'లైన్ మ్యాన్' చిత్రం రివ్యూ!
కరెంటు లేకపోవడం అనే చిన్న అంశం చుట్టూ తిరిగే సినిమా ‘లైన్‌మాన్’. ప్రేక్షకుల మనసును తాకుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే..
కొన్ని సినిమాలు ట్రైలర్ చూసినా, లేదా వాటి గురించి విన్నా… అరే భలే ఉందే ఐడియా… సినిమా ఎలా తీశారో ఏంటో.. చూసేయాలి అనిపిస్తుంటాయి. అయితే ఈ కోవలో వచ్చే సినిమాలు… మనం అనుకున్నది ఒకటి… తెరపై కనపడేది వేరొకటి ఉంటుంది. అయితే అన్ని సినిమాలు అలా ఉంటాయని కాదు. ఇక తెలుగు, కన్నడ భాషల్లో మార్చిలో విడుదలైన 'లైన్ మ్యాన్' చిత్రం థియేటర్‌లో చూసిన వాళ్లు బాగానే ఉందన్నారు. ఇప్పుడు ఓటీటీలో రిలీజైంది. ఇప్పటికే కన్నడ వెర్షన్ ఓటీటీలో అందుబాటులో ఉండగా, ఇప్పుడు తెలుగు వెర్షన్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో (lineman movie ott) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా కథేంటి.. అసలు చూడదగ్గదేనా వంటి వివరాలు చూద్దాం.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర చిన్న విలేజ్‌లో కథ జరుగుతూంటుంది. విద్యుత్‌శాఖలో లైన్‌మాన్‌గా పనిచేస్తున్న తండ్రి హఠాత్తుగా మరణించడంతో ఆ జాబ్ నటరాజు అలియాస్ నట్టు (త్రిగుణ్)కి వస్తుంది. ఇక ఆ ఊళ్లో కరెంట్ రావాలన్నా, పోవాలన్నా అంతా నట్టు చేతిలోనే ఉంటుంది. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ జాబ్‌ని సిన్సియర్‌గా చేస్తూంటాడు. ఇక ఆ ఊళ్లో అందరికీ సాయం చేస్తూ ఆ ఊరి దేవతగా దేవుడమ్మ(బి.జయశ్రీ) ఉంటుంది. దాదాపు వెయ్యి కాన్పులు చేసిన రికార్డు ఆమె ఖాతాలో ఉంటుంది. ఆమెకు 99 సంవత్సరాలు నిండి వందేళ్లు వస్తుండటంతో ఊరంతా ఆమె 100వ పుట్టిన రోజును చేయాలనుకుంటారు.
అదే సమయానికి నట్టు కరెంట్ ఇవ్వను అని చెప్తాడు. లైటింగ్‌తో కూడిన ఏర్పాట్లు భారీగా చేస్తారు. అసలు ఈ పుట్టినరోజు ఆలోచన చెప్పిన నట్టునే అలా మాట్లాడటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు కరెంట్ ఇవ్వనన్నాడు? అనేది ఎవరికి అర్థం కాదు. తమ ఏర్పాట్లు వృథా అవుతాయంటూ తిట్టిపోస్తారు. ఎవరేమన్నా సరే తను మాత్రం లైన్‌మాన్ చేయలేనని చెప్తాడు. అందుకు చెప్పే కారణం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తాను పవర్ ఆన్ చేసే ప్రదేశంలో ఒక పక్షి నాలుగు గుడ్లు పెట్టిందనీ, లైన్ ఆన్ చేస్తే ఆ గుడ్లలోని పిల్లలు చనిపోతాయని చెబుతాడు. అందువలన ఆ గుడ్లు పొదిగి .. పిల్లలు బయటకు వచ్చే వరకూ లైన్‌ఆన్ చేయడం కుదరదని అంటాడు. దాంతో గ్రామస్థులంతా ఆలోచనలో పడతారు. టీవీలకీ .. స్మార్ట్ ఫోన్లకి బాగా అలవాటు పడిపోయిన కొంతమంది మామూలుగా మండిపడరు. అయితే నట్టుకు దేవుడమ్మ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ప్రతీ జీవరాసికి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉందని, ఆ గుడ్లు బయిటకు వచ్చే వరకూ తామంతా చీకట్లో గడపుదామని దేవుడమ్మ చెప్తుంది. ఆమె మాటకు ఎవరూ ఎదురు చెప్పరు. అక్కడ నుంచి ఆ ఊళ్లో కరెంట్ ఉండదు. రాత్రిళ్లు గుడ్డి దీపాలు, లాంతర్లే. అక్కడ నుంచి ఆ ఊళ్లో ఏం మార్పులు వచ్చాయి. చివరకు ఏమైంది. వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కరెంట్ లేకపోతే కాసేపు ఉండలేము. అలాంటిది ఊరంతా కలిసి కొన్ని రోజులు కరెంట్ లేకుండా గడపటం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే కరెంట్ లేని రోజుల్లోకి వెళ్ళితే ఎంత టైమ్ కలిసి వస్తుంది. టీవీలు, సెల్ ఫోన్స్ లేక ఎంత హాయిగా ఉండచ్చు. ? అనిపిస్తుంది కానీ నిజంగా అలా బ్రతకాలంటే చాలా కష్టం. అదే ఈ సినిమాలో చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా పల్లెటూరు, అక్కడ ఉండే రకరకాల మనుషులు వాళ్ల వ్యవహారాలతో నడుస్తుంది.
ఇంటర్వెల్ సమయానికి కరెంట్ గురించి చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఎందుకు కరెంట్ లేకుండా ఉన్నారు అని ఆసక్తిగా సాగుతుంది. కరెంట్ లేకుండా రాత్రి పూట పల్లెల్లో గతంలో ఎలా ఉండేవారో అలాంటి సీన్స్ అన్ని చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే కొంత సాగతీత అయితే ఉంది. కానీ చివర్లో వచ్చే ఎమోషనల్ క్లైమాక్స్ మనల్ని సినిమాతో కనెక్ట్ చేస్తుంది. అరే మనకూ కొద్ది రోజులు కరెంట్ లేకుండా ఉంటే బాగుండును అనిపిస్తుంది. ఎంటర్టైన్మెంట్ మరింత బాగా పండితే ఇంకాస్త బాగా నచ్చేది.
టెక్నికల్‌గా ఓకే అనిపిస్తాయి. అయితే సినిమాటోగ్రఫీ మాత్రం బాగుంది. విలేజ్‌ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు. ఇలాంటి సినిమాలకు పాటలు ప్లస్ అయితే చాలా బాగుంటాయి. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. స్టోరీ లైన్‌గా మంచిదే అయినా ఇంకాస్త కష్టపడితే బెటర్ అవుట్ ఫుట్ వచ్చేది అనిపించే సినిమా ఇది.
చూడచ్చా
విలేజ్ ఎమోషనల్ సినిమాలు ఈ మధ్య తక్కువగానే వస్తున్నాయి కాబట్టి ఓ లుక్కేయచ్చు
ఎక్కడ చూడవచ్చు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో (తెలుగులో ఉంది)