
‘వార్ మెషీన్’ మూవీ OTT రివ్యూ!
మనిషి vs ఎలియన్ మెషీన్
అమెరికన్ ఆర్మీలో స్టాఫ్ సార్జెంట్‌గా పనిచేసే హీరో (అలెన్ రిచ్ సన్), ఒకానొక సమయంలో శత్రువుల దాడి నుంచి తన తమ్ముడిని కాపాడలేకపోతాడు. రేంజర్ కావాలనేది తన తమ్ముడి ఆఖరి కల. తన వలనే ఆ కల నెరవేరలేదు అనే బాధ ఉంటుంది. దాంతో ఆ కలని తాను నెరవేర్చడానికి అతను కఠినమైన రేంజర్ శిక్షణలోకి అడుగుపెడతాడు. ఎనిమిది వారాల నరకప్రాయమైన శిక్షణ తర్వాత, వందల మందిలో కేవలం 15 మంది మాత్రమే చివరి పరీక్షకు అర్హత సాధిస్తారు. ఒక పర్వత ప్రాంతంలో మొదలైన ఈ ఆఖరి పరీక్షే వారి జీవితాలను తలకిందులు చేస్తుంది.
విమానం అనుకుంటే.. అది భయంకరమైన రోబో!
ఆర్మీ అధికారులు ఏర్పాటు చేసిన ఒక డమ్మీ విమానాన్ని పేల్చేసి, పైలట్‌ను రక్షించడమే టీమ్ టార్గెట్. కానీ, పర్వతాల మధ్య వింత ఆకృతిలో ఉన్న ఒక విమానాన్ని పేల్చగానే అసలు సినిమా మొదలవుతుంది. ఆ విమానం ఒక్కసారిగా ఒక భారీ రోబోలా మారిపోతుంది. అది ఎక్కడ ఎవరున్నా స్కాన్ చేసి, కనురెప్పపాటులో ఫైరింగ్ చేస్తూ వెంటాడటం మొదలుపెడుతుంది. ఎంతటి శక్తిమంతమైన వస్తువునైనా క్షణాల్లో బూడిదగా మార్చేసే ఆ యంత్రం చూసి ఆర్మీ టీమ్ షాక్‌కు గురవుతుంది.
రాంగ్ లొకేషన్.. ఏలియన్ అటాక్!
ఆర్మీ అధికారులు సెట్ చేసిన డమ్మీ ఫ్లైట్ వేరని, తాము తప్పుడు లొకేషన్‌కు వచ్చామని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తమపై దాడి చేస్తున్న ఆ రోబో కచ్చితంగా ఈ గ్రహానికి సంబంధించింది కాదనే నిర్ధారణకు హీరో వస్తాడు. ఆధునిక ఆయుధాలు కూడా ఆ ఏలియన్ మెషీన్ ముందు చిన్నబోతాయి. అప్పుడు ఆ మెషీన్‌ను హీరో ఎలా ఎదుర్కొన్నాడు? కేవలం తెలివితేటలతో ఆ రాక్షసుడి బారి నుంచి తన టీమ్‌ను ఎలా కాపాడుకున్నాడు? తమ్ముడి కల కోసం ప్రాణాలకు తెగించిన హీరో, తన టార్గెట్‌ను పూర్తి చేశాడా లేక ఆ ఏలియన్ రోబోకు బలైపోయాడా అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఎనాలలిస్
ఒకసారి ఊహించండి. అడవిలో మిలిటరీ ట్రైనింగ్ చేస్తున్న కొంతమంది రిక్రూట్స్. వాళ్ల దగ్గర అసలు ఆయుధాలు కూడా లేవు. అదే సమయంలో ఆకాశం నుంచి ఒక భారీ ఎలియన్ యుద్ధ యంత్రం భూమిపై పడుతుంది… అది ఒక్కటే పని చేస్తుంది . మనుషులను వేటాడటం. వింటానికి సింపుల్ కానీ క్రేజీ ఐడియానే. అదే War Machine సినిమా. మొదట ఇది ఒక సాధారణ బూట్ క్యాంప్ మిలిటరీ డ్రామాలా ప్రారంభమవుతుంది. కానీ ఒక్కసారిగా కథ మలుపు తిరిగి Predator స్టైల్ సర్వైవల్ యాక్షన్ మూవీగా మారిపోతుంది.
కథలో లోతైన రాజకీయాలు, భావోద్వేగాలు ఏమీ ఉండకపోవచ్చు. కానీ స్క్రీన్‌ప్లే మాత్రం ఒక సింపుల్ ఫార్ములా మీద నడుస్తుంది. “హీరో ..రోబోతో ఎంతసేపు పోరాడగలడు. ఎంతవరకు బతుకుతాడు?” ఇదే ప్రశ్న చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది. ఎలియన్ సర్వైవల్ థ్రిల్లర్ మిక్స్. కానీ స్క్రీన్‌ప్లే పరంగా చూస్తే ఇందులో కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు కనిపిస్తాయి.
సినిమాలో హీరోకి పేరు కూడా ఉండదు. అతను కేవలం ఒక నెంబర్ — “81”. అతను ఆర్మీలో చేరడం వెనుక ఉన్న కారణం కూడా చాలా సింపుల్. తన చనిపోయిన తమ్ముడుకు ట్రిబ్యూట్‌గా ఆర్మీ రేంజర్‌గా మారాలని నిర్ణయించుకుంటాడు. స్క్రీన్‌ప్లే మొదటి భాగం మొత్తం బూట్ క్యాంప్ ట్రైనింగ్ చుట్టూ తిరుగుతుంది. హీరోని ఒక సాధారణ మనిషిగా కాకుండా, సూపర్ టఫ్ సర్వైవర్‌గా చూపించడానికి వరుస సీన్లు వస్తాయి.
జేమ్స్ కామెరూన్ తరచుగా చెప్పే ఒక విషయం ఉంది: “Audience first needs to understand the character’s survival instinct.” అంటే, ప్రేక్షకుడు హీరో ఎంత టఫ్ అనేది ముందే అర్థం చేసుకోవాలి. తర్వాత వచ్చే ప్రమాదం ఎంత పెద్దదో అప్పుడే ఫీల్ అవుతారు. War Machine మొదటి 30 నిమిషాలు అదే పని చేస్తుంది. హీరోని ఒక యుద్ధ మెషీన్ లా రెడీ చేస్తారు.
అసలు ట్విస్ట్: ఆకాశం నుంచి వచ్చిన శత్రువు. సినిమా మొదటి భాగంలో ఒక చిన్న డీటెయిల్ కనిపిస్తుంది. న్యూస్‌లో ఒక ఆస్టరాయిడ్ భూమికి దగ్గరగా వస్తోందని చెబుతుంటారు. ఇది స్క్రీన్‌ప్లేలో ఒక క్లాసిక్ టెక్నిక్ ....Chekhov’s Gun. తర్వాత ట్రైనింగ్ కోసం అడవిలోకి వెళ్లిన రిక్రూట్స్ ఎదుర్కొనేది ఏమిటంటే… ఒక భారీ బైపెడల్ ఎలియన్ వార్ మెషిన్. అది ఎందుకు వచ్చిందో, ఎందుకు వీళ్లని చంపుతోంది అనేది సినిమా పెద్దగా వివరించదు. అది కేవలం ఒకే పని చేస్తుంది వేట.
అలాగే రెగ్యులర్ గా స్పీల్‌బర్గ్ సినిమాల్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. “Sometimes mystery is more powerful than explanation.” ఎలియన్ ఎందుకు వచ్చిందో పూర్తి వివరాలు చెప్పకపోవడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. ప్రేక్షకుడికి అది ఇంకా భయంకరంగా అనిపిస్తుంది.
War Machine అదే ట్రిక్ వాడుతుంది.
ఎలియన్ రోబోట్ ఒకసారి దాడి చేసిన తర్వాత సినిమా పూర్తిగా సర్వైవల్ థ్రిల్లర్గా మారుతుంది. రిక్రూట్స్ ఒక్కొక్కరిగా చనిపోతుంటారు.
హీరో మాత్రం బతికే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ భాగంలో కొన్ని యాక్షన్ సెట్‌పీసులు ఉన్నాయి. ఇవి కథను ముందుకు తీసుకెళ్లడానికి కాకుండా ప్యూర్ విజువల్ ఎంటర్టైన్మెంట్ కోసం డిజైన్ చేసిన సీన్లు. మనుషులు vs ఎలియన్ రోబోట్. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త ప్రమాదం.టెన్షన్.
అయితే సినిమాలో నాకు అనిపించిన పెద్ద లోపం ఏమిటంటే . ఏ పాత్రకు పెద్దగా డెప్త్ ఉండదు. హీరో తప్ప మిగతా సైనికులు ఎక్కువగా క్యానన్ ఫోడర్ లాగానే కనిపిస్తారు. ఏమిటో డైలాగ్స్ కూడా చాలా సార్లు మెషిన్‌లా వినిపిస్తాయి. హీరో పాత్ర కూడా చాలా వరకూ అలాగే ఉంటుంది. ఇది ఒక విధంగా ’80s యాక్షన్ సినిమాలకు ట్రిబ్యూట్.
ఫైనల్ థాట్..
War Machine లో పెద్దగా తాత్వికత లేదు. పాత్రలలో డెప్త్ కూడా చాలా తక్కువ. కానీ ఇది పూర్తిగా ఒక లక్ష్యంతో తీసిన సినిమా —
ప్రేక్షకుడికి ఒక రా యాక్షన్ అనుభవం ఇవ్వడం. పాట్రిక్ హ్యూజ్ దర్శకత్వం కూడా అదే దిశలో సాగుతుంది. Predator, Terminator తరహా యాక్షన్ ఎనర్జీని గుర్తు చేసేలా సన్నివేశాలు నిర్మించాడు. ఒక మాటలో చెప్పాలంటే....ఇది ఒక సీరియస్ వార్ డ్రామా కాదు…ఒక బిగ్, లౌడ్, ఫుల్ యాక్షన్ రైడ్.
చూడచ్చా
సైన్స్ ఫిక్షన్ మరియు ఆర్మీ యాక్షన్ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. అలెన్ రిచ్‌సన్ తన బాడీ లాంగ్వేజ్‌తో, పెర్ఫార్మెన్స్‌తో మరోసారి మెప్పించాడనే చెప్పాలి. క్లైమాక్స్ లో వచ్చే ఆ రోబో ఫైట్ సీక్వెన్స్ మాత్రం ఈ సినిమాకే హైలైట్.
ఎక్కడ చూడచ్చు
నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో ఉంది

