VAAZHA :పేరెంటింగ్ షాక్
x

VAAZHA :పేరెంటింగ్ షాక్

కొత్త మానవ యుగంలో విరిగిన గొలుసుకట్టు ఆరంభం



-రామ్ సి

మీ పిల్లలు చదవడం లేదా, చదువు నెత్తికెక్కించుకొనే పరిస్థితిలో లేరా, ఏకాగ్రత కోల్పోయారా, చదువు కన్నా వేరే వాటికీ అలవాటుపడ్డారా,మీరు చెప్పినట్టే చదివి, అమెరికా, యూరోప్ వెళ్లి బాగా సంపాదిస్తూ, మీరు చూపిన ,లేక వారకి నచ్సిన పిల్లనో, పిల్లాడ్నో ఘనంగా ఖర్చుపెట్టి చేసిన పెళ్లి పెటాకులయ్యిందా,ఏ చదువు అబ్బక, ఈ ఏ పని చెయ్యక ఇంట్లో మీ మీద బతికేస్తున్నారా, వాళ్లు పెళ్లంటే ఇష్టంలేక సహజీవనం చేస్తున్నారా , పిల్లలు వద్దనుకొంటున్నారా, సమాజం పేరుతొ కుటుంబాల్లో, మీ జీవితాల్లో ఈ విషయాలు గగ్గోలు పెడుతున్నాయా ...... ఏమిటి ఇలా సాగుతోందని భవిస్తున్నారా, ఈ సమస్యకు మార్గం అన్వేషిస్తున్నారా, ఈ సినిమాలో ఓ సూక్ష్మ సూచన ఉందని మాత్రమే చెప్పగలుగుతాను.

ఈ కొత్త వాస్తవం మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇది మీ అంగీకారం కోసం ఎదురు చూడదు. కరోనా మహమ్మారి అనంతరం, పిల్లలు, తల్లిదండ్రుల ప్రవర్తనలో మార్పులను నేను గమనిస్తున్నాను, ఎందుకంటే వారి జీవితం 24-గంటల స్క్రీన్ జీవితంగా మారిపోయింది. రెండు మూడు సంవత్సరాలలో, ఈ మార్పు ప్రధాన జీవన ప్రవాహంలోకి మారిపోయింది.మీరు సిద్ధంగా ఉన్నా లేకపోయినా, దానికి అలవాటు పడాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పింది. తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం పాత్రల్లో సునామీ వలె వచ్చిన ఈ మార్పు మనం చూస్తున్నాం, ఇది మనందరి దృష్టిని ఆకర్షించాల్సిన అంశం.

మలయాళ చిత్రం VAAZHA ఈ మార్పును వినోదం ముసుగేసుకుని అద్భుతంగా చూపిస్తుంది. చిత్రంలో ప్రధాన పాత్రధారులందరు సమాజపు సాంప్రదాయ నియమాలు, అంచనాల నుండి బయటపడి జీవించాలనుకొంటుంటారు, లేక ఆ వ్యవస్థకు తగ్గట్టుగా మరి జీవితాన్ని సాగిస్తుంటారు. ఇది ఈరోజు పిల్లల జీవితాలలో మనం చూస్తున్న నిజమైన ప్రతిబింబం – వారు తల్లిదండ్రులు పెట్టిన బాధ్యతలు, ఒత్తిళ్ల నుండి ముక్తి పొందుతున్నారు. గత తరాల నుండి ఇది పెద్ద తేడా – అప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమి చేయాలో, ఎవరు కావాలో చెప్పేవారు. ఇప్పుడు, ఆ అధికార గొలుసు విరిగిపోయింది.

గతంలో, తల్లిదండ్రులు పిల్లల జీవితాలను విద్య, ఉద్యోగం, కుటుంబం వంటి లక్ష్యాలకు దారితీసేలా తీర్చిదిద్దేవారు. కానీ ఇప్పుడు, పిల్లలు తమ జీవితాలను స్వతంత్రంగా తీర్చిదిద్దుకుంటున్నారు, సంప్రదాయ కుటుంబ పాత్రల అడ్డంకులు లేకుండా. వాజా ఈ విషయాన్ని అద్భుతంగా చూపిస్తుంది, కథానాయకుల జీవితాలు సామాజిక అంచనాల బరువులేకుండా ఎలా సాగుతాయో, వారి సహజ స్వభావం ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారో చూపిస్తుంది. తల్లిదండ్రులు దీనికి సిద్ధంగా ఉన్నా లేకపోయినా, ఈ మార్పు జరుగుతోంది.

ఈ విరిగిన గొలుసుకట్టు తల్లిదండ్రుల కోసం కాస్త భయం, కాస్త విముక్తిని తీసుకువస్తుంది. గతంలో "చెప్పడం" ద్వారా పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన విధానం ఇప్పుడు "విడిచి" వాళ్లకు తెలిసేలా చేయడం వైపు మారిపోయింది. ఈ మార్పు తల్లిదండ్రులకు చాలా విచిత్రంగా అనిపించవచ్చు – వారు తమ పిల్లలు తాము పెరిగిన పద్ధతిలో కాకుండా, స్వేచ్ఛతో జీవిస్తుండటాన్ని చూడటం, దీనికి సంబంధించిన అవకాశాలు, సవాళ్లను చూస్తూ బుర్ర గోక్కోవడం చాల సహజమైన స్థితి.

ఈ కొత్త విధానంలో అడుగుపెట్టినప్పుడు, తల్లిదండ్రులు, కుటుంబం, సమాజం అన్ని సమతుల్యం పాటించాలి. ఈ విరిగిన గొలుసుకట్టు పిల్లలకు మార్గనిర్దేశం చేయడంలో తల్లిదండ్రులు ఇంకా ఒక పాత్ర పోషించవచ్చు. ఎమోషనల్ ఇంటలిజెన్స్, అనుకూలత, అవగాహన ఈ కొత్త యుగంలో జీవించడానికి కీలకాలు అవుతున్నాయి. పిల్లలు ఇప్పుడు మీ ఆలోచనకు పెద్దగా విలువ ఇవ్వరు. మీరు చెప్పినవి పాటించినా కూడా, త్వరలోనే వారు వాటిని విస్మరిస్తారు. సమాజం వేగంగా మారిపోతోంది, కొత్త యుగం ఇప్పటికే మన ముందుకు వచ్చింది – దాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం ఇది.

ఆ సూక్ష్మ సూచన ఏమనుకుంటున్నారా; మీరేనండి.



Read More
Next Story