అన్వేషిప్పిన్‌ కండెతుమ్’ నెట్‌ఫ్లిక్స్‌ క్రైమ్ థ్రిల్లర్ రివ్యూ
x
Source: Twitter

'అన్వేషిప్పిన్‌ కండెతుమ్’ నెట్‌ఫ్లిక్స్‌ క్రైమ్ థ్రిల్లర్ రివ్యూ

రెండున్నర గంటలు ప్రేక్షకులను స్క్రీన్లకు అతుక్కుపోయేలా చేసే క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ మూవీ ‘అన్వేషిప్పిన్ కండెతుమ్’. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..



నిజ జీవిత కథలను తెరకెక్కించటం కత్తిమీద సామే. అయితే మళయాళీలు దాంట్లో మాస్టరీ చేసేశారు. ముఖ్యంగా క్రైమ్ థ్రిల్లర్, ఇన్విస్టిగేషన్ ఫిల్మ్స్‌కు వాళ్లు కేరాఫ్ ఎడ్రస్‌గా మారిపోయారు. పక్కకు వెళ్లకుండా కేవలం కథ మీద, నేరేషన్ మీదా దృష్టి పెట్టి నడిచే ఈ సినిమాలు ఓటిటిలు వచ్చాక మనకు బాగా దగ్గరయ్యాయి. తాజాగా నెట్‌ప్లిక్స్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్’ అనే ఈ మళయాళి చిత్రం థియేటర్‌లోనూ పెద్దగా సక్సెస్ అయ్యింది. కేవలం రూ.8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.40 కోట్లకి పైగా ఎలా వసూలు చేసిందనేది ఈ సినిమా నడిపించిన విధానం చూస్తే అర్థమవుతుంది. పాటలు, ఫైట్స్ లేకుండా, విలన్‌ను కూడా చివర్లోనే రివీల్ చేసి షాక్ ఇచ్చే ఈ సినిమా రెండున్నర గంటలు అలా కూర్చోబెడుతుంది. ఇంతకీ ఏముందీ ఈ సినిమాలో అంటే..
‘అన్వేషిప్పిన్‌ కండెతుమ్’ సినిమా కథ సెల్ ఫోన్స్ గట్రా లేని 1993లో జరుగుతుంది. మాథన్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు ఉంటారు. అందులో రెండో అమ్మాయి లవ్లీ (అనఘ) డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంటుంది. ఆమె హాల్ టికెట్ కోసం కాలేజ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి కంగారు పడి పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. ఎస్‌ఐ. ఆనంద్ నారాయణన్ (టోవినో థామస్) ఈ కేసును డీల్ చేయడానికి తన టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. అయితే అనుకోని విధంగా అది మిస్సింగ్ కేసు కాదని మర్డర్ కేసు అని.. ఆ యువతి మృతదేహం ఓ బావిలో తేలటంతో బయటపడుతుంది. అయితే ఈ మర్డర్ చేసిందెవరు? ఆ ఇన్విస్టిగేషన్‌లో ఆమె చనిపోవడానికి ముందు ఆమెను ఓ చర్చి ఫాదర్ గెస్ట్ హౌస్ దగ్గర చూశారని తెలుస్తుంది.
అయితే అక్కడ లోకల్ క్రిష్టియన్స్ నుంచి సమస్యలు. అలాగే చర్చి ఫాదర్ థామస్‌ను ప్రశ్నించడానికి ఆనంద్ నారాయణన్‌ పైఅధికారిగా అలెక్స్ ఒప్పుకోడు. అంతేకాకుండా వేరే ఒకరిని ఆ కేసులో ఇరికించి కేసు క్లోజ్ చేయాలనుకుంటారు. కానీ ఎస్సై ఆనంద్‌ అసలైన నేరస్తుడిని పట్టుకోవటానికి నానా కష్టాలు పడతాడు. అనధికారికంగా ఇన్విస్టిగేషన్ చేపడతాడు. చివరకు కొన్ని నిజాలు బయటకు తెచ్చి ఆ హంతకుడిని కోర్టు ఎదుట నిలబెట్టే ప్రయత్నంలో.. అనుకోని సంఘటన జరుగుతుంది.
ఆ హంతుకుడు తప్పించుకుంటాడు. ఎస్సైతో పాటు కలిసి పనిచేసిన ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెండ్ అవుతారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆనంద్ జీవితం మరో టర్న్ తీసుకుంటుంది. ఏ క్లూ దొరక్క దాదాపు క్లోజ్ అయ్యే ఓ కేసుని ఉన్నతాధికారులు అతడికి అప్పచెప్తారు. ఆ కేసు గెలిస్తే తిరిగి పోయిన తన పరువు వస్తుందని మరింత కసిగా అందరూ చేతులెత్తేసిన కేసుని చేపట్టి క్లూలు లేని చోట.. కూడా కష్టపడి వాటిని ఎలా పట్టుకుని సాల్వ్ చేసారనేది కథ.

నిజానికి ఈ సినిమా రెండు కథల కలబోత. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నారు. ఎక్కడ ట్విస్ట్‌లు పేల్చారో అక్కడికి కథను నీట్‌గా తీసుకెళ్లారు. మొదటి కథ.. కేరళలో జరిగిన “సిస్టర్ అభయ కేసు” ని బేస్ చేసుకుని రాసుకున్నారు. పెద్ద మార్పులు ఏమీ లేకుండానే కథను నడిపారు. తెర మీద, నిజ జీవితంలోనూ చనిపోయిన అమ్మాయి స్టూడెంట్. చర్చితో లింక్ అప్ అయ్యి ఉన్నవే. మర్డర్ చేసే విధానం కారణం కూడా దాదాపు ఒకటే. రెండింటిలోనూ ఓ దొంగతనం కీలకం.
అయితే నిజ జీవితంలో ఇన్వెస్టిగేట్ చేసిన అధికారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇక్కడ సినిమాలో ఆ అధికారి సస్పెండ్ అయినట్లుగా చూపించారు. అయితే ఈ కేసు నుంచి ప్రేరణ పొంది తీసిన ఈ సినిమా ఇదేమీ మొదటిది కాదు. సురేష్ గోపి ప్రధాన పాత్రలో క్రైమ్ ఫైల్ అని ఓ సినిమా వచ్చి సక్సెస్ అయ్యింది. అలాగే మరికొన్ని సినిమాల్లోనూ ఈ కేసును వాడారు. మళ్లీ ఇంతకాలానికి అదే కేసును బేస్ చేసుకుని కథ రాసుకున్నారు.

ఇక ఇంత పాత కథ ఇప్పుడు చూడటానికి ఏముంటుంది అంటే.. చాలా సహజంగా ఇలాగే జరుగుతుంది కదా ఇన్విస్టిగేషన్ అనిపించే సీన్స్ ఉండటం కారణం. డార్విన్ కురియకోస్ ఈ సినిమాని డైరెక్ట్ చేసి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. ఒక మర్డర్ కేసులో అసలైన హంతకులను పట్టుకోవడం కోసం నిజాయితీగా పనిచేసి విధుల నుంచి తొలగించబడిన ఒక పోలీస్ అధికారి, మరో హత్య కేసులో అనధికారికంగా పనిచేసి, తిరిగి విధుల్లో చేరడమే ఈ కథ.
మొదటి కేసుకి, రెండో కేసుకీ ఎక్కడా సంభందం కానీ లింక్ కానీ లేకపోయినా ఎక్కడా బోర్ కొట్టదు. టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా సౌండ్‌గా ఉంది. సంతోష్ నారాయణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్. గౌతమ్ శంకర్ కెమెరా వర్క్ చూస్తుంటే కేరళ వెళ్లి చుట్టేసి రావాలనిపిస్తుంది. కథ సైజు శ్రీధరన్ ఎడిటింగ్ ఫెరఫెక్ట్. టోవినో థామస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తెలుగులోనూ అతనికి ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది.

చూడచ్చా

క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి విందు భోజనం లాంటిది. మిగతావారు కూడా బోర్ కొట్టని ఈ సినిమాని చూడచ్చు.

ఎక్కడ చూడవచ్చు : నెట్ ప్లిక్స్‌లో (తెలుగులో ఉంది)


Read More
Next Story