విషాదం! ‘మన శంకర వరప్రసాద్ గారు’ చూస్తూ అభిమాని మృతి!
x

విషాదం! ‘మన శంకర వరప్రసాద్ గారు’ చూస్తూ అభిమాని మృతి!

-గుండెపోటే కారణమా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తున్న వేళ… హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కూకట్‌పల్లి అర్జున్ థియేటర్‌లో సినిమా చూస్తున్న సమయంలో ఓ మెగా అభిమాని అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందడం కలకలం రేపింది.

సోమవారం ఉదయం 11.30 గంటల షో సందర్భంగా, థియేటర్‌లో కూర్చున్న ఓ వ్యక్తి ఒక్కసారిగా అస్వస్థతకు గురై తన సీటులోనే పడిపోయాడు. వెంటనే స్పందించిన ప్రేక్షకులు అతన్ని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాథమికంగా గుండెపోటే మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

మృతుడిని 12వ బెటాలియన్‌కు చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్–ఇన్‌స్పెక్టర్ ఆనంద్ కుమార్గా గుర్తించారు. సినిమా మధ్యలో అకస్మాత్తుగా కుప్పకూలిపోవడంతో థియేటర్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. మెగాస్టార్ అభిమానుల సందడి మధ్య ఈ ఘటన చోటుచేసుకోవడం అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేసింది.

సమాచారం అందుకున్న కూకట్‌పల్లి పోలీసులు థియేటర్‌కు చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించగా, వైద్య నివేదిక అనంతరం మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని తెలిపారు. ఈ ఘటనతో థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

ఇదిలా ఉండగా, అదే సినిమాకు సంబంధించి మరో చోట ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ లంగర్ హౌస్‌లోని అలంకార్ థియేటర్ వద్ద ఉదయం 7.30 గంటల షోను యాజమాన్యం అకస్మాత్తుగా రద్దు చేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుక్‌మైషో ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నామని, థియేటర్‌కు వచ్చిన తర్వాతే షో క్యాన్సిల్ అయిన విషయం తెలిసిందని వారు ఆరోపించారు.

ముందస్తు సమాచారం లేకుండా షో రద్దు చేయడంపై యాజమాన్యంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. చివరకు ఉదయం 11 గంటల షోకు టికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఇస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

సంక్రాంతి 2026 కానుకగా విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు అన్ని చోట్ల మంచి స్పందన వస్తున్న వేళ… ఒకవైపు విజయోత్సవాలు, మరోవైపు ఈ విషాద ఘటనలు అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.

Read More
Next Story