
ఓటీటీ కండీషన్స్ Vs హీరో రెమ్యునరేషన్స్
నిర్మాతకి ఇదో నరకయాత్ర!
ఈ రోజుల్లో నిర్మాత సినిమా మొదలెట్టాలి అంటే కావాల్సింది కథలు కాదు...హీరోల డేట్స్, ఓటిటి డీల్స్. ఈ రెండింటి మధ్యే నిర్మాత నలుగుతున్నాడు. ఓ వైపు స్టార్ హీరో – ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ రెట్టింపు చేసి, “మాకు ఓటిటిలో క్రేజ్ ఉంది కదా!” అని డిమాండ్ పెడతాడు. మరోవైపు ఓటీటీ ప్లేయర్లు – “మా డేటా ఇలా చెప్పుతోంది, ఈ డేట్‌కి రిలీజ్ చేయండి, లేదంటే డీల్ కట్!” అంటూ నిర్మాతని ప్రెజర్ చేస్తారు. ఈ ఇద్దరికీ అవసరం నిర్మాతే. కానీ రివర్స్ లో ఆ ఇద్దరూ తామే అవసరం అనేలా నిర్మాతను ట్యూన్ చేసేసారు.
నిర్మాత సినిమా తీయాలనే అవసరాన్ని, క్రియేటవ్ వ్యసనాన్ని ఆయుధంగా మార్చుకొని, అతని కలలను లెక్కలతో చీల్చేస్తున్నారు. అందుకే ఇవాళ నిర్మాత... సినిమా తీయడం కన్నా, వారితో చర్చలు జరపడంలో ఎక్కువ టైమ్ గడుపుతున్నాడు. వాస్తవంగా చూస్తే, ఇప్పుడు నిర్మాత సినిమా తీసేవాడు కాదు –" సర్దుబాటు చేసే మిడిల్మెన్!"
కరోనా తర్వాత ఓటీటీ సంస్థలు (Amazon Prime, Netflix వంటి గ్లోబల్ ప్లేయర్స్) భారతీయ సినిమాలపై ఫోకస్ పెంచాయి. మునుపెన్నడూ లేని రేంజ్లో డిజిటల్ హక్కులకు భారీ మొత్తాలు చెల్లించాయి. నిర్మాతలు థియేట్రికల్ మార్కెట్‌ని కూడా మించిన ఆదాయాన్ని ఇలా పొందగలిగారు. కానీ... అదే డబ్బు ఇప్పుడు వలయమైంది. ఓటీటీ సంస్థలు...నిర్మాతల అవసరాన్ని అవకాశంగా మార్చుకుంటూ రకరకాల కండీషన్స్ తో నిర్మాతను ఆడేసుకుంటున్నారు.
ఇది ‘సినిమా’ కాదు. ఇది ఓ పవర్ ప్లే.
మరో ప్రక్క స్టార్ హీరోలు – ఒకసారి హిట్ కొడితే చాలు, రెమ్యునరేషన్ డబుల్. "OTT డీల్ వచ్చిందిగా!" అని కాన్ఫిడెంట్‌గా డిమాండ్ పెడతారు.
వాళ్ల మార్కెట్ ఎంతన్నది కాదు, వాళ్ల క్రేజ్ ఎప్పుడూ ఉంటుంది అన్న అభిప్రాయాన్ని బలంగా చెప్తూంటారు.
ఒక నిర్మాత ప్రెవేట్ చర్చల్లో వాళ్ల హీరో గురించి ఇలా వాపోయాడు –“ఇతను థియేటర్‌కి పులి కాదు, కానీ ఓటీటీకి మాత్రం నెమలి అవుతాడంట!”
OTT ప్లేయర్లు – గతంలో నిర్మాతలకు ఫైనాన్షియల్ లైఫ్‌లైన్ ఇచ్చినవాళ్లు, ఇప్పుడు వారి క్రియేటివ్ డెసిషన్లపై వీటో అధికారాన్ని చెలాయిస్తున్నారు. "ఫలానా డేట్‌కి రిలీజ్ చేయండి, లేదంటే మేము ఇన్ని కోట్లు తగ్గిస్తాం!" అంటున్నారు. ఇది దాదాపు ప్రతీ సినిమాకు వర్తిస్తోంది. రీసెంట్ గా శేఖర్ కమ్ముల కుబేర కు కూడా ఈ సమస్య వచ్చిందని ఏకంగా నిర్మాత స్వయంగా చెప్పారు.
సునీల్ నారంగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘మేం 'కుబేర' సినిమాను జూలైలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఓటీటీ సంస్థ మాత్రం జూన్ 20న రిలీజ్ చేయమని, లేకపోతే ఓటీటీ డీల్ నుంచి రూ. 10 కోట్లు కట్ చేస్తామని అడ్డంగా హెచ్చరించారు.’ అని బహిరంగంగా చెప్పేసారు.
అలాగే హరిహర వీరమల్లు, విశ్వంభర వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు సైతం ఈ ఓటిటి తలనొప్పి తప్పటం లేదంటున్నారు. ఓటిటి డీల్స్, వారు పెట్టే కండీషన్స్ కు తల ఒగ్గాల్సివస్తోందని ట్రేడ్ అంటోంది.
అందుకు ఏకైక కారణం ఓటీటీలు ‘వ్యూస్’కు పని చేస్తాయి, కథకు కాదు. నిర్మాత కథ చూసుకునే స్టార్స్ ని సమీకరించి, సినిమా మొదలెడతారు. రెండింటికి చాలా తేడా ఉంది.
నిర్మాతకు ఓటిటిలు, స్టార్ హీరోలు అత్యవసరమా?
థియేటర్లలో అనిశ్చితి. ఫైనాన్సియర్స్ టెంక్షన్. ఓటీటీ డిపెండెన్సీ. స్టార్ హీరోలు లేకపోతే ఓపినింగ్స్ రాని పరిస్దితి. దీంతో నిర్మాత అనేవాడు ఇప్పుడు వాల్యూ(సంపద) సృష్టించే వాడేగానీ, వాల్యూ (విలువ) పొందే వాడు కాదనిపిస్తుంది.
The Changing Dynamics:
ఒకసారి లాభం ఇచ్చిన డిజిటల్ మార్కెట్ ఇప్పుడు Producer Puzzle గా మారింది. ఒకప్పుడు హక్కులు ముందు సేఫ్‌గా అమ్మేసుకుని స్మూత్‌గా థియేట్రికల్ రిలీజ్ చేసేవారు. ఇప్పుడు OTTలు అన్నీ చూసిన తర్వాతే డీల్ చెయ్యాలంటున్నారు. టీజర్, ట్రైలర్ వైరల్ కాకపోతే, రెవెన్యూ మొత్తం మారినట్టే!
మరీ ముఖ్యంగా రిలీజ్ డేట్‌ను తమ స్ట్రీమింగ్ యనాలిటిక్స్ ఆధారంగా వారు నిర్ణయిస్తున్నారు — థియేట్రికల్ హాలిడే సీజన్లకు విరుద్ధంగా. అందుకే ఇప్పుడు మనకు 2025 వేసవిలో సరైన పెద్ద సినిమా లేకుండా పోయింది. వేసవి మొత్తం వృధా అయ్యింది.
"Storytelling" vs "Storyselling"
సీనియర్ దర్శకులు స్వర్గీయ దాసరి గారు ఎప్పుడూ చెప్పే మాట ఒకటుంది.
“కథని ఎప్పుడైతే బిజినెస్ డామినేట్ చేస్తుందో...అప్పుడే సినిమా తన ఆత్మని కోల్పోతుంది.”
ఇప్పుడు అదే జరుగుతోంది – సినిమా మొదలు కాకముందే మొత్తం బిజినెస్ డీల్స్ పూర్తి చేయాలనే నిర్మాతలు ఉన్నారు. కథ చెప్పకపోయినా ఫర్వాలేదు తను అడిగిన రెమ్యునరేషన్ ఇస్తే చాలు అనే హీరోలు ఉన్నారు. వీళ్లద్దరి మధ్యా గేమ్ ఆడుతూంటాయి ఓటిటి సంస్దలు.
ఇదే కొనసాగితే... పెను ప్రమాదం
కొత్త నిర్మాతలు వ్యవస్థలోకి రావడానికి భయపడతారు. ఆల్రెడీ ఉన్నవారికి కథలు కన్నా బడ్జెట్ ప్యాకేజింగ్‌పైనే దృష్టి పెరుగుతుంది. దాంతో తెలుగు పరిశ్రమ creative desertగా మారే ప్రమాదం ఉంది.
ఏదైమైనా..
ఇవాళ నిర్మాత ఒంటరిగా ఉన్నాడు. హీరో కూడా కావాలి, OTT డీల్ కూడా కావాలి. అదే సమయంలో ఓటిటిల ఆడించే ఈ క్రొత్త ‘ప్యాకేజింగ్ పీడ’ నుంచి బయటపడాలంటే, తెలివైన ఆర్ధిక వ్యూహాలు, మరియు బలమైన మానవ సంబంధాలు అవసరం. లేదంటే “మనం తీసేది మన సినిమా కాదు – ఓటిటి మార్కెట్కోసం మనం తయారుచేస్తున్న ప్రోడక్ట్” అనే వాస్తవాన్ని డైజస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి రాబోతోంది.
ఈ గేమ్ ని మార్చాలి అంటే..
నిర్మాతలు, స్టార్స్, డిజిటల్ ప్లేయర్ల మధ్య ఒక సమగ్ర ప్రొఫెషనల్ ఫ్రేమ్‌వర్క్ అవసరం. ప్యానల్ వ్యవస్థ, రిలీజింగ్ కేలండర్‌తో పాటు "Creative Risk Buffer" అనే కాన్సెప్ట్ మనకూ రావాలి. మంచి సినిమా దొరికితే, అది డిజిటల్ మార్కెట్‌ను తేలికగా బీట్ చేయగలదని గతం చెప్తోంది.
అలాగే గేమ్ రూల్స్ మారాలి. అన్ని డిమాండ్లకూ “సరే” అన్న నిర్మాతల స్వరం మారాలి. నిర్మాతల దౌర్భాగ్యం కాకుండా – వాళ్ల గొప్పతనం గుర్తుచేసే సిస్టమ్ కావాలి.
ఒక సినిమా హిట్ కావాలంటే ఓ హీరో సరిపోతాడు.
కానీ ఒక ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలంటే... నిర్మాతలని కోల్పోకుండా నిలబెట్టుకోవాలి.