ఓ మామూలు బయోపిక్ టైగర్ నాగేశ్వరరావు
x
Image source: X

ఓ మామూలు బయోపిక్ 'టైగర్ నాగేశ్వరరావు'

1970-80 మధ్య స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కూడా అంతో ఇంతో ఆడిందంటే, రవితేజ వల్లనే.


టైగర్ నాగేశ్వరరావు సినిమా మొత్తం రవితేజ మీద ఆధారపడి నడుస్తుంది. రవితేజ ఒక పర్ఫెక్ట్ మాస్ ఎంటర్ ట్రైనర్. సినిమా కథతో సంబంధం లేకుండా కనీసం కొంతవరకైనా దాన్ని సక్సెస్ చేసే టాలెంట్ ఉన్న నటుడు. దీనికన్నా ముందు వచ్చిన రావణాసుర, అంతకన్నా ముందు వచ్చిన చాలా సినిమాలు అతనిపై ఆధారపడి నడిచాయి. వైవిధ్య భరితమైన కథను ఎన్నుకోవడం, పూర్తిస్థాయిలో దాన్ని విజయవంతం చేసే ప్రయత్నం చేయడం రవితేజకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. కాకపోతే అన్నిసార్లు అది వర్కౌట్ అవ్వదు. 1970-80 దశకాల్లో కొంత సంచలనం సృష్టించిన స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ కూడా అంతో ఇంతో ఆడిందంటే, రవితేజ వల్లనే.

"కిట్టు ఉన్నాడు జాగ్రత్త" తోపాటు "దొంగాట" అనే సినిమాను తీసిన వంశీకృష్ణ ఈ సినిమా దర్శకుడు. టైగర్ నాగేశ్వరరావు సినిమా తీయడానికి మణిరత్నం సినిమా నాయకుడు ఇన్స్పిరేషన్ అని , ఒక సరైన బయోపిక్ తీయాలన్న ఉద్దేశంతో ఈ సినిమా మొదలు పెట్టానని, దొంగాట సినిమాకు ముందే, ఈ సినిమా కథ రాసుకున్నానని చెప్పాడు. ప్రయత్నం మంచిగానే ఉంది కానీ, సరైన బయోపిక్ తీయలేకపోయాడు. ఈ బయోపిక్ రాను రాను పల్చబడి ఎక్కడికో వెళ్ళిపోతుంది.

గతంలో వచ్చిన పుష్ప సినిమాలో ఒక గంధపు చెక్కల స్మగ్ల్లర్ జీవన ప్రస్థానం చక్కగా తీసిన సుకుమార్ లాగానే, దీన్ని తీయాలనుకున్నాడు. అయితే సుకుమార్ వేరు. పుష్ప రెండో భాగంలో రాబిన్ ఫుడ్ గా మారిపోయాడు అన్నది రెండో భాగం ట్రైలర్లో స్పష్టంగా తెలుస్తుంది. టైగర్ కూడా అంతే. నాగేశ్వరరావు గురించి పూర్తిస్థాయి ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేకపోయినప్పటికీ, స్టువర్టుపురం లో కొంతమంది చెప్పిన విషయాల మీద, పోలీసులు చెప్పిన కొన్ని సంఘటనల మీద వదులుగా కథ అల్లుకున్నాడన్నది స్పష్టం.

ఎంత బయోపిక్ అయినా మూడు గంటలసేపు నడపాలంటే కష్టం, అందుకే అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీని తీసుకోక తప్పదు. అయితే వంశీకృష్ణ దాన్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాడు. అందుకే సినిమా ఇంకాస్త బాగుండేది పోయి తేలిపోయింది. అయితే అక్కడక్కడ సినిమా కొంత ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, ఆ కొంత సరిపోలేదు. ఈ సినిమాకి బలం రవితేజనే కాబట్టి, అతని నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వైవిధ్యంతోనే నెట్టుకొచ్చాడు.

సినిమా మొదట్లో చూపించిన ట్రైన్ రాబరీ సినిమా ఎక్కువసేపు ఉండడమే కాకుండా, టైగర్ నాగేశ్వరరావు స్టైల్ కి సూట్ కాలేదు. అదేదో హాలీవుడ్ సినిమాలో, లేదా మన బాహుబలి సినిమాలో తీసిన ఒక ఎపిసోడ్ లా ఉంది.. బాగా తీసినప్పటికీ దాంట్లో ఒరిజినాలిటీ మిస్ అయింది. గ్రాఫిక్స్ అధికంగా వాడటం వల్ల ఆ పరిస్థితి వచ్చింది.. తర్వాత నాగేశ్వరావు చేసిన దోపిడీలు అలాగే అతని ఊరు, ప్రజలు, అవసరం లేని హీరోయిన్, అలాగే భార్య పాత్ర పోషించిన మరో హీరోయిన్ ఇలా అనేకమంది దర్శనమిస్తారు. ఇలాంటి సినిమాకి ఇద్దరు హీరోయిన్లు అవసరం లేదు.

సినిమాను బాగా ట్రిమ్ చేసి స్క్రీన్ ప్లే మరింత షార్ప్ గా ఉండి ఉంటే సినిమా ఫలితం ఖచ్చితంగా మరోలా ఉండేది. కానీ డైరెక్టర్ వంశీ సినిమాను నిదానంగా నడిపించుకుంటూ వెళ్ళాడు. ప్రతి డీటైల్ చూపించాలన్న ఉత్సుకతతో నిడివిని పెంచేశాడు. దానికి తోడు రెండు అనవసరమైన పాటలు,ఒక హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్, ఇంకొక హీరోయిన్ తో పెళ్లి సినిమాని పక్కదారి పట్టించాయి. ఒరిజినాలిటి తక్కువై సినిమా బయోపిక్ దారి నుంచి మళ్లీ పోయింది.

ఇంత చెప్పిన తర్వాత సినిమా పూర్తిగా బాగలేదని కాదు, పూర్తిగా బాగా తీయలేదని చెప్పాలి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ, సంగీతం కొంత రిలీఫ్ ఇస్తే. గాయత్రి భరద్వాజ్ నటన, ఆమెతో తీసిన ఒక పాట ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. రాబరీలు, రవితేజ మేనరిజంలు యువతకు నచ్చే తీరుతాయి.

టైగర్ నాగేశ్వరరావు ప్రధాని ఇంట్లోకి వెళ్ళటం, దరిమిలా ఐబి చీఫ్ స్టువర్టుపురం రావడం కలవడం జరుగుతుంది. అక్కడినుంచి సినిమా పూర్తిగా సైడ్ ట్రాక్ లోకి వెళ్ళిపోయింది. హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ అంతగా సరిపోలేదు. ఆమెది నిజానికి సినిమాకి చాలా ముఖ్యమైన పాత్ర. ఆ పాత్ర చుట్టూ కొంత ఎమోషనల్ ఎలిమెంట్స్ కలిపి కథను చెప్పి ఉంటే టైగర్ నాగేశ్వరావు బయోపిక్ అర్థం ఉండేది. అలా జరగకపోవడం వల్ల ఏదో ఒక కమర్షియల్ సినిమా కాసేపు చూసామని ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫోటోగ్రఫీ సంగీతం పర్వాలేని స్థాయిలో ఉండడం వల్ల.. సినిమా బోర్ కొడుతుంది అనిపించినప్పుడల్లా ఆ రెండు మల్లి కాసేపు కూర్చోబెడతాయి. ఎంతసేపు కూర్చున్నప్పటికీ సినిమా పూర్తిగా ఆకట్టుకోదు. ఏదో అలా సినిమాకు పోయి వచ్చాము, కాసేపు ఎంజాయ్ చేసాం. అది కూడా రవితేజ వల్లనే. ఇంకో విషయం. ఆ ఊరి ఎమ్మెల్యే ఎలమంద పాత్రధారి మలయాళంలో, తమిళంలో అటువంటి పాత్రలు చేసే హరీష్. అతని పై చిత్రీకరించిన సన్నివేశాలు పూర్తిగా ఈ సినిమాలో హిట్ కాలేదు. కేవలం కమర్షియల్ దృక్పథంతోనే(ఫైట్స్ అవి బీభత్సంగా ఉంటాయి) అవి తీసినట్లు తెలుస్తుంది. మూడు గంటల ఈ సినిమాలో కనీసం ఒక 40 నిమిషాలు(ముఖ్యంగా క్లైమాక్స్ ని) తగ్గించి ఉంటే సినిమా మరి కాసింత బాగుండేది,

నటీనటులు: రవితేజ, అనుపమ ఖేర్, రేణు దేశాయ్

జిషుసేన్ గుప్తా,మురళీ శర్మ,గాయత్రీ

భరద్వాజ్, నాజర్, నుపుర్

సంగీతం: జీవి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: ఆర్.మది

రచన& డైలాగులు: శ్రీకాంత్ విస్స

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

నిర్మాత : అభిషేక్ అగర్వాల్

దర్శకత్వం: వంశీ

Read More
Next Story