
తెలుగు సినిమాకి మూడో ప్రమాద హెచ్చరిక
అయితే ఇంత సంక్షోభంలోనూ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకుల్లా నిలిచింది రెండు రెండు బేనర్లు
టాలీవుడ్ ఇప్పుడు ఎడారి మధ్యలో నిలబడి వర్షం కోసం ఎదురు చూస్తోంది.
ఒకప్పుడు ఆర్ట్‌ను నమ్మిన ఇండస్ట్రీ, ఇప్పుడు ఓటీటి అల్గోరిథమ్‌ను చూస్తోంది.
నిర్మాత అడుగుతున్నాడు: “ఓటీటీ ఉందా?”
డైరెక్టర్ అడుగుతున్నాడు: “ఫండింగ్ ఉందా?”
జూనియర్ ఆర్టిస్ట్ అడుగుతున్నాడు: “అన్నా ఈ వారం ఏదైనా షూటింగ్ ఉందా?”
జవాబు లేదు.
ఫేమస్ బ్యానర్లు సైలెంట్. సెట్స్ ఖాళీ. క్యాలషీట్లు రద్దు. రన్ అవుతున్నది ఒక్కటే: గందరగోళం.
ట్రేడ్ భాషలో చెప్పాలంటే ఇదో ఆర్దిక సంక్షోభం , సినిమా మనుగడకే ప్రమాదం. దశాబ్దాల పాటు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు — ఈ అందరి జీవనాధారంగా నిలిచిన సినిమా పరిశ్రమ ఇప్పుడు దిక్కుతోచక చూస్తోంది. మారిన బిజినెస్ మోడల్ తో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పెద్ద పేరున్న ప్రొడక్షన్ హౌస్ లు సైతం కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేయాలంటే ఆలోచిస్తున్నారు.
లాంచ్ చేసిన కొన్ని ప్రాజెక్టులను షూటింగ్ మొదలు కాకుండానే బిజినెస్ లెక్కలు వర్కవుట్ కాక ఆపేస్తున్నారు. చిన్న సినిమాలకు ఊపిరిగా నిలిచిన రియల్ ఎస్టేట్ కూడా పూర్తిగా కూలిపోయింది. రాజకీయనాయకుల నుంచి ఇండస్ట్రీకు వచ్చే పెట్టుబడులు ఆగిపోయాయి. సినిమాలకు రెగ్యులర్ గా ఫైనాన్స్ చేసే వారు కూడా మారుతున్న పరిస్దితులను గమనించి, ఒకటికి పదిసార్లు ఆలోచించి ఫైనాన్స్ చేస్తున్నారు. రన్నింగ్స్ ఎక్కౌంట్స్ ఎరా అయ్యిపోయింది.
సినిమా పరిశ్రమలో మార్పులు అనేవి సహజమే. కానీ ఇప్పుడు ఇదో పెద్ద కుదుపు. ఓ ప్రక్కన ప్యాన్ ఇండియా సినిమాలే చేయాలనే హీరోల ఉత్సాహం, మరో ప్రక్కన ఫిల్మ్ ఛాంబర్ లో హీరోలపై నిర్మాతలు, నిర్మాతలపై టెక్నిషియన్స్ ఇలా ఒకరిపై మరొకరు పెట్టుకుంటున్న కంప్లైంట్స్ .
నామీద ఎక్కువ ఓటిటి బిజినెస్ అవుతుందని చెప్పి ఎక్కువ రెమ్యునరేషన్ లాగేసిన ఓ మీడియం రేంజి హీరో తర్వాత సినిమా ఫ్లాఫ్ అవగానే ఫోన్స్ కూడా ఎత్తటం లేదనేది రీసెంట్ గా ఫిల్మ్ ఛాంబర్ లో ఓ నిర్మాత కంప్లైంట్. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఒత్తిడి...అతను తను తీసుకున్న రెమ్యునరేషన్ లో కొంత వెనక్కి ఇస్తే సర్దుబాటు చేసుకోగలం అని ఆయన వాదన. అయితే హీరో నాకేం పట్టింది. ఆ సినిమాకు కష్టపడ్డాను ...మీరు అందుకు ఇచ్చారనే సింపుల్ సమాధానం.
క్రియేటివిటీకి కట్ చెప్తున్న బిజినెస్ రూల్స్!
ఓటిటిలో అయినా సినిమాని ఎక్కువ రేటుకు కాదు , అనుకున్న రేటుకు తీసుకుంటారా అదీ జరగటం లేదు. మొత్తం బిజినెస్ మోడల్ మారిపోయింది. ప్రొడ్యూసర్ ఈ రోజుల్లో ఓటీటీ సంస్దలు చెప్పే రూల్స్ ని అతిక్రమించకుండా సినిమాలు తీయడం కష్టంగా మారిపోయింది.
తెలుగులో ప్రముఖ బ్యానర్స్ అయిన మైత్రీ, సితార లాంటి వారు కూడా ప్రాజెక్ట్‌లను ఓటిటి కు తగినట్లు లేకపోతే 'ప్యాక్' చేయడం లేదంటే… పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడీ సంస్థలన్నీ ఒకే దారి సూచిస్తున్నాయి, ఒకే మాటను వల్లిస్తున్నాయి –"ఓటీటీ ఒప్పుకుంటేనే షూటింగ్ మొదలు!"
“ఓటీటీలను నమ్మి సినిమాలు తీయడం అంటే… ఇప్పుడు చేతులు కాల్చుకోవడమే!”
— అల్లు అరవింద్ (ప్రొడ్యూసర్)
ఓటీటీలు మొదట చూపించిన ప్రేమ ఇప్పుడు ‘ప్రారంభ పేమెంట్ – మధ్యలో డీల్ – స్ట్రీమింగ్ తర్వాత బ్యాలెన్స్’ అనే కొత్త గేమ్‌లోకి మారింది. ఓటీటీలు ప్రతీ సినిమానీ ఒకేలా చూస్తున్నాయి. కంటెంట్ బాగుందని అనిపిస్తేనే కొంటున్నాయి. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనేది వాటికి అనవసరం.
గతంలో ఓ పెద్ద హీరో సినిమా మొదలవుతుందంటే చాలు, ఓటీటీ డీల్ లాక్ చేసుకొని, అడ్వాన్సులు ఇచ్చేసేవి. ఇప్పుడు సినిమా పూర్తయిన తరవాత టీజర్, ట్రైలర్, ఆ సినిమాకున్న బజ్ చూసి రేటు డిసైడ్ చేస్తున్నాయి. సినిమా చూసి, కొంటున్న దాఖలాలు ఎన్నో.
అంతేకాదు ఓటీటీ సంస్థలు ఇప్పుడు క్యాలెండర్ ప్లాన్ ప్రకారం సినిమాలు కొంటున్నాయి. ఏ నెలలో ఏ సినిమా రావాలో వాళ్లే నిర్ణయిస్తారు. ఒక ప్రాజెక్ట్ ఎప్పుడు విడుదల కావాలి, స్ట్రీమింగ్ ఎప్పుడు జరగాలి... అన్నీ వాళ్లే డిసైడ్ చేస్తున్నారు.
రీసెంట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాని నిర్మించిన సునీల్, అశోక్ ఇదే అంశాన్ని చెప్పారు. ఓటీటీ ని నమ్ముకొని సినిమా చేస్తే మునిగిపోయినట్లే. మన కంటెంట్ మీద నమ్మకం వుండాలి. సినిమా అల్టిమేట్ బిజినెస్ థియేటరే కావాలి. ఓటీటీ టైం అయిపొయింది. దాన్ని నమ్ముకొని సినిమా చేయడం ఆపేయాలి.
సినిమా అనేది థియేటర్ కే. ఒకప్పుడు శాటిలైట్ ఎలా ఎలా వెలిగి ఆగిపోయిందో ఇప్పుడు ఓటీటీ కూడా అంతే. ఆ సంస్థలు పెట్టే కండీషన్స్ కి లోబడి సినిమాలు రిలీజ్ చేయడం కంటే ఆ ఆప్షన్ ని తీసేయడమే మేలు’ అని అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల ఓ స్టార్ ప్రొడ్యూసర్… ఓ మాస్ హీరో దగ్గరకు స్క్రిప్టు పట్టుకెళ్తే… ‘నాన్ థియేటరికల్ రైట్స్ మొత్తం నాకిస్తే సినిమా చేస్తా’ అంటున్నాడట. అదే తన రెమ్యునరేషన్ అన్నమాట. అంటే నిర్మాతకు రాబడి కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే వస్తాయ. కానీ థియేటర్ వచ్చే రెవిన్యూ తగ్గిపోవటంతో , అంత బడ్జెట్ వర్కవుట్ కాదని ఆ నిర్మాత వెనక అడుగు వేసారు.
ఇలాంటివి ఇండస్ట్రీలో రోజువారి జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఇండస్ట్రీనే నమ్ముకున్న వందల టెక్నీషియన్స్, నటులు రోజుకు రెండుసార్లు మెనూ కాదు… మనుగడ గురించి ఆలోచించాల్సిన పరిస్దితి వచ్చేసింది. ఇప్పటికే కొందరు నటులు, టెక్నీషియన్స్ పని లేక ఇళ్లకు పరిమితమయ్యారు.
అయితే ఇంత సంక్షోభంలోనూ ఇండస్ట్రీకి పవర్ బ్యాంకుల్లా నిలిచిన రెండు బేనర్లు:
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
మైహోం గ్రూప్ & ఆహా మద్దతుతో ముందుకు వెళ్తున్నారు. మీడియం బడ్జెట్ సినిమాలు, పెద్ద సినిమాలు రెండూ చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్
టి-సిరీస్ బ్యాకింగ్‌తో ముందుకు వస్తున్నారు. మిడ్-రేంజ్ మూవీల్లో నష్టాల తరువాత, ఇప్పుడు బిగ్ టికెట్ ఫిలింల పైనే ఫోకస్.
దిల్ రాజు ఇంకా బ్యాటిల్‌లోనే ఉన్నాడు.
గేమ్ ఛేంజర్ వంటి పెద్ద సినిమా దెబ్బ కొట్టినా సంక్రాంతికి వస్తున్నాం వంటి కామెడీ సినిమా ఊపిరి నిలిపింది దిల్ రాజు బ్యానర్ ని. దాంతో ఆయన ఇప్పుడు కొత్త ఆలోచనలు ప్లాన్ లు వేస్తున్నారు. విజయ్ దేవరకొండ, నితిన్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇంకా కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు ఓకే చేసేముందు ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు. థియేటర్ కల్చర్ ని నిలబెట్టాలనేదే ఆయన ఆలోచన. ఎందుకంటే ఆయన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా.
ఇంతకు మించి మార్గం లేదు
ఏదైమైనా ఇండస్ట్రీని తిరిగి కోలుకోనివ్వాలంటే… ఓటీటీలు భయపెట్టే ప్లాట్‌ఫామ్‌లు కాకూడదు. కలలు స్పాన్సర్ చేసే స్క్రీన్స్ కావాలి. అలాగే నిర్మాతలు అత్యాశలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. సినిమా ప్రారంభానికి ముందే ఓటీటీ సంస్థల నుంచి డీల్ తెచ్చుకొని, ఆ పెట్టుబడితో సినిమాలు తీద్దామన్న నిర్మాతలకు ఆ తెలివి ఇంక పనిచేయకపోవచ్చు.
ముఖ్యంగా చిన్న మీడియం సినిమాలకి ఇప్పుడు ఓటీటీ బిజినెస్ కష్టమే. నిర్మాతలు కూడా ఓటీటీ ఆప్షన్ పై బ్లైండ్ గా నమ్మకం పెట్టుకోవడం మానేయాలి. ప్రేక్షకులుని థియేటర్స్ కి రప్పించే సినిమా తీయడం తప్పించి వేరే దారి లేదు. అలాంటి సినిమాలకే అన్ని బిజినెస్ లు సులువుగా జరుగుతాయి.
Next Story