
‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ
ఫస్ట్ హాఫ్ ఫన్… సెకండ్ హాఫ్ రన్
విష్ణు(శ్రీవిష్ణు) కు విపరీతమైన జాతకాల పిచ్చి (ఈ రోజుల్లోనా అని అడగొద్దు..ఇలాంటివాళ్లు చాలా మంది బయిట కూడా ఉంటారు). అతను ఒంగోలులోని ఒక జూనియర్ కాలేజీలో ట్రైనీ లెక్చరర్ . అయితే అతను ఇంకా పర్మినెంట్ కాలేదు. పర్మనెంట్ అవ్వాలంటే ఓ కండీషన్. అక్కడ అప్పటికే అక్కడ పనిచేస్తున్న లెక్చరర్స్‌లో ఎవరో ఒకరి దగ్గర అసిస్టెంట్‌గా కొన్నాళ్లు పనిచేయాలి. వాళ్లకు మనవాడి కేపబులిటీ నచ్చితే వాళ్లు కాలేజ్ హై కమాండ్‌కి రిఫర్ చేస్తారన్నమాట. దాంతో మన హీరో మొహమాటం లేకుండా సర్వవిధాలా ఎవరో ఒకళ్ల దగ్గర చేరాలని ట్రై చేస్తూంటాడు. అయితే ఎవరూ మనవాడిని ఇష్టపడరు.
కానీ ఓ లేడీ లెక్చరర్ మనీషా(నయన్‌సారిక) మాత్రం విష్ణుని తన దగ్గర అసెస్టెంట్ గా పనిచెయ్యటానికి సరే అంటుంది. మొదట ఆమె ప్రవర్తన నచ్చదు. కానీ కొద్ది రోజులకు ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత యధావిధిగా పెళ్లి దాకా వెళ్తుంది. అయితే అప్పుడే అతనికి మనీషా గురించి ఓ నిజం తెలుస్తుంది. అది..ఆమె జాతకంలో ఓ సమస్య ఉంది. ఆమెను పెళ్లి చేసుకున్నవాళ్లు ఆరు నెలల్లోపు పోతారని. వేరే వాళ్లు అయితే అవన్నీ జరిగినప్పుడు చూద్దాంలే అని లైట్ తీసుకోవచ్చు. కానీ జాతకాలని విపరీతంగా నమ్మే విష్ణు అప్పుడు ఏం చేస్తాడు.ఎలాంటి విన్యాసాలు చేస్తాడు.. చివరకు కథ ఎక్కడికి చేరింది, వంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చివరి దాకా చూసి తీరాల్సిందే.
ఎనాలసిస్ ...
Billy Wilder అనే గొప్ప డైరక్టర్ ఓ మాట చెప్తారు..“ప్రేక్షకులు లాజిక్ ని, లోపాలను క్షమిస్తారు… కానీ బోర్‌ను ఎప్పటికీ క్షమించరు.”
ఈ సినిమాలో డైరక్టర్ జనాలను అప్పటికప్పుడు ఆ క్షణానికి కాసేపు నవ్విస్తే చాలు అనుకున్నాడు. కానీ కథ,కథనం,సిట్యువేషన్స్ సరిగ్గా కుదరనప్పుడు ఎన్ని సోషల్ మీడియా జోక్స్, మీమ్స్ ఉన్నా అవి నవ్విస్తున్నాం అవి కొద్ది రోజులుకు మీమ్స్ మెటీరియల్ గా మారటం తప్పించి, పెద్ద గా కలిసొచ్చేది ఉండదు. తెరపై ఓ ఫన్నీ డైలాగు లేదా జోక్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది తప్పించి సినిమా పూర్తయ్యాక..ఏం చూసాము అని ఆలోచిస్తే ఏమీ గుర్తుకు రాదు. అదే ఈ సినిమాకు జరిగింది. చిన్న పాయింట్ తీసుకుని దాని చుట్టూ కొన్ని పంచ్ డైలాగులు, మరికొన్ని జోక్స్ తో నింపి మనమీదకు వదిలారు. అవి ఫన్నీ విన్యాసాలు చేస్తుందనుకుంటే రీసెంట్ గా మిత్రమండలి సినిమాకు పోటీగా మార్చేసాయి.
అదేంటో ఈ సినిమా కథ ఆర్గానిక్‌గా ముందుకు వెళ్లినట్టు అనిపించదు. ప్రతి సీన్ ఒక స్కిట్‌లా అనిపిస్తుంది. హీరో (శ్రీ విష్ణు) – సత్యా ట్రాక్ కాసేపు నవ్వించింది. అది వాళ్ల నటన, మేనరిజంలు, మన మనస్సులో వారి పై ఉన్న కామెడీ ఇమేజ్ తోనే అని గ్రహించాలి. అంతేకానీ అది రైటింగ్ తో కాదు. వాళ్ల టైమింగ్ ఆ నిముషానికి సినిమా బ్రతికించింది. కానీ అదే సమయంలో కథని చంపేసింది. ఫస్ట్ హాఫ్‌లో ఆ చిన్న చిన్న జోక్స్ కు కాసేపు నవ్వుతాము. కానీ సెకండ్ హాఫ్‌లోనూ ఏదన్నా కథ ముందుకు వెళ్తుందేమో అని ఆశపడితే.. అదే ధోరణిలో వెళ్తూ బోర్ కొట్టింది. కామెడీకి కూడా ఎడిటింగ్ అవసరం అనిపించింది.
అలాగే కొన్ని జోక్స్ సాగతీసారు. మరి కొన్ని చోట్ల పంచ్ ముందే ఊహించేస్తాము. టోటల్ గా కామెడీ “ఫన్నీ” నుంచి “ప్రెడిక్టబుల్” అయింది. సాధారణంగా కొత్త దర్శకుడి దగ్గర నుంచి ప్రేక్షకుడు కొత్తదనం ఆశిస్తాడు. కానీ ఇక్కడ అతను రిఫరెన్స్‌ల మీద కథను నడిపిస్తూ పాతదనాన్నే మనకు అందించే మీకు ఇచ్చే కామెడీ ధనం ..అదే నా ఇంధనం అనుకోమన్నాడు. చూసేవాడు మీకో వందనం అనే పరిస్దితి తెచ్చారు. ఫైనల్ గా ఒకటే కామెడీ వర్కవుట్ అవ్వాలంటే ఎమోషన్ అవసరం.మనని నవ్వించలంటే ఆ పాత్రలను ప్రేమించే అవకాశం ఇవ్వాలి. అది జరగలేదు.
టెక్నికల్ గా
డైరెక్టర్ మారుతి రావు కామెడీపై కొంతవరకూ మంచి పట్టు చూపించాడు, కానీ స్క్రీన్‌ప్లే, ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో డ్రామా హ్యాండ్లింగ్ మరింత బలంగా ఉండాల్సింది. డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి. సిట్యువేషన్స్ కరెక్ట్ గా సెట్ అయ్యితే మరన్ని మంచి డైలాగులు రాయగలరనిపించింది.
ఇక సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్. విజువల్స్ కలర్‌ఫుల్‌గా, వైబ్రంట్‌గా కనిపిస్తూ మొత్తం సినిమా చూడటానికి ప్లెజెంట్‌గా ఉంటుంది. రాధన్ మ్యూజిక్ మాత్రం అంతగా వర్కౌట్ కాలేదు. పాటలు గుర్తుండవు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సాధారణంగానే ఉంది. కార్తికేయన్ రోహిణి ఎడిటింగ్ ఓకే. రన్‌టైమ్ రెండు గంటలకు కట్ చేసినా, కొన్ని సీన్లు రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ప్రొడక్షన్ వాల్యూస్ మిడ్-రేంజ్ రొమాంటిక్ కామెడీకి సరిపోయే స్థాయిలో డీసెంట్‌గా ఉన్నాయి.
నటీనటుల్లో ..
శ్రీవిష్ణు ఎప్పుడూ కామెడీ బాగానే చేస్తాడు. మపో కీలక పాత్ర పోషించిన నయన్‌సారిక కూడా బాగా నటించింది. కమెడియన్ సత్య ఎప్పటిలాగే అందర్నీ నవ్వించే ప్రయత్నం చేసాడు. ఇక మిగతా నటీనటులంతా తమతమ పాత్రలకు న్యాయం చేశారు.
ఫైనల్ థాట్
మంచి కోర్ ఐడియా, సరైన కామెడీ టైమింగ్ ఉన్న హీరో, కొన్ని వర్కౌట్ అయిన ఫన్ బ్లాక్స్ — ఇవన్నీ ఉన్నా, బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవడంతో సినిమా అక్కడికక్కడే ఆగిపోయిన ఫీలింగ్ ఇస్తుంది. శ్రీ విష్ణు – సత్యా కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు.
సింపుల్‌గా చెప్పాలంటే: నవ్వులు ఉన్నాయి… కానీ గుర్తుపెట్టుకునేవి లేవు.

