
'అవతార్ 3' టాక్ ఏంటి, ఓపెనింగ్స్ సంగతేంటి?
జేమ్స్ కామెరూన్ ‘మ్యాజిక్’ వర్కౌట్ అయిందా?
ఈ శుక్రవారం థియేటర్ల దగ్గర ఒకే ఒక్క సినిమా పేరు వినిపించింది. ఎన్ని రిలీజులు ఉన్నా స్క్రీన్‌లన్నీ నిండిపోవడానికి కారణమైన ఆ ఒక్క సినిమా… అవతార్: ఫైర్ అండ్ యాష్ .ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా ‘అవతార్ ఫైర్ అండ్ యాష్’ (Avatar: Fire and Yash). అవతార్ ఫ్రాంచైజీలో భాగంగా వచ్చిన మూడో సినిమా ఇది. ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James Cameron) తెరకెక్కించిన ఈ కొత్త చిత్రం పై రిలీజ్ కు ముందు నెగిటివ్ టాక్ నడిచింది. గత కొద్ది రోజులుగా మీడియాలో ఈ సినిమాకు హైప్ తగ్గిందన్న మాటలు వినిపించాయి. అయితే రిలీజ్ రోజున మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిందంటోంది ట్రేడ్. అసలు అవతార్ 3 టాక్ ఏంటి? ఓపెనింగ్స్ నిజంగా అంత స్ట్రాంగ్ గానే ఉన్నాయా? అన్న ప్రశ్నలే ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్.
హైప్ తగ్గినా…
రెండో భాగం నిరాశపరిచిన తర్వాత అవతార్ ఫ్రాంచైజీ మీద ఆసక్తి తగ్గిందన్న మాటలు చాలానే వినిపించాయి. “ఇప్పటికీ అవే విజువల్స్, అవే భావాలు” అన్న విమర్శలు అవతార్ 3 రిలీజ్ కు ముందే మొదలయ్యాయి. కానీ అవతార్: ఫైర్ అండ్ యాష్ రిలీజ్ రోజు మాత్రం ఆ మాటలన్నీ మాయమయ్యాయి. ఈ శుక్రవారం ఎన్ని సినిమాలు విడుదలైనా, జనాలు మాత్రం ఒక్క అవతార్ కోసమే క్యూలో నిలబడ్డారు. ఈ క్రేజ్ వెనుక ఉన్నది కేవలం బ్రాండ్ పవర్ మాత్రమేనా? లేక సినిమా నిజంగా ఆ స్థాయిలో డెలివర్ చేసిందా?
అవతార్ 3 – బ్రాండ్ పవర్ మరోసారి ప్రూవ్
అవతార్: ఫైర్ అండ్ యాష్ ప్రీమియర్స్‌తోనే సంచలనం మొదలైంది. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో అర్ధరాత్రి స్పెషల్ షో, మొదటి రోజే ప్రీమియం స్క్రీన్లలో హౌస్‌ఫుల్స్… ఇవన్నీ అవతార్ అనే పేరు ఇప్పటికీ ఎంత బలంగా పనిచేస్తుందో చూపించాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – రాజమౌళి, సుకుమార్ లాంటి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చి ఈ సినిమాను ప్రొమోట్ చేయడం. ఇది కేవలం ఒక హాలీవుడ్ సినిమా రిలీజ్ మాత్రమే కాదు, ఒక “సినిమాటిక్ ఈవెంట్” అన్న ఫీలింగ్‌ను సాధారణ ప్రేక్షకుల వరకు తీసుకెళ్లింది.
అవతార్ 3 టాక్
కంటెంట్ విషయంలోకి వస్తే… విజువల్స్ పరంగా ఫైర్ అండ్ యాష్ ఎలాంటి కాంప్రమైజ్ చేయలేదు. పాండోరా కొత్త ప్రాంతాలు, ఫైర్–యాష్ థీమ్, 3D డిజైన్, సౌండ్ డిజైన్ – అన్నీ కూడా జేమ్స్ కామెరూన్ క్లాస్‌ను గుర్తు చేస్తాయి. కానీ సమస్య కథలో ఉంది. ఫ్రాంచైజీలో ఇప్పటివరకు చూసిన ఎమోషనల్ బీట్స్, కాన్ఫ్లిక్ట్ మళ్లీ మళ్లీ రిపీట్ అవుతున్నాయన్న ఫీలింగ్ చాలా మందికి వచ్చింది. ముఖ్యంగా విజువల్స్ అద్భుతం అనిపించే స్థాయిలోనే ఉంటాయి. కానీ తొలి రెండు సినిమాల స్థాయిలో ఆశ్చర్యపోతూ చూసేలా అయితే ఉండవు.
ఇంతకుముందు చూసిన సన్నివేశాల్నే మళ్లీ తెరపై చూసిన అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా సెకండాఫ్ నిడివి ఎక్కువగా ఉండటం, కథ ముందుకు కదలకుండా విజువల్ షోకే పరిమితం అవ్వడం పెద్ద మైనస్‌గా మారింది. ఫ్యాన్స్‌కు ఇది “అవతార్ వరల్డ్‌లో ఇంకొంత టైమ్ గడిపినట్టే” అనిపిస్తే, రెగ్యులర్ ఆడియన్స్‌కు మాత్రం “ఇదంతా ముందే చూసినట్టు ఉంది” అన్న భావన బలంగా వస్తోంది.
ఐమాక్స్ మ్యాజిక్ vs నార్మల్ థియేటర్ రియాలిటీ
ఈ సినిమా నిజంగా వర్కవుట్ అయ్యేది ఐమాక్స్, డాల్బీ లాంటి అత్యాధునిక 3D స్క్రీన్లలోనే అన్న మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అక్కడ అవతార్ అనుభూతి వేరే లెవెల్.
కానీ మామూలు సింగిల్ స్క్రీన్లు లేదా స్టాండర్డ్ మల్టీప్లెక్స్‌లలో చూస్తే… అదే మ్యాజిక్ అంతగా పని చేయడం లేదన్న టాక్ ఉంది. అంటే అవతార్ 3 ఒక “యూనివర్సల్ ఎంటర్టైనర్” కంటే “ప్రీమియం విజువల్ ఎక్స్‌పీరియన్స్”గా మిగిలిపోయిందా? అన్న డౌట్ క్రియేట్ అవుతోంది.
ఓపెనింగ్స్: నంబర్స్ స్ట్రాంగ్… కానీ అంచనాల కంటే తక్కువే
బడ్జెట్ దృష్ట్యా అవతార్ 3 రిస్కీ ప్రాజెక్ట్. దాదాపు 400 మిలియన్ డాలర్లు ఖర్చుతో రూపొందిన అవతార్ 3 ఓపెనింగ్స్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ చర్చ నడుస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తొలి రోజు వసూళ్లు 340–380 మిలియన్ డాలర్ల మధ్య ఉండే అవకాశం ఉంది. అమెరికా డొమెస్టిక్ మార్కెట్ నుంచి సుమారు 90 మిలియన్ డాలర్లు, అంతర్జాతీయ మార్కెట్ నుంచి 250 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మార్వెల్ లేదా డీసీ ఈవెంట్ సినిమాలతో పోలిస్తే ఇవి కొంచెం తక్కువగా అనిపించినా… అవతార్ ఫ్రాంచైజీకి మాత్రం ఇది గౌరవప్రదమైన స్టార్ట్ అనే అభిప్రాయం ఉంది.
ఇండియాలో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?
అవతార్ (2009) తొలి భాగం సంచలన విజయం సాధించి, ఈ ఫ్రాంచైజీకి భారీ బ్రాండ్ విలువను తీసుకొచ్చింది. అదే బ్రాండ్ ఇమేజ్ కారణంగా రెండో భాగమైన అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో 40 కోట్లకు పైగా నెట్ ఓపెనింగ్స్‌తో థియేటర్లలోకి వచ్చింది. తొలి భాగం స్థాయిలో ప్రశంసలు రాకపోయినా, ఈ సినిమా ఇండియాలో దాదాపు 500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి అద్భుతమైన రన్‌ను నమోదు చేసింది.
అయితే, అవతార్ 2 ప్రభావం ఇప్పుడు అవతార్ 3: ఫైర్ అండ్ యాష్ మీద పడినట్టు కనిపిస్తోంది. తాజా భాగం బలహీనమైన బజ్‌తో రిలీజ్ కావడంతో ఓపెనింగ్ స్పందన కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. మొదటి రోజు వసూళ్లు ది వే ఆఫ్ వాటర్ తో పోలిస్తే దాదాపు 50 శాతం మాత్రమే ఉండగా, వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతగా ఉత్సాహం కలిగించలేదు.
ఈ పరిస్థితుల్లో అవతార్ 3 ఇండియాలో 250 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోవడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక ముందు రోజుల్లో ఫ్రాంచైజీ బ్రాండ్ పవర్ ఈ సినిమాను ఎంతవరకు నిలబెడుతుందో చూడాల్సిందే.
అవతార్ ఫ్రాంచైజీ భవిష్యత్ – నిర్ణయం ఈ సినిమాదే
అవతార్ తొలి భాగం 2.92 బిలియన్ డాలర్లు, రెండో భాగం 2.32 బిలియన్ డాలర్ల వసూళ్లతో చరిత్ర సృష్టించాయి. ఆ స్థాయిలో మూడో భాగం చేరుతుందా అంటే… ప్రస్తుత టాక్ చూస్తే కాస్త సందేహమే. జేమ్స్ కామెరూన్ ఇప్పటికే ఈ ఫ్రాంచైజీకి తన జీవితాన్ని అంకితం చేశారు. ఫైర్ అండ్ యాష్ భారీ బ్లాక్‌బస్టర్ అయితే ఇంకో రెండు భాగాలు ఖాయమని ఆయన స్పష్టంగా చెప్పారు. కానీ మిక్స్‌డ్ టాక్, కథలో కొత్తదనం లోపించడం లాంటి అంశాలు ఫైనల్ రన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఫ్యాన్స్‌కు ఇది ఒక విజువల్ ఫీస్ట్. కానీ మిగిలిన ప్రేక్షకులకు మాత్రం అవతార్ 3 “బాగుంది… కానీ ఆశ్చర్యపరచలేదు” అన్న ఫీలింగ్‌ను మిగిల్చేలా ఉంది. ఇక అసలు తీర్పు మాత్రం ఒక్కటే నిర్ణయిస్తుంది – వచ్చే వారం కలెక్షన్స్. అవతార్ ఇంకా వరల్డ్ బాక్సాఫీస్‌ను పాలిస్తుందా? లేక ఇది ఫ్రాంచైజీకి మొదటి హెచ్చరికా? అది తెలుసుకోవాలంటే… ఇంకా కొద్దిరోజులు ఆగాల్సిందే.

