రూ.600 టికెట్ తో హరిహర వీరమల్లు ముందు రోజే చూడొచ్చు!
x

రూ.600 టికెట్ తో 'హరిహర వీరమల్లు' ముందు రోజే చూడొచ్చు!

పవన్ కల్యాణ్ అభిమానులకు పండగే పండగ


పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే. ఆయన హీరోగా నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా విడుదలకు ముందు రోజే చూసే అవకాశం కల్పిస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ సినిమా వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా జూలై 24న విడుదల కానుంది. అయితే ప్రీపెయిడ్ ప్రీమియర్ షో ను ముందు రోజే ప్రదర్శించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు క్రిష్‌, జ్యోతికృష్ణ నిర్మించారు. హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ నటించారు. చిత్రాన్ని ఏఎం రత్నం నిర్మించారు.
సినిమా విడుదలైన మొదటి రెండు వారాలు రేట్లు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాత ప్రభుత్వాన్ని కోరగా, మొదటి 10 రోజులకే రేట్లు పెంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
జులై 24 నుంచి ఆగస్టు 2 వరకూ పెంచిన టికెట్‌ ధరలు అమల్లో ఉంటాయి. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో ఒక్కో లోయర్‌ క్లాస్‌పై రూ.100 (జీఎస్టీతో కలిపి) అప్పర్‌ క్లాస్‌పై రూ.150 (జీఎస్టీతో కలిపి) పెంచుకునే వెసులుబాటు కల్పించగా, మల్టీప్లెక్స్‌లో రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది.
విడుదలకు ముందు రోజైన జులై 23న (బుధవారం) రాత్రి 9గంటల పెయిడ్‌ ప్రీమియర్‌ షో కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ టికెట్‌ ధర రూ.600 (జీఎస్టీ అదనం) నిర్ణయించారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో మాత్రమే ఈ షోకు అనుమతి ఉంది.
మరోవైపు తెలంగాణలో టికెట్‌ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. దీనిపైనా త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 24వ తేదీ తెల్లవారుజామున 4గంటల షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.
పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.
Read More
Next Story