‘వీరాంజనేయులు విహారయాత్ర’ఓటిటి మూవీ రివ్యూ
x

‘వీరాంజనేయులు విహారయాత్ర’ఓటిటి మూవీ రివ్యూ

తెలుగులో రోడ్ ట్రిప్ ఫిల్మ్ లు అతి తక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అయితే అసలు లేవనే చెప్పాలి.


తెలుగులో రోడ్ ట్రిప్ ఫిల్మ్ లు అతి తక్కువ. ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో అయితే అసలు లేవనే చెప్పాలి. ఈటీవి విన్ లో థియేటర్ రిలీజ్ లేకుండా డైరక్ట్ గా రిలీజైన ఈ సినిమా ఫన్ ఎంటర్టైనర్ గా ప్రమోట్ చేసారు. నరేష్, బ్రహ్మానందం వంటివారు ఉండటంతో ఇది కామెడీ ఫిల్మ్ అనే చాలా మంది అనుకున్నారు. కామెడీ సినిమా కాబట్టి ఖచ్చితంగా చూడాలనుకున్నారు. నిజంగానే ఈ సినిమా కామెడీనా, ప్యామిలీతో చూడదగ్గదేనా, కథేంటి వంటి విషయాలు చూద్దాం.

స్టోరీ లైన్

వీరాంజనేయులు(బ్రహ్మానందం) గోవాలో తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో హ్యాపీ హోమ్ అనే ఇల్లు కట్టుకుంటాడు. ప్రతీ సంవత్సరం ఆ ఇంటికి తన ఫ్యామిలీతో వెళ్లి వస్తూంటాడు. దాంతో ఆ ఇంటితో ఫ్యామిలీలో ప్రతీ ఒక్కరికీ అనుబంధం ఉంటుంది. ఈ లోగా వీరాంజనేయులు స్వర్గస్ధులు అవుతాడు. ఆర్దిక ఇబ్బందులతో ఆయన అస్దికలను పుణ్య నదుల్లో కలపకుండా అలాగే ఇంట్లో ఉంచుకుంటారు. మరో ప్రక్క స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తున్న వీరాంజనేయులు కొడుకు నాగేశ్వరరావు(నరేష్) ని ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని యాజమాన్యం బై చెప్పేస్తుంది.

ఇక వీరాంజనేయులు మనవడు వీరు (రాగ్ మ‌యూర్‌) ఓ గేమ్ డెవలపర్. అతను సొంతంగా డబ్బు ఖర్చు పెట్టి గేమింగ్ బిజినెస్ పెట్టి లాస్ అవుతాడు. మరో ప్రక్క వీరాంజనేయులు మనవరావు స‌రయు (ప్రియా వ‌డ్లమాని) ఓ కుర్రాడిని ప్రేమిస్తుంది. వాళ్లు పెళ్లి గ్రాండ్ గా చేయమని కుర్రాడి తరపు వాళ్లు కండీషన్ పెడతాడు. అందుకు డబ్బై లక్షలు దాకా కావాలి. దాంతో భాధ్యత మోస్తున్న నాగేశ్వరరావుకు ఏం చేయాలో తోచదు. ఈ లోగా ఓ ఆఫర్ వస్తుంది. గోవాలో ఉన్న హ్యాపీ హోమ్ కు అరవై లక్షలకు బేరం వస్తుంది. ఆ ఇంటిని అమ్మేసి తన కష్టాల నుంచి బయిటపడాలనుకుంటాడు నాగేశ్వరరావు. అయితే ఆ విషయం ఇంట్లో చెప్తే ఎవరూ ఒప్పుకోరు. ముఖ్యంగా తల్లి (శ్రీలక్ష్మి) అసలు ఒప్పుకోదు. ఆమెకు తన భర్త కట్టిన ఆ ఇంటిపై చాలా మమకారం ఉంటుంది.

వీళ్లకు తెలియకుండా అమ్మేయటానికి కదరదు. ఎందుకంటే వీరాంజనేయులు ఆ ఇంటిని వీళ్లందరి పేరనా రాసి ఉంటాడు. అందరూ సంతకం పెడితేనే ఇల్లు అమ్ముడవుతుంది. దాంతో వీళ్లందరినీ అసలు విషయం తెలియకుండా గోవాకు తీసుకెళ్లటానికి ప్లాన్ చేస్తాడు నాగేశ్వరరావు. తన తండ్రి వీరాంజ‌నేయులు అస్థికలు గోవా బీచ్ లో కలపాలని చెప్పి నాగేశ్వరరావు ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని కారులో గోవాకు ప‌య‌న‌మ‌వుతాడు. ఈ జర్నీలో ఏం జరిగింది? నాగేశ్వరరావు కుటుంబంలోని మిగతా సభ్యులకు ఎప్పుడు నిజం తెలిసింది? సరయు పెళ్లి జరిగిందా? చివరకు ఆ ఇల్లు అమ్మేసారా లేదా అనేది మిగతా కథ.

విశ్లేషణ

చిన్న సినిమా అయినా పెద్ద స్టార్స్ లేకపోయినా ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదంటే అందుకు కారణం ఫెరఫెక్ట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమా స్క్రిప్టు రాసుకోవటమే. అలాగే కేవలం కామెడీనే నమ్ముకోకుండా ఎమోషన్ నిసైతం ఈ సినిమాలో హైలెట్ చేసారు. ఫ్యామిలీలో ఒక్కక్కరిని సీక్రెట్స్ ని మెల్లిమెల్లిగా రివీల్ చేసిన విధానం కథను ముందుకు తీసుకెళ్లటానికి సహకరించింది. ప్రిమైజ్ బాగా సెట్ చేసినా పేసింగ్ మాత్రం అక్కడక్కడా తడబడింది. ముఖ్యంగా సెక్ండాఫ్ లో సినిమాని ఎలాగోలా ముగింపుకు తీసుకొచ్చేయాలనే తాపత్రయం కనపడింది. దాంతో ఫస్టాఫ్ వెళ్లినంత నాచురల్ గా సెంకడాఫ్ లో సీన్స్ కనపడవు. అలాగే కామెడీ మరింత ఉండచ్చు. సెకండాఫ్ లో వచ్చే హర్షవర్దన్ డాక్టర్ సీన్స్ లోనే పగలబడి నవ్వుతాం. మిగతా ఫన్ సోసోగా ఉంటుంది. ఎమోషన్స్ పై ఎక్కువ కాన్సర్టేట్ చేసారు. తండ్రి, కొడుకు, తల్లి కొడుకు, ఇంటితో అనుబంధం ఇలా ఎమోషన్స్ ని బాగా భారీగానే వర్కవుట్ చేసారు. కొన్ని గుర్తుండిపోయే సన్నివేశాలు కూడా క్రియేట్ చేసారు. తన కొడుకు కొబ్బరి బొండానికి డబ్బులు ఇస్తున్నా...మురిసిపోయే తండ్రి, తల్లిని తిట్టే మనవడుని మందలించే నాయనమ్మ, ఇంట్లో వాళ్లకు కష్టాలు తెలియకుండా బండి లాగేయాలనుకునే తండ్రి ఇలా అందరూ గుర్తుండిపోతారు. ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఉండే కష్టాలు, ఆడపిల్ల పెళ్లి ఫిక్స్ అయితే పడే కంగారు, ఓ సొంత ఇల్లుని అమ్మేయాలంటే వచ్చే బాధ వంటివి మనందరం రిలేట్ అయ్యే అంశాలు. క్లైమాక్స్ లో మెసేజ్ బాగున్నా, రొమాంటిక్ ఏంగిల్ మాత్రం బాగోలేదు.

టెక్నికల్ గా చూస్తే...

దర్శకుడు అనురాగ్ కొత్తవాడైనా ఎక్కడా తడబాటు లేకుండా ఎమోషన్స్ బాగా డీల్ చేసాడు. ఎందుకంటే చాలా మంది డైరక్టర్స్ తడబడేది ఈ ప్లేస్ లోనే. అలాగే నటీనటుల నుంచి ఎంతవరకూ ఏం కావాలో అదే తీసుకున్నాడు. కొంచెం కూడ ఎగస్ట్రా చేయించలేదు. అలాగే స్క్రిప్టు కూడా బాగా రాసుకున్నాడు. కాస్త కామెడీ డోస్ పెంచిందే వాళ్లు కామెడీ అన్నట్లు చేసిన ప్రమోషన్ అర్దంవంతగా ఉందనిపించేది. అలాగే ఈ సినిమా కు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా కలిసొచ్చాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

నటీనటుల్లో ...

సీనియర్ నటుడు నరేష్, బ్రహ్మానందం ల గురించి చెప్పేందుకు ఏమి లేదు. బ్రహ్మానందం కనపడేది కొన్ని క్షణాలే అయినా గుర్తుండిపోతాడు. నరేష్ భార్య పాత్రలో ప్రియదర్శిని...నరేష్ కు పోటీ ఇచ్చిందనలేం కానీ బాగా చేసింది. సినిమా బండి రాగ్ మయూర్ సినిమాకి కీలకమై నిలిచాడు. కొన్ని సీన్స్ లో జీవించాడనే చెప్పాలి. బామ్మ పాత్రలో శ్రీలక్ష్మి కూడా కామెడీతో, ఎమోషన్ ఎప్పటిలాగే బాగా పండించారు. ప్రియా వడ్లమాని , రవి మహాదాస్యం, తరుణ.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో బాగా నటించారు.

చూడచ్చా

ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా. చూస్తున్నప్పుడు మన పాత్రలు కూడా సినిమాలో కనపడతాయి.

ఎక్కడ చూడవచ్చు

ఈటీవి విన్ లో తెలుగులో ఉంది.

Read More
Next Story