పంచ్ పటాకా సీక్వెల్    టిల్లు స్క్వేర్ : మూవీ రివ్యూ
x
Source: Twitter

పంచ్ పటాకా సీక్వెల్ " టిల్లు స్క్వేర్" : మూవీ రివ్యూ

సిద్దూ జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ అదరగొట్టింది. మొదటి నుంచి చివరిక వరకు వరుగా పేలిన పంచులు. మొత్తానికి సినిమా ఎలా ఉందంటే..


ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే " పంచెనక పంచు కొట్టి.. 16 పంచులు కొడితే. ఏ పంచుకు నవ్వాలి బిడ్డో, ఓ సిద్ధు జొన్నల గడ్డో" అని ప్రేక్షకులు అనుకునే సినిమా "డీజే టిల్లు" కొంచెం సక్సెస్ అయిన తర్వాత, మరోసారి సిద్దు జొన్నలగడ్డ హీరోగా తీసిన సీక్వెల్ "టిల్లు స్క్వేర్" మార్చ్ చివరి శుక్రవారం విడుదలైంది. ‘డీజే టిల్లు’తో ప్రేక్షకులు నవ్వించిన సిద్దు జొన్నలగడ్డ ఈసారి ఏం చేస్తాడోనని ట్రైలర్ నుంచి అందరూ ఎదురు చూసిన సినిమా ఇది.

పంచ్ పటాకాల నవ్వుల నజరానా

సాధారణంగా సీక్వెల్స్‌కు ఒక ప్రాబ్లం ఉంటుంది. మొదటి దానితో కంపేర్ చేస్తారు ప్రేక్షకులు. దానితో కంపారిజన్‌లో ప్రతి సీను బాగుండాలి. ఈసారి సిద్ధూ చెలరేగిపోయాడు. మొదటి సినిమా కన్నా సీక్వెలే బాగుంది అని ప్రేక్షకులకు అనిపించడంలో ఏమాత్రం తప్పులేదు. ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలంటే.. "రెండు సినిమాలు సమానమే.. కానీ ఈ సినిమా కొంచెం ఎక్కువ సమానం". సినిమా మొత్తం పంచుల పటాసులే! ఒక్కటి కూడా తుస్సుమనలేదు. ఒకదానికి మించి ఒకటి పేలాయి. అలా శరపరంపరగా పంచులు వస్తూనే ఉంటాయి.

ప్రేక్షకులు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఏదో ఒక పంచు మిస్ అయ్యే అవకాశం ఉంది. అది ఈ సినిమా ప్రత్యేకత. ఆరు నెలలు ముందే దీపావళి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులు నవ్వుల్లో మునిగి తేలుతారు. మొదటి సినిమా కూడా నవ్వించింది కానీ, ఇంత ఫాస్ట్‌గా ఫటాఫట్ పంచులతో, ఊహించని రెండు మూడు ట్విస్టులతో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచిన ఈ సినిమా మొదటి సినిమాను మరిపించి మురిపించింది.

సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో

అందుకు ముఖ్యమైన కారణం సిద్దు జొన్నలగడ్డ నే (రచన, మాటలు కూడా రవి ఆథోనీతో కలిసి రాశాడు).. ఇది సిద్దు జొన్నలగడ్డ కోసం తీసిన సినిమా. ఈ సినిమా చూసిన తర్వాత డీజే టిల్లు పాత్రలో ఇంకొకరిని ఊహించలేరు. పంచులలో టైమింగ్, ఆ నిర్లక్ష్యపు వెక్కిరింతలు, కన్ఫ్యూజ్ అయినప్పుడు చూపించిన హవ భావాలు చూసి తీరాలి. ఇవన్నీ సిద్దు మాత్రమే చేయగలుగుతాడు అనే స్థాయిలో ఉన్నాయి.

ఈ సినిమాకు కూడా దాదాపుగా మొదటి సినిమాలో ఉన్న టీం మెంబర్స్ ఉన్నారు. ఇందులో సర్ప్రైజ్ ప్యాకేజీ అనుపమ పరమేశ్వరన్. వివిధ షేడ్స్‌కు తగినట్లు నటించింది. ఇంకా ముద్దు సన్నివేశాల్లో కూడా హద్దులు దాటి కూడా నటించింది! అయితే మొదటి సినిమాలో ఉన్న నేహా శెట్టి ఇందులో కూడా ఉంది. ఇంకా డాన్ పాత్రలో మురళీ శర్మ అదనంగా ఉన్నాడు. ఈ మధ్య చిన్న స్థాయి సినిమాల్లో ఎక్కువగా కనబడుతున్న మురళీధర్ గౌడ్ కూడా సినిమాకు ఒక అదనపు బలంగా తన పాత్రను పోషించాడు. సిద్దు స్నేహితుడు మార్కస్ పాత్రలో ప్రణీత్ రెడ్డి కళ్లెం ఫ్రెష్‌గా ఉన్నాడు. బాగానే చేశాడు.

లాభించిన మార్పులు చేర్పులు

సాంకేతిక వర్గంలో ముఖ్యమైన మార్పు జరిగింది. గత సినిమా దర్శకుడు విమల్ కృష్ణ( ఇతనికి మొదటి సినిమా) స్థానంలో నరుడా డోనరుడా, అద్భుతం లాంటి సినిమాలు తీసిన అనుభవం ఉన్న మల్లిక్ రామ్ వచ్చాడు. ఇతని వల్ల మొదటి సినిమా కన్నా ఈ సినిమాలో కథనం కొంచెం డిఫరెంట్‌గా, వేగంగా నడుస్తుంది. కథ దాదాపుగా మొదటి కథకు కొనసాగింపే. అయితే చిన్న చిన్న మార్పులతో, ఊహించని కొన్ని సన్నివేశాలతో ఈ సినిమా మొదటి సినిమా కన్నా వేగంగా, సరదాగా సాగుతూ నవ్వుల పువ్వుల్ని వెదజల్లుతుంది.

ఇలాంటి సినిమాల్లో లాజిక్‌ను పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. అయినప్పటికీ ఈ సినిమా చాలావరకు లాజికల్‌గానే సాగుతుంది. గత సినిమాలో డీజే కావాలని తపించిన సిద్దు జొన్నలగడ్డ, ఈ సినిమాలో బాగా ఎదిగి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను నడుపుతుంటాడు. పాత కథకు కొనసాగింపుగానే ఈ సినిమా కథ నడిచినప్పటికీ, మొదటి సినిమాలోని చిన్న చిన్న లోపాలను ఈ సినిమాలో అధిగమించింది.

అందరినీ అలరించే నవ్వుల హరివిల్లు

ఈ మధ్యకాలంలో వచ్చిన పెద్ద సినిమాలన్నీ ప్రేక్షకులను దాదాపుగా నిరాశపరిచేవే. ఒకటి రెండు చిన్న సినిమాలే కొంత ఊరటను ఇచ్చాయి. వేసవి రెండో దశలో ప్రవేశిస్తున్న సమయంలో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను కొంత అలరిస్తుంది. యువ ప్రేక్షకులకు ఈ సినిమా విపరీతంగా నచ్చుతుంది. అందుకు మొదటి కారణం ఈ సినిమాలో ఉన్న నవ్వుల పువ్వుల పటాకాలు. దాంతోపాటు ఇతర వర్గ ప్రేక్షకులను కొంత ఇబ్బంది పెట్టే సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ బోల్డ్ ముద్దు సన్నివేశాలు.

ఈ సినిమాకు ఇది ఒక్కటే కొంత ఇబ్బంది పెట్టే విషయం. అఫ్‌కోర్స్.. ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసిన పని అయినప్పటికీ, అంతగా సమంజసం అనిపించదు. ఏ సినిమాకైనా ఒకటో రెండో లోపాలు ఉంటాయి. అవి పట్టించుకోకుండా ఉండగలిగితే ఈ సినిమాను ఏ వర్గం ప్రేక్షకులైన హాయిగా చూసేయొచ్చు. నవ్వులలో మునిగిపోవచ్చు. కాసింత ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఇది ఒక రకంగా సక్సెస్ ఫుల్ సినిమాగా చెప్పవచ్చు



Read More
Next Story