వరద బాధితుల సహాయానికి టాలీవుడ్ హీరోల భారీ విరాళాలు
తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం కోసం టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు.
భారీ వర్షాల ధాటికి తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయి. పలు ప్రాంతాలు ప్రజలకు నిలువ నీడ కూడా లేకుండా జలమయమయ్యాయి. ప్రజలకు సహాయక చర్యల్లో నిమగ్నమైన ప్రభుత్వం.. కేంద్రంతో పాటు దాతల నుంచి ఆర్థిక సాయం కోసం విజ్ఞప్తి చేస్తోంది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం కోసం టాలీవుడ్ హీరోలు విరాళాలు ప్రకటిస్తున్నారు. సీఎం సహాయనిధికి తమవంతు ఆర్థికసాయం అందించేందుకు ఒక్కొక్కరిగా ముందుకొస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.
ఎవరెవరు ఎంత ప్రకటించారంటే...
ప్రభాస్ - రెండు రాష్ట్రాలకి రూ. 2 కోట్లు
పవన్ కళ్యాణ్ - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
బాలకృష్ణ - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
చిరంజీవి - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
మహేష్ బాబు - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
జూనియర్ ఎన్ఠీఆర్ - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
అల్లు అర్జున్ - రెండు రాష్ట్రాలకి రూ. 1 కోటి
సిద్ధూ జొన్నలగడ్డ - రెండు రాష్ట్రాలకి రూ. 30 లక్షలు
విశ్వక్ సేన్ - రెండు రాష్ట్రాలకి రూ. 10 లక్షలు
కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి -చిరంజీవి
"తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
మనం బలంగా ఎదగాలి -మహేష్ బాబు
రెండు తెలుగు రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేస్తున్న దృష్ట్యా, నేను ఏపీ, తెలంగాణ సిఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 లక్షల చొప్పున విరాళం ఇస్తున్నాను. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి, పునరుద్ధరణ ప్రక్రియను సులభతరం చేయడానికి ఆయా ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని నేను కోరుతున్నాను. మనం ఈ సంక్షోభాన్ని అధిగమించి, మరింత బలంగా ఎదగాలి.