
చిరంజీవి సినిమాకే ఇలాంటి పరిస్థితా? దారుణం
'విశ్వంభర' చుట్టూ ముదురుతున్న మిస్టరీ!
టాలీవుడ్ రారాజు, బాక్సాఫీస్ సుల్తాన్ మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే ఓటటి బిజినెస్ వెంటనే అవ్వాలి, డిస్ట్రిబ్యూటర్స్ అడ్వాన్స్ లతో లైన్ లో నించోవాలి. రిలీజ్ కు ముందు నుంచే థియేటర్ల దగ్గర జాతర జరగాలి. కానీ, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మెగా ఫ్యాన్స్ తల పట్టుకోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది. 'విశ్వంభర' పేరుతో ఒక భారీ సోషియో-ఫాంటసీ సినిమా అనౌన్స్ చేసి రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటికీ దాని ఆచూకీ లేకపోవడం నిజంగా దారుణం. అసలు చిరంజీవి లాంటి స్టార్ సినిమాకే ఇలాంటి సిట్యువేషన్ రావటం వెనుక ఉన్న అసలు కారణాలు వింటే ఎవరైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.
విజువల్స్ వెన్నుపోటు?
సినిమా మొదలైనప్పుడు వశిష్ట విజన్ గురించి గొప్పలు చెప్పుకున్నారు, కానీ వచ్చిన టీజర్ చూశాక అంతా తలలు పట్టుకున్నారు. నాసిరకం గ్రాఫిక్స్‌తో మెగాస్టార్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తప్పును దిద్దుకోవడానికి కొత్త టీమ్‌ను రంగంలోకి దించినా, ఇప్పటికీ ఒక్క విజువల్ కూడా సంతృప్తికరంగా రాలేదని ఇన్‌సైడ్ టాక్. కోట్లు ఖర్చు పెడుతున్నా అవుట్‌పుట్ రాకపోవడం, రీ-షూట్ల మీద రీ-షూట్లు జరుగుతుండటంతో ప్రాజెక్ట్ ఒక అంతుచిక్కని సుడిగుండంలో చిక్కుకుంది.
ఒక్క సినిమా చూసి అంత భారీ ప్రాజెక్టా?
డైరెక్టర్ వశిష్ట తీసిన 'బింబిసార' చూసి ముచ్చటపడి మెగాస్టార్ ఈ సినిమాను అతనికి అప్పగించారు. అయితే, ఒక మీడియం హీరోతో తీసిన ఫాంటసీ సినిమాకు, 500 కోట్ల బడ్జెట్‌తో మెగాస్టార్ చేసే సినిమాకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందని అంటున్నారు. వశిష్టకు ఉన్న అనుభవం లేమి ఇప్పుడు ప్రాజెక్ట్‌కు శాపంగా మారిందని వార్తలు మొదలయ్యాయి. టీజర్ లోని గ్రాఫిక్స్ చూశాక, డైరెక్టర్ కి అంత భారీ విజువల్స్ ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉందా? లేక బింబిసార సక్సెస్ కేవలం ఒక మెరుపు మాత్రమేనా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
మేకింగ్‌లో భారీ లోపాలు.. రీ-షూట్ల పర్వం
సమస్య కేవలం గ్రాఫిక్స్ తోనే ఆగలేదు. తీసిన సీన్లు చూశాక మెగాస్టార్‌కే సంతృప్తి కలగలేదని తెలుస్తోంది. స్క్రిప్ట్ లో ఉన్న ఎమోషన్ స్క్రీన్ మీద పండకపోవడం, విజువల్స్ నాసిరకంగా ఉండటంతో సినిమాను మళ్లీ మళ్లీ షూట్ చేయాల్సి వస్తోంది. ఇంత భారీ సోషియో-ఫాంటసీని డీల్ చేయడంలో టీమ్ మొత్తం తడబడుతోంది. ఒక దశలో చిరంజీవి కూడా ఈ ప్రాజెక్ట్ అవుట్‌పుట్ చూసి అసహనం వ్యక్తం చేసినట్లు ఫిలిం నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మేకింగ్ లో క్లారిటీ లేకపోవడమే ఇప్పుడు అసలు సమస్యగా మారిందిగా చెప్పుకుంటున్నారు.
పండుగలు వస్తున్నాయి.. పోతున్నాయి!
సాధారణంగా చిన్న సినిమాలకు కూడా పండుగ పూట అప్‌డేట్స్ వస్తుంటాయి. కానీ, ఉగాది పోయింది, శ్రీరామనవమి దాటిపోయింది.. అయినా 'విశ్వంభర' టీమ్ నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. మెగాస్టార్ పుట్టినరోజున ఇచ్చిన ఆ పాత అప్‌డేట్ తప్ప, మళ్ళీ ఆ ఊసే ఎత్తడం లేదు. చిరంజీవి సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానుల ఆవేదనను మేకర్స్ అస్సలు పట్టించుకోవడం లేదు. కనీసం సినిమా ఉంటుందా లేదా అన్న క్లారిటీ కూడా ఇవ్వకపోవడం అత్యంత దారుణం.
సమస్య ఎక్కడుంది? నమ్మకం సన్నగిల్లిందా?
అసలు సమస్య కేవలం మేకింగ్‌లోనే కాదు, సినిమా భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాల్లో కూడా ఉంది. భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలు, ఇప్పుడు డిజిటల్ రైట్స్ ఆశించిన ధరకు అమ్ముడుపోకపోవడంతో డైలమాలో పడినట్లు వార్తలు వస్తున్నాయి. ఓటీటీ సంస్థలు సినిమా అవుట్‌పుట్ చూసి వెనకడుగు వేస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది. అటు చిరంజీవి కూడా ఈ జాప్యంతో విసిగిపోయి, తన తర్వాతి సినిమా షూటింగ్‌కు సిద్ధమైపోతున్నారు. అంటే 'విశ్వంభర'ను ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజీలో నెట్టేశారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టర్‌ను ఇలాంటి గందరగోళంలో పడేయడం మెగా అభిమానులకు మింగుడుపడటం లేదు. మరి ఈ సంక్షోభం నుంచి 'విశ్వంభర' ఎప్పటికి బయటపడుతుందో చూడాలి.
ఈ పరిస్థితిపై మీ స్పందన ఏంటి? కామెంట్స్ లో తెలియజేయండి.

