‘విద్య వాసుల అహం’ ఓటీటీ మూవీ రివ్యూ
x

‘విద్య వాసుల అహం’ ఓటీటీ మూవీ రివ్యూ

పెళ్ళైన ఈ జనరేషన్ కొత్త జంట ఎలా ఉంటుంది అని పర్ఫెక్ట్‌గా చూపించబోతున్నారనే ఇంట్రస్ట్ కలిగించిన సినిమా ‘విద్య వాసుల అహం’. ఈ సినిమా ఎలా ఉంది. చూడదగినదేనా?


ఈ మధ్య కాలంలో రొమాంటిక్ కామెడీ లు చాలా తక్కువగా వస్తున్నాయి. దాంతో ‘విద్య వాసుల అహం’ ట్రైలర్ చూడగానే ఏదో సిన్సియర్ అటెమ్ట్‌లా అనిపించి ఒక మంచి రామ్ కామ్ సినిమా చూడవచ్చు అనే ఆశ పుట్టించింది. పెళ్ళైన ఈ జనరేషన్ కొత్త జంట ఎలా ఉంటుంది అని పర్ఫెక్ట్‌గా చూపించబోతున్నారనే ఇంట్రస్ట్ కలిగించిన ఈ సినిమా ఎలా ఉంది. చూడదగినదేనా?

కథేంటి

టైటిల్‌లో చెప్పినట్లు వైజాగ్‌లో జరిగే ఈ కథ విద్య (శివాని రాజశేఖర్) అనే అమ్మాయి, వాసు (రాహుల్ విజయ్) అనే కుర్రాడి మధ్య వచ్చే ఇగో సమస్యలతో జరుగుతుంది. విద్యకు వివాహం విషయంలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. అవి పెళ్లి, నిశ్చితార్థంకు ముందే తేల్చుకోవాలనుకునే రకం. అందుకోసం ఆమె ఓ క్వశ్చన్ పేపర్ రెడీ చేసి, తనను చేసుకునేవాళ్ళు దాన్ని పూర్తి చేసి ఒప్పిస్తేనే ఓకే అంటుంది. ఎలాగూ ఆడపిల్లలు తక్కువై మగ పిల్లలకు పెళ్లిళ్లు కావటం లేదనే విషయం ఆమెకు తెలిసినట్లుంది.

ఇక వాసు (రాహుల్ విజయ్) కూడా ఓ మిడిల్ క్లాస్ మెలోడీనే. మెకానికల్ ఇంజనీర్‌గా జాబ్ చేసే అతనికి కూడా ఇంట్లోవాళ్లు సంబంధాలు చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఆమె క్వచ్చినీర్‌ని అతను పూర్తి చేయటం, ఆమెకు నచ్చేయటంతో ఇద్దరికీ పెళ్లి అవుతుంది. ఇద్దరూ చక్కగా వేరే కాపురం పెడతారు. ఆమెకు ఓ కంపెనీలో జాబ్ వస్తుంది. దాంతో హానీమూన్‌కు వెళ్లలేని పరిస్థితి. అది వాసుని కొద్దిగా బాధిస్తుంది. అయితే విద్యకు ఉన్న ఇగో వల్ల వాసు కొద్దిగా ఇబ్బంది పడుతూంటాడు. విద్య కూడా అంతే. అతని ఇగో వలన ఇబ్బంది పెడుతూంటుంది. (ఇలా అన్నానని ఎక్కువ ఊహించుకోకండి అయితే అక్కడ అంత ఏమీ ఉండదు. చిన్న చిన్న విషయాలు)

ఈలోగా వాసు తనకి బాస్ తక్కువ ఇంక్రిమెంట్ ఇచ్చాడని కోపంతో తన ఉద్యోగానికి రిజైన్ చేసేస్తాడు. కానీ ఈ విషయం భార్యకి చెప్తే నామోషి అనుకుని చెప్పడు. ఈ క్రమంలో ఇంట్లో ఖర్చులకు భార్యను డబ్బులు అడగాలంటే అహం. ఇంట్లోనే ఎప్పుడూ ఉండటం, సీరియల్స్ చూస్తూండటంతో ఆమెకు ఆశ్చర్యం. చివరకు నిజం తెలియటంతో అతి ఇద్దరి మధ్య మళ్లీ అగ్గి రాజేస్తుంది. ఈలోగా ఇద్దరి తల్లిదండ్రులు తమ పిల్లల కొత్త కాపురం చూద్దామని రావటం. వాళ్లకు ఈ విషయం తెలియడం. అప్పుడు ఏం జరిగింది అనేది పెద్ద సస్పెన్స్ ఏమీ కాదు కానీ ఊహించలేకపోతే సినిమా చూడండి.

ఎలా ఉంది

కొన్ని సినిమాలు చూస్తూంటే అసలు వాళ్లు ఏమి అనుకుని తీశారో అనే సందేహం వస్తూంటుంది. ఎందుకంటే అందులో కథ కూడా సినిమా చూశాక ఇదీ అని చెప్పలేము. ఈ సినిమా కూడా ఆ కోవలోదే. రొమాంటిక్ కామెడీ జానర్‌లో తెరకెక్కించామనుకున్నారు. అందుకు బాపు మిస్టర్ పెళ్లాం సినిమా సాయం తీసుకున్నారు. అందులో లాగా విష్షుమూర్తి, లక్ష్మి దేవి సీన్‌పై సినిమా ఓపెన్ చేశారు. అంతవరకే ఆ సినిమాను ఆధారం చేసుకున్నారు. పోనీ ఈ కాలానికి మార్చి రీమేక్ చేసినా సరిపోయేది. ఆ సినిమాలో ఉన్న కాంప్లెక్సిటీని, మెసేజ్‌ని అసలు పట్టించుకోలేదు. సినిమాలో ‘ఇగో’ల గోల ఎక్కువైపోయింది. అదీ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. షార్ట్ ఫిల్మ్‌కు సరపడ కంటెంట్ అలాగే తీశారు.

ఈ సినిమాలో కథ అనే పదార్థం మరీ వెంట్రుక వాసి కన్నా తక్కువగా ఉంటుంది. పోనీ కథ లేదు అండీ కథనంతో నడిచే సినిమా అని చెప్పటానికి లేదు. ఎందుకంటే అంత స్క్రీన్ ప్లే ఈ సినిమాకు లేదు. కథ ప్రారంభమై గంటయినా ఎక్కడ మొదలైందో అక్కడే గానిగెద్దులా తిరుగుతూంటుంది. అసలు ఎటు నుంచి ఎటు వెళ్తుందో అని ఎంత గెస్ చేయడానికి ట్రై చేసినా అర్థం కాదు. పోనీ ఇంతా చేసి క్లైమాక్స్‌లో ఏమన్నా బాంబు లాంటి ట్విస్ట్ పేలుస్తాడేమో అని ఆశ పడితే అదీ ఉండదు. పరమ పేలవమైన క్లైమాక్స్. ఎమోషన్ గురించి అయితే మాట్లాడనక్కర్లేదు. ఉన్నంతలో ఈ సినిమాలో చెప్పుకోదగినది ఏదైనా ఉందా అంటే అది కేవలం డైలాగుల పార్ట్ మాత్రమే. అవీ గొప్పవని కాదు కానీ ఏమీ లేనప్పుడు ఆముదం చెట్టే మహా వృక్షం అన్నట్లు.. సినిమాలో ఏమీ లేనప్పుడు చిన్నది ఏ మాత్రం బాగున్నా హమ్మయ్య.. అద్బుతం దొరికింది అనే ఫీల్ వస్తుంది. అదేనన్న మాట.

చిన్న సినిమాలకు కూడా మంచి కథ, కథనం అల్లుకోవచ్చు అనే ఆలోచన ఎందుకు రావడం లేదా అనిపిస్తుంది. లక్కీగా ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అయ్యింది. థియేటర్‌లో రిలీజైతే పరస్థితి ఏమిటి.. అసలు ఏమి చూస్తున్నారో అర్థం కాక సెల్ ఫోన్స్ చూసుకుంటూ కాలక్షేపం చేద్దురు. క్లాస్‌గా ఏదో ఫీల్‌తో తీద్దామని ప్రయత్నం చేసినట్లున్న ఈ సినిమా చూసేవాళ్లకి ఎందుకు చూసాము.. ఏం చూసాము అనే ఫీల్ కలిగిస్తుంది. ఈ సినిమాకు ఉన్న ఏకైక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే కుటుంబంతో కలిసి చూడొచ్చు. అసభ్య పదజాలం, హింసను ప్రేరేపించే సన్నివేశాలు లేవు.

ఎవరెలా చేశారు

ఈ జనరేషన్ విద్య పాత్రలో శివాని ఒదిగిపోయింది. సరైన సినిమా పడితే కెరీర్ టర్న్ అవుతుంది. కళ్లతో హావభావాలు పలికించగల సత్తా ఉంది. వాసు క్యారెక్టర్‌కు రాహుల్‌ విజయ్‌ జస్ట్ ఓకే. అయితే అతనిలో మంచి ఈజ్ ఉంది. ఇక విష్ణువుగా అవసరాల శ్రీనివాస్‌‌ని చూడలేకపోయాము. లక్ష్మీదేవిగా అభినయ బాగుంది. నారదుడిగా శ్రీనివాసరెడ్డి.. మీసాలతో డిఫరెంట్‌గా ఉన్నాడు.

టెక్నికల్‌గా ఎలా ఉందంటే... కల్యాణి మాలిక్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు సోసోగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లోనూ చేయటానికి ఏమీ లేదు.. మణికాంత్‌ గెల్లి మేకింగ్ లో క్లాస్ సినిమా తీయాలనే ఉత్సాహం కనపడింది. ప్రొడక్షన్ వాల్యూస్ పెద్దగా ఖర్చుపెట్టలేదని తెలుస్తోంది. జస్ట్ ఓకే (Vidya Vasula Aham Review).

చూడచ్చా

ఇంత చెప్పాక కూడా చూస్తాను, బాగా ఖాళీగా ఉన్నాను అని ఆవేశపడితే అది మీ ఇష్టం.

ఎక్కడుంది

ఆహాలో(Aha) ఓటిటిలో తెలుగులో ఉంది.

Read More
Next Story