మే 2024  రిలీజ్ లిస్ట్:  ఏ సినిమా హిట్ అవ్వచ్చు.. ఏది తేడా కొట్టొచ్చు?
x

మే 2024 రిలీజ్ లిస్ట్: ఏ సినిమా హిట్ అవ్వచ్చు.. ఏది తేడా కొట్టొచ్చు?

తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఈ నెల మొత్తం చిన్న సినిమాలే సందడి చేయనున్నాయి. అన్నీ కూడా ప్రేక్షకుల ఇంట్రస్ట్‌ ఆకర్షించినవే.. అవేంటంటే..


తెలుగు సినిమా పరిశ్రమ ఈ ఏడు ప్రారంభం నుంచి స్లంప్‌ని ఎదుర్కొంటోంది. నాలుగైదు సినిమాలు తప్పించి చెప్పుకో దగ్గ జెన్యూన్ హిట్ అయ్యినవి కనపడటం లేదు. జూనియర్‌ ఆర్టిస్టులు, థియేటర్ల వద్ద సైకిల్‌ స్టాండుల్లో పనిచేసేవారి వద్ద నుంచి సూపర్‌ స్టార్స్‌ వరకు వేలాది మంది ఈ పరిశ్రమ మీద ఆధారపడ్డారు. తెలుగు సినిమా పరిశ్రమ విజయ పథంలో ఉంటే కొన్ని వేల సామాన్య కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వచ్చిన సినిమా వచ్చినంత స్పీడుగా పెట్టే బేడా సర్దేసుకుంటే ఎలా. కారణం ఓటీటీ అంటూ తోసేసి మిధ్యా ప్రశాంతతను అనుభవించే ప్రయత్నంలో ఉన్నారు.

రెమ్యూనరేషన్లు పెంచుకుని కొండెక్కి కూర్చున్న స్టార్స్‌, రీమేక్‌లను తప్ప ఒరిజినల్‌ కథలను నమ్మలేని నిర్మాతలు, బయ్యర్లు, టికెట్‌ రేట్లను విపరీతంగా పెంచేసిన థియేటర్‌ యజమానులు, వీడియో పైరసీ ఇవన్నీ కూడా తెలుగు సినిమా పరిశ్రమకు శాపాల్లా తయారయ్యారనే విషయాన్ని వరు మరిచారు. తక్కువ బడ్జెట్‌తో తీసి ఎక్కువ కలెక్షన్లు రాబడుతున్న శుభ్రమైన సినిమాలు తగ్గిపోయాయి. దాంతో ఎప్పటికప్పుడు వచ్చే నెలలో పరిస్థితి కాస్త మారుతుందనే ఆశ పెట్టుకోవడం తప్పించి ఏమీ చెయ్యలేని సిట్యువేషన్.

కర్ణుడు చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు ఓటిటి, శాటిలైట్ ఛానల్, డిజిటల్ వ్యాపారాలు బాగా తగ్గిపోవడమే ప్రధాన కారణాలుగా కనబడుతున్నాయి. కోవిడ్ తర్వాత లెక్కలు మారాయి. ప్రతి సినిమా థియేట్రికల్ వ్యాపారం కాకుండా డిజిటల్ వ్యాపారం కూడా బాగుండటంతో సినిమాలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు డిజిటల్ వ్యాపారం కూడా బాగా పడిపోవటంతో నిర్మాతలు షూటింగ్స్ వెళ్లడానికి జంకుతున్నారు.

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'దేవర', అల్లు అర్జున్ 'పుష్ప 2', ప్రభాస్ నటిస్తున్న 'కల్కి 2898', చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ సినిమా 'విశ్వంభర', నాని నటిస్తున్న 'సరిపోదా శనివారం', రవితేజ, హరీష్ శంకర్ సినిమా 'మిస్టర్ బచ్చన్', ఇవి కాకుండా ఇంకా కొన్ని చిన్న సినిమాలు తప్పితే కొత్తగా సినిమాలు ఏవీ షూటింగ్స్ మొదలెట్టలేదని తెలుస్తోంది.

అవి పక్కన పెడితే కాస్త సినిమాలు థియేటర్‌లో ఆడితే అయినా సిట్యువేషన్ ఛేంజ్ అవుతుంది. ఆడిన సినిమాకు ఓటిటి మార్కెట్ దానంతట అదే పలుకుతుంది. ఈ మే నెలలో పెద్ద సినిమాలు లేవు కానీ చిన్న సినిమాలు మాత్రం రిలీజ్‌కు బాగానే ఉన్నాయి. వాస్తవానికి మే 5న రిలీజ్ కావాల్సిన కల్కి 2898 ఏడీ మూవీ వాయిదా పడకపోతే పరిశ్రమ కాస్త కళకళ్లాడుతూ ఉండేది. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోస్ సినిమాలు ఈ వేసవిలో విడుదల కావడం లేదు. కానీ ఈనెల మొత్తం బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఈ నెలలో విడులయ్యే సినిమాల లిస్ట్ ఇస్తున్నాం. వీటిలో ఏ సినిమా హిట్ అవ్వచ్చు, ఏది తేడా కొట్టచ్చొ? గమనించి కామెంట్ చేయండి.

ఆ ఒక్కటీ అడక్కు..

కామెడీ సినిమాలతో ఒక టైమ్‌లో కళకళ్లాడిపోయిన అల్లరి నరేష్.. గత కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేసుకుంటున్నాడు. నాంది, ఉగ్రం అంటూ సినిమాలు చేసి ఇప్పుడు మళ్లీ తన టైప్ మార్క్ కామెడీతో అలరించేందుకు రెడీ అయ్యాడు. అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన సినిమా ఆ ఒక్కటీ అడక్కు. ఈ సినిమాను మే 3న రిలీజ్ చేయనున్నారు.

బాక్..

‘అరణ్మనై’ తమిళంలో సూపర్ హిట్ ఫ్రాంచైజీ, తెలుగులో విడుదలైన అన్ని వెర్షన్లు హిట్ అయ్యాయి. ఈ హారర్-కామెడీ సిరీస్ నాల్గవ ఫ్రాంచైజీ తెలుగులో ‘బాక్’ పేరుతో వస్తోంది. ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. అవ్ని సినిమాక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కుష్బూ సుందర్, ఎసిఎస్ అరుణ్ కుమార్ నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుండి తమన్నా, సుందర్ సి లుక్స్‌ని విడుదల చేశారు. తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన కామెడీ హార్రర్ మూవీ బాక్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై మరింత క్యూరియాసిటీని కలిగించాయి. ఈ చిత్రాన్ని మే 3న రిలీజ్ చేయనున్నారు.

ప్రసన్న వదనం..

సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ’ప్రసన్న వదనం’. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్‌కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

శబరి

విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar) ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'శబరి'(Sabari Movie). ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ (Anil katz) 'శబరి' సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానుంది. బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి చేసిన సాహసమే ఈ చిత్రం.

జితేందర్ రెడ్డి

ఉయ్యాల జంపాల, మజ్ను సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ (Virinchi Varma) దర్శకత్వంలో పేక మేడలు సినిమాతో నిర్మాతగా బాహుబలి, ఎవరికి చెప్పొద్దు వంటి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె (Rakesh Varre) లీడ్ రోల్‌లో నటించిన సినిమా జితేందర్ రెడ్డి (Jithender Reddy). 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ మే 3న రిలీజ్ కానుంది.

కృష్మమ్మ

సత్యదేవ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన‌ రివెటింగ్ థ్రిల్లర్ కృష్ణమ్మ. వివి గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు. ప్ర‌ముఖ పంపిణీ సంస్థలు, మైత్రీ మూవీ మేకర్స్ - ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యం.. యాక్షన్‌ ఎమోషన్స్ తో ఆక‌ట్టుకోనుంది. కృష్ణా ప్రాంతంలో సాగే ఈ చిత్రం ముగ్గురు స్నేహితుల క‌థ‌తో తెర‌కెక్కింది. తాము చేయని నేరానికి ఒక తీవ్రమైన కేసులో చిక్కుకున్న ముగ్గురు అనాథ‌ల కథతో రూపొందింది. మే 10న విడుదల కానుంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

ఇటీవల గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వక్ సేన్ నటించిన మరో లేటెస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నేహా శెట్టి జంటగా నటించిన సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. 1960ల నాటి గోదావరి జిల్లాల నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమాను మే 17న రిలీజ్ చేయనున్నారు.

సత్యభామ

ఇటీవల ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన కాజల్.. ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’తో ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. ఏసీపీ సత్యభామగా తన ఉగ్రరూపం చూపించబోతున్నారు. ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సత్యభామ మూవీ మే 17న విడుదల కానుంది.

లవ్ మీ

ఆశిష్, అందాల భామ వైష్ణవి చైతన్య కాంబినేషన్‌లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమా ‘లవ్ మీ’. దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో హీరో.. దెయ్యం ఉన్న ఒక పాడుబడ్డ బిల్డింగ్‌లోకి వెళ్తాడు. అక్కడ జరిగిన కథే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తుంది. దెయ్యంతో డేటింగ్, రొమాన్స్, లవ్ అనే విషయాలు యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. మరి థియేటర్స్‌లో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. అరుణ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తుండగా, స్టార్ కెమెరామెన్ పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా చేస్తున్నారు.

గం.. గం.. గణేశా

ఆనంద్ దేవరకొండ నటిస్తున్న సినిమా గం.. గం.. గణేశా . బేబి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకొస్తున్న సినిమా "గం..గం..గణేశా". ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ తన కెరీర్‌లో చేస్తున్న ఫస్ట్ యాక్షన్ మూవీ ఇది కావడం విశేషం. ఇవాళ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. మే 31న "గం..గం..గణేశా" సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

మ్యూజిక్ షాప్ మూర్తి

వీటితోపాటు.. మ్యూజిక్ షాప్ మూర్తి కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. మ్యూజిక్ అంటే ఇష్టం ఉన్న ఓ మిడిల్ క్లాస్ 50 ఏళ్ల వ్యక్తి హైదరాబాద్‌కి డీజే అవ్వాలని వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఈ ప్రయాణంలో 25 ఏళ్ల అమ్మాయితో ఆయన ప్రయాణం ఎలా సాగింది అనే కథాంశంతో ఈ సినిమా సాగనున్నట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఓటిటిలో

వీటితో పాటు మే నెలలో ఎన్నో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మే 2024 లో హీరామండి, ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2, బ్రిడ్జర్టన్ సీజన్ 3, ది మిడ్‌నైట్ రొమాన్స్ ఎట్ హగ్వాన్ సహా అనేక వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో రానున్నాయి. వీటిలో బిగ్ సిగార్, డార్క్ మ్యాటర్, అకాపుల్కో, క్రాష్ వంటి షోల కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Read More
Next Story