పవర్ స్టార్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ రివ్యూ
x

పవర్ స్టార్ ‘ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్’ రివ్యూ

పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షోనే కానీ..!


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల్లో పిల్లల సంక్షేమం కోసం పనిచేసే ఒక గొప్ప ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ రావు (కె.ఎస్. రవికుమార్).ఆయన ఒక ధైర్యవంతుడైన, బాగా చదువుమీద ఉన్న గిరిజన బాలుడిని (పవన్ కళ్యాణ్) చేరతీస్తాడు. ఆ ఉపాధ్యాయుడు ఆ బాలుడికి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అని పేరు పెట్టి, అతడిని బలమైన సామాజిక స్పృహ కలిగిన విద్యావంతుడిగా తీర్చిదిద్దుతాడు. తన తండ్రి ఒకప్పుడు ఉస్తాద్ అని..తన పేరు ముందు ఉస్తాద్ పెట్టుకుంటాడు. కాలక్రమంలో ఆ గురువు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. ఉస్తాద్ భగత్ సింగ్, లేదా భగత్,ఏసీపీ (పోలీస్ ఆఫీసర్‌)గా మారి దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు.

అంతా సజావుగా సాగుతున్న సమయంలో, ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న చదలమర్రి నల్ల నాగప్ప (ఆర్. పార్థిబన్) సీన్ లోకి వస్తాడు. నాగప్పకి చెందిన ముఠా ..ముఖ్యమంత్రి ని హతమార్చడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు భగత్ తన విశ్వరూపం చూపించి ఎలా తన గురువుని రక్షించుకున్నాడు.అదేక్రమంలో తన నిజాయితీ, నిబద్ధత కారణంగా భగత్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? రేడియో జాకీ (RJ) అయిన గీత (శ్రీలీల)కు, భగత్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? శ్లోక (రాశీ ఖన్నా) ఎవరు, ఆమెకు భగత్‌తో ఉన్న అనుబంధం ఏమిటి?చివరకు ఏమైంది అనేదే మిగిలిన కథ.

ఎనాలసిస్ :

ఒక స్టార్ ఎంట్రీకి థియేటర్‌లో ఊగిపోయేలా చేయటం సీనియర్ కమర్షియల్ దర్శకుడుకి చాలా ఈజీ… కానీ ఆ హైని రెండు గంటల పాటు స్క్రీన్‌ప్లే తో నిలబెట్టడం మాత్రం చాలా కష్టమైన పని. ఆ పరీక్షలో తడబడిన సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. బయటకు ఇది పవన్ కళ్యాణ్ ఎనర్జీ, మాస్ డైలాగ్స్, విన్టేజ్ రిఫరెన్స్‌లతో నిండిన ఫుల్ కమర్షియల్ ప్యాకేజ్‌లా కనిపిస్తుంది. కానీ లోపలికి వెళ్తే ఇది ఒక క్లియర్ గా పవన్ కళ్యాణ్ కోసమే, ఆయన అభిమానుల కోసమే రాసిన, తీసిన స్క్రిప్ట్‌లా అనిపిస్తుంది.


ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి ఇది తమిళ హిట్ Theri రీమేక్ అవుతుందా అనే చర్చ సాగింది. ఫైనల్‌గా చూస్తే ఇది రీమేక్ కాదు. కానీ అదే సమయంలో ఇది పూర్తిగా ఒరిజినల్ అనిపించదు కూడా. కథ, సన్నివేశాల నిర్మాణం, పాత్రల బిహేవియర్.. ఇవన్నీ కలిసి ఒక పరిచితమైన అనుభూతిని కలిగిస్తాయి. ఇది ఓ రకంగా కొత్త కథ చెప్పాలనే ప్రయత్నం కంటే, ఇప్పటికే పనిచేసిన ఫార్ములాను మళ్లీ కూర్చిన వైనంగా ఉంటుంది.

స్క్రీన్‌ప్లే పరంగా ఈ సినిమా మొదటి గంటలోనే తన సమస్యలను బయటపెడుతుంది. సాధారణంగా ఒక కమర్షియల్ సినిమా మొదటి భాగం ప్రేక్షకుడిని కథలోకి లాగాలి. కానీ ఇక్కడ సెటప్ బలహీనంగా ఉండటం, కామెడీ పాతగా అనిపించడం, ముఖ్యంగా కథతో సంబంధం లేకుండా వచ్చిన డాన్స్ ఎపిసోడ్ వంటివన్నీ కలిసి తెరపై మోమెంటమ్‌ను తగ్గిస్తాయి. కథ ముందుకు వెళ్లాల్సిన సమయంలో అది నిలిచిపోయిన భావన కలుగుతుంది. ఫలితంగా, ప్రేక్షకుడికి కథతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడడానికి ఆలస్యం అవుతుంది.

ఇక ఇదే దర్శకుడు చేసిన Gabbar Singh లో పవన్ కళ్యాణ్ పాత్ర కొత్తగా, ప్రత్యేకంగా కనిపించింది. అదే సినిమాను నిలబెట్టిన ప్రధాన కారణం. కానీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో మాత్రం హీరో క్యారెక్టర్ పూర్తిగా పవన్ కళ్యాణ్ నిజ జీవిత ఇమేజ్‌కు దగ్గరగా ఉంటుంది. ఆయన రాజకీయ భావాలు, సామాజంపై ఆలోచనలు, ఇవి కథలో భాగమవ్వడం కంటే, ఒక ఇమేజ్ ప్రెజెంటేషన్‌లా అనిపిస్తాయి. దానికి తోడు విన్టేజ్ పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసేలా పాత సినిమాల రిఫరెన్స్‌లను వరుసగా ఉపయోగించడం వల్ల, కొత్తదనం తగ్గిపోయింది. అఫ్ కోర్స్ అవి అభిమానులకు ఆనందం కలిగించి ఉండవచ్చు. కానీ సగటు ప్రేక్షకుడికి కొత్త అనుభూతి ఇవ్వడం కంటే, పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

అలాగని సినిమా ఎక్కడా పూర్తిగా పడిపోదు. సెకండాఫ్ లో మూడు కీలకమైన ఎపిసోడ్లు కథను నిలబెడతాయి. పాతబస్తీ బ్లాక్, పోలీస్ స్టేషన్ సన్నివేశం, విలన్ కొడుకు ఎపిసోడ్ — ఈ మూడు చోట్ల స్క్రీన్‌ప్లే తన అసలు పవర్ ని చూపిస్తుంది. ఈ సన్నివేశాల్లో స్పష్టమైన కాన్ఫ్లిక్ట్, ఎమోషనల్ స్టేక్స్, పేఆఫ్ కనిపిస్తాయి. ఇక్కడే కథ నిజంగా ఎంగేజ్ చేస్తుంది. అంటే, సినిమా పూర్తిగా బలహీనమైంది కాదు — కానీ అది మొత్తంగా అదే స్థాయిని నిలబెట్టలేకపోయింది.

డైలాగ్స్, మిగతా టెక్నికల్ ఎలిమెంట్స్

అదే సమయంలో డైలాగ్స్ ఈ సినిమాకు ఒక పెద్ద బలం. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ క్యారెక్టర్‌కు బలాన్ని ఇస్తాయి, కొన్ని చోట్ల కథను కూడా ముందుకు నడిపిస్తాయి. అలాగే, కొత్త పాటను జోడించకుండా Tholi Prema లోని ‘నీ మనసే’ పాటను ఉపయోగించడం ఒక తెలివైన నిర్ణయం. ఇది కథను ఆపకుండా, ఎమోషన్‌ను పెంచింది. అయితే, కొన్ని సన్నివేశాలు జూ.ఎన్టీఆర్ Temper ను గుర్తు చేసేలా ఉండటం వల్ల, ప్రేక్షకుడికి ఇప్పటికే చూసిన అనుభూతి మరింత బలపడుతుంది. అదే టోన్, అదే రకం ఎగ్జిక్యూషన్ — ఇవి కొత్తదనాన్ని తగ్గించాయి.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒకప్పటి గబ్బర్ సింగ్ లెవల్‌లో లేదు. ఆ అంచనాలను అందుకోవడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. అయితే, ఒకటి రెండు పాటలు మాత్రం తెరపై చూడ్డానికి బాగున్నాయి. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న 'లౌడ్ టెక్నో' టెంప్లేట్‌లోనే సాగింది.

సినిమాటోగ్రఫీ & ఎడిటింగ్: విజువల్స్ పర్వాలేదు అన్నట్లున్నా, కొన్ని కీలక సన్నివేశాల్లో జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. ఎడిటింగ్ కూడా జస్ట్ ఓకే అనిపించేలా ఉంది.

పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..ఆయన ఎప్పుడూ తెరపై నిరాశపరచరు. ఈ సారి కూడా వింటేజ్ మెరుపులు మెరిపించారు. రాశీఖ‌న్నా, శ్రీ‌లీల జస్ట్ ఓకే అనిపిస్తారు. పార్దీబ‌న్ కొత్తగా అనిపించారు. రావు ర‌మేష్ గురించి పెద్దగా మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. కె.ఎస్‌.ర‌వికుమార్‌, గౌత‌మి మెయిన్ లీడ్ తో సమానంగా కనిపించారు.

ఫైనల్ థాట్:

ఓవరాల్ గా చూస్తే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక క్లాసిక్ స్టార్-డ్రివెన్ కమర్షియల్ ఎంటర్‌టైనర్. ఇందులో మాస్ మూమెంట్స్ ఉన్నాయి, అభిమానులకు నచ్చే ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే, ఇది ఒక మిస్ అయిన అవకాశం. మంచి బ్లాక్స్ ఉన్నా, వాటిని కలిపే బలమైన కథ లేకపోవడం వల్ల సినిమా పూర్తిగా ఎలివేట్ కాలేదు. చివరికి, ఈ సినిమా ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది — మాస్ మూమెంట్స్ సినిమా హిట్ చేయవచ్చు… కానీ కథ లేకపోతే అది గుర్తుండిపోదు.

Read More
Next Story