'విందు భోజనం' తెలుగు ఓటీటీ మూవీ రివ్యూ
కూల్ ఫిల్మ్‌ని చూడబోతున్నామనే ఆసక్తిని కలిగిస్తున్న ‘విందు భోజనం’ నిజంగానే అంత బాగుందా... ఈ చిత్రం కథేంటి..
ఓటీటీ సంస్థ ఆహా ప్రతి వారం ఏదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఈ వారం ‘విందు భోజనం’ చిత్రాన్ని మన ముందుకు తెచ్చింది. అయితే ఈ చిత్రం రెండేళ్ల క్రితమే రిలీజైంది. ఇన్నాళ్లకు ఓటీటీలో జనాలకు అందుబాటులోకి వచ్చింది. టైటిల్, పోస్టర్ చూడగానే ఏదో కూల్ ఫిల్మ్‌ని చూడబోతున్నామనే ఆసక్తిని కలిగిస్తున్న ఈ సినిమా నిజంగానే అంత బాగుందా... ఈ చిత్రం కథేంటి...టైటిల్ విందు భోజనం అని పెట్టడానికి కారణం ఏమిటి అనేది చూద్దాం.
కథేంటి
ఇది చిన్న పాయింట్ చుట్టూ అల్లిన కథ. ఆనంద్ (సిద్ధార్థ్ గొల్లపూడి) సిటీలో పేరు మోసిన చెఫ్. అతను చిన్న వయస్సులోనే తండ్రితో కలిసి ‘విందు భోజనం’ అనే రెస్టారెంట్‌ను ప్రారంభిస్తాడు. అయితే కొద్ది రోజులకే తండ్రి హఠాన్మరణం చెందడంతో రెస్టారెంట్‌ని మొత్తం తనే భుజాన వేసుకుంటాడు. ఆ నిర్వహణని భారంగా ఫీలవకుండా సిటీలో నెంబర్ వన్ రెస్టారెంట్‌గా చేయాలని రాత్రింబవళ్లూ కష్టపడుతూంటాడు. అయితే అతనికి కుటుంబపరంగా సమస్య ఉంటుంది.
ఆనంద్‌కి తల్లి చనిపోగానే తండ్రి రెండో భార్య (అనితా చౌదరి)ని తెచ్చుకుంటాడు. వాళ్లకో కొడుకు వివేక్ (అభిషేక్ దొడ్డేపల్లి). వాళ్ల కుటుంబ నిర్వహణకు, ఏ ఇబ్బంది లేకుండా ఉండటానికి ప్రతి సంవత్సరం ఇంత మొత్తం అని ఓ చెక్ ఇస్తూంటాడు ఆనంద్. అంతకు మించి తన పిన్నితో కానీ వాళ్ల కొడుకుతో కానీ రిలేషన్ పెట్టుకోడు. అయితే వివేక్‌కు ఇక్కడే మండుతుంది. లెక్కప్రకారం రెస్టారెంట్‌లో తనకూ వాటా ఉన్నా ఎప్పుడూ తనని ఇన్వైట్ చేయటం లేదని ఫీలవుతూంటాడు. అది కోపంగా మారి ఆనంద్‌ని రోడ్డున పడేద్దామనుకుంటాడు.
దాంతో ప్రతి ఏడాది తమకు ఇచ్చే చెక్ ముష్టిలాంటిదని అది ఇక వద్దని, రెస్టారెంట్‌ని అమ్మేసి, తన వాటా డబ్బులు తనకివ్వమని గొడవకు దిగుతాడు. రెస్టారెంట్‌ను ప్రాణంగా భావించే ఆనంద్‌కు ఏం చేయాలో అర్దం కాదు. అలాంటివి ఏమీ వద్దని రిక్వెస్ట్ చేస్తాడు. అయినా నో అంటాడు. ఈ క్రమంలో ఆనంద్‌కు, వివేక్‌కు మధ్య ఓ ఛాలెంజ్ లాంటిది వస్తుంది. ఆ ఛాలెంజ్‌లో నెగ్గితే తను వాటా అడగనని వివేక్ అంటాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏమిటి… అలాగే ఈ కథలో షెఫ్ కావాలనే జీవితాశయం ఉన్న ఆదిత్య (అఖిల్ రాజ్) పాత్ర ఏమిటి... చివరకు ఏమైంది .. ఆనంద్ టీమ్ సక్సెస్ అయ్యిందా? ఈ విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
ఏ సినిమాకు అయినా ఒక కథ అనుకున్నపుడు అందులోని యూ.ఎస్.పి ఏమిటి? అనేదే ప్రధానమైన ప్రశ్న . ఆ క్రమంలో ఆ కథలో ఏ మేరకు విషయం ఉందనేది తెలిసిపోతుంది. నిజానికి ఈ కథను డైరక్టర్ నీట్‌గా డీల్ చేశారు. కానీ సినిమాకు సరిపడా కథ కాదు. ఓ షార్ట్ ఫిలింకు సరిపడే పాయింట్. కథగా అనుకున్న పాయింట్‌లోనో, చెప్పే విధానంలోనో ఏదో ఒక కొత్తదనం ఉండాలి అనుకున్నట్లు లేరు. కాంప్లిక్ట్స్‌లోకి కథ ప్రయాణించిన పదినిముషాల్లో ఎవరూ ఏ మాత్రం కష్టపడకుండానే సమస్య సాల్వ్ అయిపోతుంది. దాంతో ఈ సినిమా చూస్తునపుడు ఈ కథ యూ.ఎస్.పిని చెక్ చేసుకున్నట్లుగా అనిపించలేదు. ఈ కథలో అసలు సంఘర్షణ అనేది సరిగ్గా ఎస్టాబ్లిష్ కాలేదు. ఇద్దరి ఇగో అనేది ప్రధాన సంఘర్షణ. కానీ ఇక్కడ అదే తేలిపోయింది.
ఏదేమైనా ఒక చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ కథను అల్లి, దాదాపు రెండు గంటలపాటు వ్యూవర్స్‌ను కట్టిపడేయడం అంత సులభం కాదు! అని మరోసారి ప్రూవ్ అయ్యింది. అయితే మిడిల్ క్లాస్ మనుష్యులు, వారి ఇగోలు, పట్టింపులతో వచ్చే సమస్యలను చూపించిన తీరు బాగుంది. పాత్రలు డిజైన్ చేయడం బాగుంది. అయితే పనిగట్టుకుని మరీ చూసే సినిమా అయితే కాదు. కాలక్షేపానికి ఫ్యామిలితో సరదాగా కూర్చుని చూడచ్చు.
నటీనటుల్లో అఖిల్ రాజ్, ఐశ్వర్య జంట బాగుంది. సిద్దార్థ్ గొల్లపూడి నటన బాగుంది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను అభిషేక్ చాలా బాగా చేశారు. టెక్నికల్‌గా మీడియం సినిమాకు తగ్గ స్టాండర్డ్స్‌లో ఉన్నాయి అన్ని డిపార్టమెంట్స్. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే.
చూడచ్చా
టైటిల్‌కు తగినట్లు విందుభోజనం లాంటి సినిమా చూడాలనుకుంటే అయితే కష్టమనిపిస్తుంది. కానీ ఓకే కొత్త వాళ్ల ప్రయత్నం ఓ సారి చూద్దామనుకుంటే చూసేయచ్చు. పైత్యాలేమీ లేవు కాబట్టి ఫ్యామిలీతో చూడచ్చు.
ఏ ఓటిటిలో ...
ఆహా ఓటీటీలో (Aha OTT)తెలుగులో ఉంది.