‘‘కట్ చేస్తే.. సర్ఠిఫికెట్ ఇస్తాం’’: హైకోర్టుకు తెలిపిన సీబీఎఫ్సీ
x

‘‘కట్ చేస్తే.. సర్ఠిఫికెట్ ఇస్తాం’’: హైకోర్టుకు తెలిపిన సీబీఎఫ్సీ

కంగనా రనౌత్ దర్శకత్వం వహించి నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ సినిమాకి సీబీఎఫ్సీ సర్టిఫికెట్ జారీ చేయడం లేదని చిత్ర నిర్మాణ సంస్థ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.


కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి రివైజింగ్ కమిటీ సిఫారసు చేసినట్లుగా కొన్ని కట్‌లు చేస్తే దానికి సర్టిఫికెట్ జారీ చేస్తామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) గురువారం బాంబే హైకోర్టుకు తెలిపింది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 6 నే విడుదల కావాల్సి ఉండేది. కానీ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వడంలో జాప్యం చేయడంతో వివాదం తలెత్తింది.

మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ప్రధాన పాత్రలో నటించడంతో పాటు చిత్రానికి దర్శకత్వం వహించి, సహ నిర్మాతగా వ్యవహరించిన రనౌత్ సీబీఎఫ్సీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే ఆలస్యం చేశారని ఆరోపిస్తూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. శిరోమణి అకాలీ దళ్‌తో సహా కొన్ని సిక్కు సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో జీవిత చరిత్ర సినిమా వివాదంలో చిక్కుకుంది. ఇది సమాజాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నదని, చారిత్రక వాస్తవాలను తప్పుదోవ పట్టించిందని సీబీఎఫ్సీ ఆరోపించింది.
ఈ చిత్రానికి సంబంధించిన సర్టిఫికేట్ జారీపై నిర్ణయం తీసుకోనందుకు న్యాయమూర్తులు బిపి కొలబవల్లా, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన డివిజన్ బెంచ్ గత వారం సిబిఎఫ్‌సిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సెన్సార్ బోర్డు కంచె మీద కూర్చోదని, ఒక విధంగా తన నిర్ణయాన్ని తీసుకోవలసి ఉంటుందని, లేకుంటే అది వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని హైకోర్టు తలంటింది.
సినిమాపై సెప్టెంబర్ 25లోగా నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్‌సీని కోర్టు ఆదేశించింది. కంగనా రనౌత్ చేసిన "ఎమర్జెన్సీ" చిత్రానికి సర్టిఫికేట్ జారీ చేసేలా CBFCని ఆదేశించాలని కోరుతూ సినిమా సహ నిర్మాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ HCని ఆశ్రయించింది. గురువారం, వాదనలు విన్న బెంచ్ సిబిఎఫ్‌సిని సినిమాకు "శుభవార్త" ఉందా అని ప్రశ్నించింది.
బోర్డు రివైజింగ్ కమిటీ నిర్ణయం తీసుకుందని సీబీఎఫ్‌సీ తరపు న్యాయవాది అభినవ్ చంద్రచూడ్ కోర్టుకు తెలిపారు. సర్టిఫికేట్ జారీ చేసి సినిమా విడుదల చేయడానికి ముందు కమిటీ కొన్ని కట్‌లను సూచించిందని కోర్టుకు తెలిపారు.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ తరఫున సీనియర్ న్యాయవాది శరణ్ జగ్తియానీ, కోతలు చేయవచ్చా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరారు. దీంతో బెంచ్ తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ తన పిటిషన్‌లో సిబిఎఫ్‌సి ఇప్పటికే సినిమాకు సర్టిఫికేట్ తయారు చేసిందని, అయితే దానిని జారీ చేయడం లేదని పేర్కొంది. గత వారం, జీ ఎంటర్‌టైన్‌మెంట్ రాజకీయ కారణాల వల్ల అలాగే హర్యానాలో రాబోయే ఎన్నికల కారణంగా సర్టిఫికేట్ నిలిపివేసిందని ఆరోపించింది. అయితే స్వయంగా బీజేపీ ఎంపీ అయిన రనౌత్‌పై అధికార పార్టీ ఎందుకు ఇలా వ్యవహరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది.


Read More
Next Story