మిషన్ ఇంపాసిబుల్ – ఫైనల్ రెకనింగ్ (2025) రివ్యూ
x

మిషన్ ఇంపాసిబుల్ – ఫైనల్ రెకనింగ్ (2025) రివ్యూ

ఈ చిత్రం కథేమిటి, సినిమా ఎలా ఉంది, చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.


దాదాపు 30 సంవత్సరాలుగా, మిషన్: ఇంపాజిబుల్ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్సులు ప్రపంచాన్ని అలరిస్తూనే ఉన్నాయి. అందుకే వాటికి అంతంలేదు. టామ్‌ క్రూజ్ కు విశ్రాంతి లేదు. ఆయన హీరోగా ఈ ప్రాంఛైజీలో చేసిన లేటెస్ట్ మూవీ 'మిషన్‌ ఇంపాజిబుల్‌: ది ఫైనల్‌ రెకనింగ్‌'. ఇది 2023లో వచ్చిన 'మిషన్‌ ఇంపాజిబుల్‌: డెడ్ రెకనింగ్‌' సినిమాకి సెకండ్ పార్ట్. MI ఫ్రాంచైజీలో 8వ సినిమాగా రూపొందింది. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో క్రిస్టోఫర్‌ మేక్‌క్వారీ తెరకెక్కించారు. గ్లోబల్ వైడ్ గా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం.. ఈ శనివారం (మే 17) రిలీజైంది. ఈ చిత్రం కథేమిటి, సినిమా ఎలా ఉంది, చూడదగినదేనా వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

చివరి భాగం ముగిసిన దగ్గర నుంచే కథ మళ్లీ మొదలైంది. మానవాళి భవిష్యత్తుపై నియంత్రణ సాధించగల శక్తిమంతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ – ‘ది ఎంటిటీ’. దీన్ని ఆపగలిగితేనే భవిష్యత్తు ఉంది. దాని తాళాలు ఎవరి చేతికి చిక్కితే, వారు ప్రపంచాన్ని శాసించగలరు.

దీన్ని క్లారిటీగా అర్థం చేసుకున్న ఈథన్ హంట్ (టామ్ క్రూస్) వాటిని ముందు దక్కించుకుంటాడు. కానీ – ‘ది ఎంటిటీ’ ఒరిజినల్ సోర్స్ కోడ్ – సముద్రగర్భంలో అత్యంత లోతైన ప్రదేశంలో నిద్రాణంలో ఉన్న సెవాస్ట్‌పోల్ సబ్‌మెరైన్ లో ఉందని తెలుస్తుంది..

ఈ విషయం తెలుసుకున్న తర్వాత... అమెరికా అధ్యక్షురాలు ఎరికా స్లోన్ (ఏంజెలా బాసెట్) నుంచి మన హీరోకు ఓ వాయిస్ మెసేజ్ పంపుతుంది – "ఇది మిషన్ ఇంపాసిబుల్ కాదు ఈథన్… ఇది మిషన్ అన్‌డూయబుల్. కానీ నీకే ఇది చేయగల శక్తి ఉంది."అని.

ఇక్కడ నుంచి మొదలవుతుంది అతని మరో సాహస ప్రయాణం. కంటికి కనిపించని శత్రువు – కంప్యూటర్‌ల్లొ దాగి, మనసులను చిద్రం చేసే ‘ఎంటిటీ’ తో యుద్ధం. ఎవరైనా ముందస్తు అడుగు వేస్తే, అది ముందే అంచనా వేసేస్తుంది. ఇది ఒక AI కాదు... ఇది ఒక దేవుడు కావాలన్న పిచ్చిపట్టిన మనిషి చేతిలోకి వెళ్ళిన శక్తి.

ఈ మిషన్‌లో ఈథన్‌ ఎవర్ని కోల్పోయాడు?

ఆ తాళాల కోసం ఎంత వరకు వెళ్ళాడు?

ఈ అన్వేషణలో అతనికి ఎదురైన దారుణ నిజాలేంటి?

ఏదైమైనా మరో సారి ప్రపంచాన్ని కాపాడే ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో ఎవరిని కోల్పోయాడు? అన్నది చిత్ర కథ.

విశ్లేషణ

డైరెక్టర్ క్రిస్టోఫర్ మెక్ క్వారీ, ఈసారి యాక్షన్ కంటే డ్రామాకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. యాక్షన్ సినిమాల్లో ఇది గొప్ప ప్రయోగం. కానీ కాస్త దెబ్బతిన్నదనే చెప్పాలి. ఎందుకంటే యాక్షన్ కోసం వెళ్లిన వాళ్లకు డ్రామా రుచించటం కాస్త కష్టమే. అలాగే విలన్ గాబ్రియల్ పాత్ర తొలి కొన్ని సన్నివేశాల్లోనే మెరిసి, మళ్లీ చివర్లోనే కనిపించడం కూడా ఒక నిజమైన స్పై థ్రిల్లర్‌కు అవసరమైన సైకాలజికల్ టెన్షన్‌ను అందించలేకపోయింది.

మనిషి-మేధస్సు vs మనం-సృష్టించిన యాంత్రిక మేధస్సు మధ్యలో నడిచే మానవతా సమరమే ఈ కథ. ఈథన్ హంట్ (Tom Cruise), మళ్ళీ రంగంలోకి దిగతాడు. కానీ ఈ సారి పక్కన గన్ కాదు... గుండె ఉంటుంది. పైకి మిషన్‌ లా అనిపించినా, లోపల వ్యక్తిగతంగా అతడి నమ్మకాలకు, త్యాగాలకు, అనుబంధాలకు ఎదురైన పరీక్షగా కథ,కథనం నడుస్తుంది.

అలాగే ఎంటిటీ శక్తిని గురించి మరింతగా చూపించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పార్ట్‌లో అది ఇంటెలిజెంట్‌గా ఎలా ప్లే అవుతోంది అనే భావన కొన్ని సీన్లతో బలంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. కానీ ఈ పార్ట్‌లో… అది ఒక స్పిరిట్ లా ఉంటుందే తప్ప, తన శక్తి ఎలా ప్రభావితం చేస్తోంది అన్నది చూపించడంలో ఫెయిలయ్యారు అనిపిస్తుంది.

అలాగే ఈ కథలో హై డ్రామా అంతా..Entity ఎక్కడ ఉంది అన్నది ముఖ్యం కాదు, Entity ఏ రూపంలో ఉంది అన్నదే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. దాంతో ఎమోషనల్ పవర్‌లో, విలన్ డెప్త్‌లో – ఇది గత మిషన్‌లను తలపించదు.

ఫస్టాఫ్ చప్పగా ,స్లోగా నడిచినా ఒక్కసారిగా అమెరికా అధ్యక్షురాలి (Angela Bassett) వాయిస్ నోట్ ద్వారా స్క్రీన్‌ప్లే కీలక ముడిని బిగిస్తారు. అదే "Entity Source Code ను సముద్రగర్భంలో నాశనం చేయాలి." అక్కడ నుంచే కథ పరుగెడుతుంది. అప్పటిదాకా "Mission Impossible" కంటే "Mind Impossible" అనిపించేలా... కథ నెమ్మదిగా ప్రయాణిస్తూ, పాత్రల మధ్య మానసిక యుద్ధాన్ని ఆవిష్కరిస్తూ నడుస్తుంది.

ఈథన్ హంట్‌ సబ్‌మెరైన్‌లోకి దిగిన క్షణం నుంచి స్క్రీన్‌ప్లే అడుగడుగునా థ్రిల్స్ ఇస్తూనే ఉన్నాడు. స్క్రిప్టు "rise-fall-rise" టైప్ లో నడుస్తూ, ప్రేక్షకుడిని సీట్లలో మునివేళ్లపై కూర్చోపెడుతుంది.

ఇక ఈ సినిమాలో Emotional payoff: Entity ను వదిలిపెట్టడం కాదు, దాన్ని అర్థం చేసుకోవాలన్న సిద్ధాంతం. AI తో యుద్ధం కాదు, మనిషి విలువను తిరిగి గుర్తు చేయడమే.

సాంకేతికంగా...

సినిమా ఓ విజువల్ ఫీస్ట్. ప్రతి ఫ్రేమ్ – ఒక ఫొటోగా ప్రింట్ తీసుకునేంత అద్భుతంగా ఉంటుంది. సౌండ్ డిజైన్, మ్యూజిక్ – మరొక మ్యాజిక్. అయితే ఈ సినిమాలో అసలు మైనస్ ఎలిమెంట్ ఏంటంటే – లెంగ్త్. సగటు ప్రేక్షకుడి ఓపికను పరీక్షించేలా 2 గంటల 50 నిమిషాలు. ఇందులో దాదాపు 20 నిమిషాల వరకూ ట్రిమ్ చేస్తే, స్క్రీన్‌ప్లే మరింత షార్ప్‌గా, థ్రిల్లింగ్‌గా ఉండేది.

ఫైనల్ థాట్

మీరు మిషన్ ఇంపాజిబుల్ అభిమానులు అయితే ఎలాగో ఈ సినిమా చూస్తారు. కానివారు సినిమాలో వచ్చే సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కోసం, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎగురుతున్న విమానం మీద జరిగే యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసమైనా చూడాలి.

Read More
Next Story