్టారు? — డార్క్ వెబ్ vs ఇండియన్ లా

వరుసగా పెద్ద పెద్ద సినిమాలు ఐబొమ్మలో లీకవడంతో… ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదు చేసారు నిర్మాతలు. 74 సైట్లు, 37 లక్షల యాక్టివ్ యూజర్లు— పోలీసులకు ఇది సైబర్ టెర్రరిజం లా అనిపించింది. ఐదుగురు చిన్న హ్యాకర్లు మొదట పట్టబడ్డారు. వాళ్ల ఫోన్లలో, ల్యాప్‌టాప్‌ల్లో ఉన్న డేటా చెక్ చేస్తే— ప్రతి రహస్యం ఒకటే పేరు వద్దకు వచ్చి ఆగింది: ఇమ్మడి రవి.

ఎలా పట్టుబడ్డాడు – హాలీవుడ్ సినిమాలో వచ్చే ట్విస్ట్!

సెప్టెంబర్ 30 వరకు కూకట్‌పల్లిలోనే ఉన్న రవి… అక్టోబర్ 1న మాయమయ్యాడు. పోలీసులు అతని IP అడ్రస్‌లను ట్రాక్ చేస్తే— ప్రతి క్లూ మరో దేశానికి తీసుకెళ్లేది. ఫ్రాన్స్… కరేబియన్… నెదర్లాండ్స్… తిరిగి ఇండియా. అతను నిజంగా డిజిటల్ కామిలియన్.

కానీ ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఎక్కడో చోట తప్పు చేస్తాడు. అలాగే రవి ఓ పెద్ద తప్పు చేసాడు. హైదరాబాద్ కూకట్‌పల్లి ఫ్లాట్ అమ్మడానికి ఇండియాకు వచ్చాడు. యుఎస్ FBIలో ఉన్నట్లుగా టెక్ ట్రాకింగ్‌తో— సైబర్ క్రైమ్ బృందం అతన్ని నిదానంగా గర్ల్‌ఫ్రెండ్స్‌ను ట్రాక్ చేసే డిటెక్టీవ్ లాగా అతని స్నేహితులు, అనుచురలను ఫాలో అయింది.

ఒకరోజు అర్ధరాత్రి—

హఠాత్తుగా రెయిన్ విస్టా అపార్ట్‌మెంట్‌లో దాడి. ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, సర్వర్ డేటా, కొత్త సినిమాల ప్రింట్లు— అన్నీ స్వాధీనం.

ఐబొమ్మ సర్వర్‌లో పెండింగ్‌లో ఉన్న సినిమాలే పోలీసులకు షాక్ ఇచ్చాయి.

క్యాష్, క్రిప్టో, కోట్లు… కానీ కేవలం 3 కోట్లు ఎందుకు దొరికాయి?

పోలీసులు 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. కానీ ఈ వార్త విన్న అందరికీ డౌట్—

“కేవలం 3 కోట్లు మాత్రమేనా? పైరసీలో ఏడాదికి వంద కోట్లు కొట్టొచ్చు కదా?” 20 కోట్ల లాభం చెప్పడమే లాజిక్‌గా కనిపించట్లేదు. అయినా ప్రభుత్వ ఆఫీస్ లలో పనిచేసే చిన్న ఉద్యోగస్దులు లంచాలు పడుతున్నాడని రెడ్ హ్యాండెండ్ గా దొరికినప్పుడు వందల కోట్లు వాళ్లు ఆస్దులు బయిటకు వస్తున్నాయని...అలాంటిది ఇంతలా సినిమా ఇండస్ట్రీని అతలా కుతలం చేసాడని చెప్పబడుతున్న రవి..నుంచి మూడున్నర కోట్లు మాత్రమే సీజ్ చేసారని తెలియటం..అలాగే కేవలం ఇన్నేళ్లలో 20 కోట్లు మాత్రమే సంపాదించటం,దాంతో ఇతర దేశాల్లో సెటిల్ కావాలనుకోవటం మాత్రం హాస్యస్పదమే

సోషల్ మీడియాలో కూడా ఇదే కామెంట్—

“వాళ్లు చెప్పేది వేరే లెక్క. నిజం వేరే లెక్క వేరా”

అంటే అసలు డబ్బు ఎక్కడ?

క్రిప్టోలోనా? విదేశీ వాలెట్‌ల్లోనా? బెట్టింగ్ నెట్‌వర్క్‌ల్లోనా? ఈడీ ఇప్పుడు ఆ లేయర్ తీసి చూడబోతోంది.

"సపోర్ట్ రవి" – ఈ ట్రెండ్ ఎందుకు వైరల్?

ఇదో సినిమా కంటే పెద్ద డ్రామా. పైరసీ బాస్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వచ్చారు! “టిక్కెట్లు తగ్గించండి… రవిని వదిలేయండి” అంటూ పోస్టులు. కొంతమంది అతన్ని రాబిన్ హుడ్ గా కూడా చూస్తున్నారు.

ఇండస్ట్రీ షాక్‌లో పడిపోయింది—

దొంగను కూడా హీరో లా చూపించే పరిస్థితి ఎలా వచ్చిందని?

అయితే అతను నిజంగానే రాబిన్ హుడ్డా… లేక మోసపూరిత దొంగనా?

అతను చెప్పేది:

“టికెట్ రేట్లు ఎక్కువ… అందుకే నేను ఉచితంగా చూపిస్తున్నా.”

పోలీసులు చెప్పేది:

“కోట్ల కోసం పైరసీ… బెట్టింగ్ యాప్‌లతో అమాయకుల్ని నాశనం చేశాడు.”

ప్రజలు చెప్పేది:

“అన్నీ కంట్రోల్ చేసి, టిక్కెట్లు తగ్గిస్తే పైరసీ అవసరం ఉండదు.”

అసలు ప్రశ్న — ఇది పైరసీకి ఎండ్ ఆ… లేక ఇది కేవలం మొదటి ఎపిసోడ్ మాత్రమేనా?

ఐబొమ్మ రవి అరెస్ట్ అయ్యాడు. కానీ… డార్క్ వెబ్‌లో ఇంకా 50కు పైగా “కొత్త రవిలు” రెడీగా ఉన్నారని సైబర్ టీమ్ చెబుతోంది.

క్షమించండి.. మా సేవలు శాశ్వతంగా నిలిపివేశాం

ఐ బొమ్మ, దాని అనుబంధంగా ఉన్న 65 వెబ్‌సైట్లను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బ్లాక్‌ చేశారు. ఈ క్రమంలో ఐ బొమ్మ వెబ్ సైట్ లో ఈ ప్రకటన కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘‘మీకు ఇటీవల మా గురించి తెలిసి ఉండొచ్చు. లేదంటే.. మొదటి నుంచి నమ్మకమైన అభిమానై ఉండొచ్చు. ఏదేమైనా.. మీ దేశంలో మా సేవ శాశ్వతంగా నిలిపివేశామని చెప్పేందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం’’ అని ఐ బొమ్మ ప్రకటనలో పేర్కొంది.

అంటే పైరసీ దెయ్యం చచ్చిపోలేదు. దానికి కేవలం కొత్త బాస్ కావాలి.

ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంటుందా?

లేక ఇది ఇంటర్వెల్ ఫైట్ మాత్రమేనా?

అసలు “ఫైనల్ క్లైమాక్స్” ఇంకా మిగిలే ఉందా?

Read More
Next Story