
సెటైర్ కామెడీ : 'తలైవర్ తంబి తలైమైయిల్' రివ్యూ
ఒకవైపు పెళ్లి బాజాలు, మరోవైపు చావు మేళం!
ఊరి ప్రెసిడెంట్ జీవరత్నం (జీవా)ది అందరితో కలిసిపోయే మనస్తత్వం. ఏ ఇంట్లో సమస్య అయినా తనదే అన్నట్లు ముందుకు దూకుతూంటాడు. దానికి తోడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ప్రతి ఓటు కీలకంగా భావించి మరింత ఉత్సాహంగా ఊరి వాళ్ల సమస్యల్లోకి దూరిపోతూంటాడు. ఇక అదే ఊళ్లో ఉన్న ఇలవరసు (ఇలవరసు) కూతురు సౌమ్య పెళ్లికి ముహూర్తం పెట్టుకుంటారు. తెల్లారి పదిన్నరకి ముహూర్తం. ఆ భాధ్యత తన భుజాన వేసుకుంటాడు మన ప్రెసిడెంట్. పెళ్లి కొడుకు వాళ్లు బయిలుదేరి వచ్చేస్తూంటారు. అంతా ఉత్సాహపూరితమైన వాతావరణం.ఆ పెళ్లి వేడుకలు ఎలాంటి ఆటంకం లేకుండా బాధ్యతను జీవ ముందుకు తీసుకెళ్తూంటాడు.
సరిగ్గా ఇక్కడే అసలు ట్విస్ట్ పడుతుంది. ఇలవరసు ఇంటి పక్కనే ఉండే మణి (తంబీ రామయ్య) ఇంట్లో అనూహ్యంగా అతని తండ్రి చనిపోతాడు. దాంతో మణి తన తండ్రి అంతిమ యాత్రను ఘనంగా చెయ్యాలనుకంటాడు. తెల్లారి పదిన్నరకే తన తండ్రిని రథయాత్రలోతీసుకెళ్లాలకుంటాడు. దాంతో ప్రక్క ప్రక్క ఇల్లులే కావటంతో ఒకే చోట ఒకవైపు పెళ్లి శుభకార్యం, మరోవైపు అంత్యక్రియలు ఒకే సమయంలో జరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరూ తగ్గేదేలే అన్నట్లు ఉంటారు. ఇద్దరిలో ఒకరిని అయినా ఒప్పించి టైమ్ మార్పిద్దామనుకుంటాడు జీవా. కానీ అది జరిగే పనిలా కనపడదు. ఎందుకంటే ఇలవరసుకి మణికి పాత గొడవలు, పగలు,ప్లాష్ బ్యాక్ లు ఉన్నాయి. ఒకరంటే మరొకరి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్దితి.
ఈ సిట్యువేషన్ లో ఎవరూ తగ్గడానికి సిద్ధంగా లేకపోవడంతో గ్రామంలో ఉద్రిక్తత పెరిగిపోతుంది. ఒకరి ఇగోలు మరొకరు దెబ్బతీసుకుంటున్న సమయంలో.. అటు ఇలవరసు ఫ్యామిలీ ఓట్లు, ఇటు మణి ఫ్యామిలీ ఓట్లు రెండూ కావాలనుకున్న జీవరత్నం ఈ రచ్చను ఎలా ఆపాడు? చావు మేళం మధ్యలో పెళ్లి బాజాలు ఎలా మోగాయి? అసలు ఆ పాత పగలకు ఈ సమస్యకు సంబంధం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎనాలసిస్
సంక్రాంతి కానుకగా జనవరి 15న తమిళ్‌లో విడుదలైన తలైవర్ తంబి తలైమైయిల్ అక్కడ సంచలన విజయాన్ని అందుకుంది. కోలీవుడ్‌లో ఈ ఏడాది పొంగల్ సినిమాల్లో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది.రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడు నితీష్ సహదేవ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఓ సోషల్ సెటైర్ కామెడీగా రన్ అవుతుంది. మలయాళంలో 'ఫెలిమి' అనే బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నితీష్.. తమిళంలో దర్శకత్వం వహించిన మొదటి సినిమా తలైవర్ తంబి తలైమైయిల్ (Thalaivar Thambi Thalaimaiyil) కావడం విశేషం.
ఈ సినిమాకు ప్రధాన బలం కొత్త కాన్సెప్టు. బిగిసడలని స్క్రీన్ ప్లే. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ ప్రక్కకుండా విల్లు వదిలిన బాణంలా సూటిగా దూసుకుపోతుంది. ఇందులో సిట్యువేషన్ కామెడీనే ప్రధానం, డైలాగు కామెడీ తక్కువ. హీరో ఎక్కడా పనిగట్టుకుని నవ్వించడు.లెక్చర్స్ ఇవ్వడు. సీన్ లో కంటెంట్ ని డ్రైవ్ చేయటానికి సాయపడతాడు అంతే. డైరక్టర్ నితీష్, అతని సహ రచయితలు అనురాజ్, సంజో జోసెఫ్ కలిసి ఈ సోషల్ సెటైర్ కు స్క్రిప్టు దశంలోనే ప్రాణం పోసారు.
ఈ కథలో బ్యూటీ అంతా..కథకు ఏమాత్రం సంబంధం లేని పాటలు లేదా ఫైట్లను జోడించి సమయాన్ని వృధా చేయకుండా రచయితలు జాగ్రత్తపడటటమే. కథలోని మెయిన్ కాంప్లిక్ట్ ఇలవరసు, మణి మధ్య ఉండే 'ఇగో' ఆధారంగా సాగుతుంది. అయితే ఫన్ కోసం ఈ గందరగోళం కొన్ని చోట్ల మరీ ఎక్కువైపోయి, వారి పాత్రల వెనుక ఉన్న విమర్శనాత్మక అంశాలపై దృష్టి పెట్టడం తగ్గింది. అయితేనేం ఆ సీన్స్ బాగున్నాయి. సినిమాలో గందరగోళం సృష్టించిన సన్నివేశాలు నవ్వు తెప్పించగా, చివరి అంకంలో (Final Act) నీటిని ఉపయోగించిన విధానం బాగా ఎఫెక్టివ్ గా ఉంది.
ఎవరెలా చేసారంటే..
ఈ సినిమాలో జీవా తన నటనతో ప్రాణం పోశాడు. పంచాయతీ ప్రెసిడెంట్‌గా నవ్విస్తూ, ఎమోషన్స్ పండిస్తూ, ఊరి సమస్యలను పరిష్కరించే పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. జీవా లాగే ఇలవరసు కూడా తన పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. తన పాత్రకు ఉండాల్సిన అహాన్ని (Ego) ఆయన స్క్రీన్ మీద అద్భుతంగా పండించారు. తంబీ రామయ్య ఎప్పటిలాగే తన మార్కు అరపులతో కొంచెం అతిగా అనిపించినా, ఆయన పోషించిన మణి పాత్ర స్వభావానికి ఆ నటన సరిగ్గా సరిపోయింది.
టెక్నికల్ టీమ్‌లో దర్శకుడు, రచయితలు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా 90 శాతం మంది కేరళకు చెందిన వారే ఉండటం విశేషం. విష్ణు విజయ్ అందించిన సంగీతం సినిమాకు మంచి ఎనర్జీని ఇచ్చింది.
చూడచ్చా
ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు
ఎక్కడ చూడచ్చు
నెట్ ప్లిక్స్ లో తెలుగులో ఉంది.

