జననాయకన్ పైరసి నష్టం 60 కోట్లా?
x

'జననాయకన్' పైరసి నష్టం 60 కోట్లా?

ప్రైమ్ వీడియో 'నిర్దాక్షిణ్య' వ్యూహం!


సినిమా అంటే ఒకప్పుడు కేవలం వెండితెరపై వచ్చే మ్యాజిక్. కానీ ఇప్పుడు సినిమా అంటే ఒక భారీ బిజినెస్ నెట్‌వర్క్. ముఖ్యంగా దళపతి విజయ్ చివరి సినిమా 'జననాయకన్' విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, బాక్సాఫీస్ వసూళ్ల కంటే ఓటీటీ డీల్స్ సినిమా మనుగడను ఎలా శాసిస్తున్నాయో అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమాకు చెందిన ₹90 కోట్ల భారీ డీల్ కాస్తా ₹32 కోట్లకు పడిపోయిందన్న వార్త వెనుక ఉన్న 'కార్పొరేట్ లాజిక్' సామాన్య ప్రేక్షకులకు షాక్ ఇస్తోంది.

పైరసీ లీక్: ఓటీటీ దిగ్గజాలకు దొరికిన అతిపెద్ద అస్త్రం!

సాధారణంగా ఏ ఓటీటీ సంస్థ అయినా ఒక సినిమాకు భారీ మొత్తం ఇస్తోంది అంటే, దానికి కారణం 'ఎక్స్‌క్లూజివిటీ'. అంటే ఆ సినిమా కేవలం తమ ప్లాట్‌ఫారమ్ మీద మాత్రమే హై-క్వాలిటీలో ఉండాలి. కానీ 'జననాయకన్' హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ అవ్వడం అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థలకు పెద్ద దెబ్బ. సినిమా థియేటర్లలోకి రాకముందే ఫ్రీగా అందుబాటులోకి వస్తే, ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్లు పెరగవని వారు భావిస్తారు. ఈ 'వ్యూయర్ షిప్ లాస్'ను సాకుగా చూపి, అగ్రిమెంట్‌లో ఉన్న క్లాజుల ప్రకారం రేటును భారీగా తగ్గించే అధికారం వారికి ఉంటుంది. అందుకే 90 కోట్లు కాస్తా 32 కోట్లకు పడిపోయిందని తమిళ సినీ వర్గాలు అంటున్నాయి.

లీకైన ఫుల్ మూవీ.. ఆవిరైన 'లియో' రికార్డుల ఆశలు!

హెచ్.వినోద్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను 'లియో' రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయని అందరూ ఊహించారు. కానీ, సినిమా వాయిదా పడటం వల్ల పెరిగిన వడ్డీలు ఒకెత్తు అయితే, థియేటర్ లోకి రాకముందే నెట్టింట లీక్ అవ్వడం నిర్మాతలను ఆత్మరక్షణలో పడేసింది. ఈ పైరసీ ఎఫెక్ట్ వల్ల సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ మొత్తం కుప్పకూలిపోయిందని, కనీసం 'లియో' వసూళ్లలో సగం సాధించడం కూడా ఇప్పుడు గగనమేనని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

రిస్క్ మేనేజ్‌మెంట్: ప్లాట్‌ఫారమ్స్ ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయి?

ఒకప్పుడు సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్న దాంతో సంబంధం లేకుండా డీల్స్ క్లోజ్ అయ్యేవి. కానీ ఇప్పుడు ఓటీటీలు 'డేటా'ను నమ్ముతున్నాయి.

సెన్సార్ ఆలస్యం:

సినిమా వాయిదా పడుతున్న కొద్దీ దానిపై ఉన్న హైప్ తగ్గుతుంది. డీల్ కుదిరినప్పుడు ఉన్న మార్కెట్ విలువ, ఆరు నెలల తర్వాత ఉండకపోవచ్చు. 'జననాయకన్' విషయంలో ఇది కూడా ఓ కారణం. సెన్సార్ ఆలస్యం కావడం వల్ల అమెజాన్ ఈ రిస్క్ మొత్తాన్ని నిర్మాతల పైకే నెట్టేసింది. సెన్సార్ లేటు అవ్వటం, రిలీజ్ డేట్ ఖరారు కాకపోవటం, అలాగే పైరసీ వల్ల ఆడియన్స్ కు సినిమా ఆసక్తి పోతుందని చెప్తూ, తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను కాపాడుకోవడానికి ఈ స్థాయిలో రేటు కోత విధించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రొడక్షన్ హౌస్‌లకు డేంజర్ బెల్స్.. విజయ్ నిర్ణయం ఏంటి?

ఈ పరిణామం కేవలం ఒక విజయ్ సినిమాకే పరిమితం కాదు. భవిష్యత్తులో ప్రతి భారీ బడ్జెట్ సినిమా ఓటీటీల కఠిన నిబంధనల మధ్యే రిలీజ్ కావాల్సి ఉంటుంది. కంటెంట్ లీక్ అయితే రేటు తగ్గిస్తాం అన్న నిబంధన నిర్మాతలకు ఉరితాడులా మారింది. ఓ సినిమాకు రిలీజ్ కు ముందే ₹58 కోట్ల మేర నష్టం వాటిల్లితే, ఆ భారాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ మోయడం అసాధ్యం.

విజయ్ పారితోషికం వెనక్కి ఇచ్చేస్తారా? నిర్మాతలను ఆదుకుంటారా?

సినిమా బిజినెస్ అంచనాలు తలకిందులు కావడంతో, ఇప్పుడు అందరి కళ్లు విజయ్ పైనే ఉన్నాయి. కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న ఈ ఊహించని నష్టాలను భర్తీ చేసేందుకు విజయ్ తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని వెనక్కి ఇస్తారా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. ఇది ఆయన చివరి సినిమా కావడంతో, నిర్మాతలకు నష్టం మిగల్చకుండా విజయ్ ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమోనని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా, ఒక మెగా స్టార్ ఫేర్ వెల్ మూవీకి ఇలాంటి పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం.

ప్రస్తుతానికి ఇవన్నీ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న కథనాలే అయినప్పటికీ, అధికారిక ప్రకటన వస్తే తప్ప అసలు వాస్తవం బయటపడదు. థియేటర్లలో ఈ 'జననాయకన్' తన సత్తా చాటి, ఈ నష్టాల నుండి గట్టెక్కుతాడో లేదో వేచి చూడాలి.

ఓటీటీలు ఇప్పుడు కేవలం కొనుగోలుదారులు కాదు, సినిమా నిర్మాణ వ్యయాన్ని, రిలీజ్ డేట్లను, చివరికి లాభనష్టాలను కూడా శాసించే 'నియంతలు'గా మారుతున్నాయి. 'జననాయకన్' బాక్సాఫీస్ వద్ద అద్భుతం సృష్టిస్తే తప్ప, ఈ ఓటీటీ దెబ్బ నుండి నిర్మాతలు కోలుకోవడం కష్టమే.

Read More
Next Story