రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రివ్యూ
x

రామ్ 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా రివ్యూ

అభిమాని ధైర్యం.. హీరో గౌరవం !

సూపర్‌స్టార్ సూర్య (ఉపేంద్ర) కెరీర్‌లో మైలురాయిగా నిలవాల్సిన 100వ సినిమా బడ్జెట్ సమస్యలతో మధ్యలోనే ఆగిపోయింది. ఓ మూడు కోట్లు ఉంటే పూర్తైపోతుంది. అందుకోసం హీరోగారు శతవిధాల ప్రయత్నిస్తాడు. కానీ ఫలితం లేదు. నా అనుకున్న వాళ్ళంతా మొహం చాటేస్తారు. ఈ సినిమా బయిటకు రాకపోతే తను ప్రపంచానికి మొహం చాటేయాల్సిందే. ఏం చేయాలో..అర్దం కాని సిట్యువేషన్ లో సూర్య బ్యాంక్ ఖాతాలో మిస్టీరియస్‌గా కావాల్సిన ఆ మూడు కోట్లు డిపాజిట్ అవుతాయి! అయితే తనకు ఇలాంటి కీలక సమయంలో సాయం చేసి పుణ్యం కట్టుకున్న ఆ పుణ్యాత్ముడు ఎవరు...ఎంక్వైరీ చేస్తే తెలిసింది.

అతను మెరవరో కాదు… ఆంధ్ర కింగ్‌ అభిమాన సంఘం అధ్యక్షుడు సాగర్ (రామ్ పోతినేని)! షాక్ అయ్యి, ఎమోషన్ అయ్యి, ఇలా రకరకాలగా అయ్యిపోయిన సూర్య..ఆ అభిమానిని కలవాలని స్వయంగా గోదావరి జిల్లాల్లోని అతని ఊరు గోడపల్లి లంకకు బయిలుదేరాడు. ఈ క్రమంలో సాగర్ గురించి రకరకాల విషయాలు తెలుస్తాయి. అవి సూర్యను ఆశ్చర్యపరుస్తాయి. ఆనందపరుస్తాయి. బాధపడేలా చేస్తాయి. ఇంతకీ ఎవరీ వీరాభిమాని, అసలు తనలో ఏం చూసి ఇంతలా అభిమానించాడు.

అలాగే అతని జీవితం ఏమిటి..అతని ఊళ్లో కష్టాలు ఏమిటి..వాటిని తీర్చటానికి అతనే చేసాడు. అలాగే అతని అడ్డా మహాలక్ష్మి థియేటర్ మేటర్ ఏమిటి..తను ప్రేమించిన అమ్మాయి మహాలక్ష్మి (భాగ్యలక్ష్మి బోర్సే) తో అసలు పరిచయం అయ్యింది. ఆమె తండ్రి థియేటర్ ఓనర్ పురుషోత్తం (మురళీ శర్మ) అతని ప్రేమ విషయం తెలుసుకుని ఎలాంటి ఛాలెంజ్ చేసాడు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమా ట్రైలర్, టీజర్ చూడగానే మనకు ఓ హీరోకు, అతని చేత ప్రభావితం కాబడ్డ అబిమానికి మధ్య కథ అని అర్దమవుతుంది. అయితే సినిమా హాల్లోకి వెళ్లాకే వేరే లేయర్స్ ప్రత్యక్ష్యమవుతాయి. హీరో లవ్ స్టోరీ, హీరోయిన్ తండ్రితో ఛాలెంజ్, తన ఊరిని బాగుచేసుకునే భగీరధ ప్రయత్నాలు వంటివి బోలెడు కనిపిస్తాయి. అవి కొంత ఆశ్చర్యపరుస్తాయి, మరికొంత నిరాశపరుస్తాయి. దాంతో పూర్తిగా ఇది హీరోకు, కటౌట్స్ కు పాలాభిషేకాలు చేసే మనలాంటి ప్యాన్ కు మధ్య కథ కాదు..వాళ్లిద్దరి మధ్యా ఏ కాంప్లిక్స్ కాదు ..కేవలం ఈ కథను చెప్పటానికి అదో నేపధ్యం గా ఎంచుకున్నారు అర్దమవుతుంది.

సర్లే..మనం ట్రైలర్,టీజర్ చూసి అనుకున్నది కాదు కదా..థియోటర్ లోకి వచ్చాక డైరక్టర్ చెప్పింది వినాలి,చూడాలి కదా అని ఫిక్స్ అవుతాం. సూపర్ స్టార్ వందో సినిమా మూడు కోట్లు దొర్కక సినిమా ఆగిపోవటం ఏమిటీ అనిపిస్తుంది. ఏమోలే...హీరోలు అయితే వాళ్లకు సినిమా కష్టాలు రావా అని సరిపెట్టుకుని ముందుకు వెళ్తే...

ఇక ఫస్ట్ హాఫ్ లో మంచి ఫ్రేములు ఉన్నా…కథా పరంగా ఏమీ జరగలేదన్నదన్న ఫీల్ కలుగుతుంది. అందుకు ప్రధాన కారణం స్లో నారేటివ్, సాలిడ్ గా కాంఫ్లిక్ట్ లేనట్లు అనిపించటం. ఇంటర్వెల్‌కు వచ్చే కాంఫ్లిక్ట్ కూడా అవరేజ్ నోట్‌లోనే ఉంటుంది. సబ్జెక్ట్ స్ట్రాంగ్ అయినా, రైటింగ్ మాత్రం ఆ స్దాయిలో ఉండదు.

సెకండ్ హాఫ్‌లో కూడా హీరో జర్నీ అంతా ఈజీగా జరిగిపోతుంది. ఓవర్ నైట్ సక్సెస్, అన్నింటికీ సులభమైన పరిష్కారాలు అనిపిస్తూంటాయి.

అక్కడే మనం అంటే ఆడియెన్స్ ఇన్వాల్వ్మెంట్ పడిపోతుంది. సంఘర్షణ లేకపోతే ఎమోషన్ కదలదు. అయినా, రావు రమేష్ టెంపుల్ బ్లాక్,

రామ్‌కి తిరిగి వచ్చే స్టామరింగ్ ఎపిసోడ్ —ఈ చిన్న చిన్న రైటింగ్ ఐడియాస్ కొంతవరకూ బాగానే పనిచేస్తాయి. కాని ఆ మోమెంట్సే సినిమాకు ప్రాణాలా అంటే ఒప్పుకోలేం.

హీరోయిన్ ఫాదర్‌గా మురళీ శర్మ పాత్రలో మంచి పొటెన్షియల్ ఉంది. కానీ అది కూడా స్క్రిప్ట్‌లో సరిగ్గా ఉపయోగించలేదు. వారిద్దరి మధ్యా ఛాలెంజ్ ట్రాక్ కూడా బాగానే మొదలైనా… తర్వాత ఆ బిల్డ్‌అప్ మిస్ అవుతుంది.

క్లైమాక్స్ – పెద్ద ఎమోషన్ ప్లాన్ చేసారు… కానీ స్క్రీన్‌పై మాత్రం ఫ్లాట్‌ అయ్యిపోయింది. అత్యంత కీలకమైన బ్లాక్ — అభిమాని తన జీవితంలో అత్యంత విలువైనదాన్ని హీరో కోసం త్యాగం చేసే సీక్వెన్స్. ఇది మూవీలో హార్ట్ అవ్వాలి. పీక్ ఎమోషన్ అవ్వాలి. “అభిమాని–హీరో” అనే లైన్‌కు డెఫినిటివ్ సీన్ అవ్వాలి. స్యాక్రిఫైస్ రీజన్ కన్విన్సింగ్ కాదు. ఉపేంద్ర–రామ్ మీటింగ్ కూడా రెగ్యులర్ సీన్‌లా వచ్చిపోతుంది. ఫ్లడ్ ఎపిసోడ్ పూర్తిగా ఫోర్స్డ్ ఫీలవుతాం. అందుకే క్లైమాక్స్… ఎమోషనల్‌గా క్లిక్ అవ్వాల్సిన చోట డ్రాప్ అయ్యింది. ఏదైమైనా సినిమా చెప్పాలనుకున్నది ఎంతో పెద్దది… వ్యక్తీకరించింది మాత్రం సగం మాత్రమే.

ఎవరెలా చేసారు

నటుడుగా రామ్, భాగ్యలక్ష్మి బోర్సే ఇద్దరూ పోటీ పడ్డారు అనటంలో సందేహం లేదు. సూపర్ స్టార్ సూర్యగా ఉపేంద్ర ఎక్కడా లోటు చెయ్యలేదు. కాకపోతే ఆయన్ని పూర్తిగా వాడుకోలేదేమో అనిపించింది. రావు రమేష్, సత్య, మురళి శర్మ వంటివారు తమ పాత్రలకు న్యాయం చేసారు. టెక్నికల్ గా మంచి సౌండ్ గా ఉంది. మైత్రీ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. దర్శకుడుగా సక్సెస్ అయిన మహేష్ రైటర్ గా ఆ స్దాయి అవుట్ ఫుట్ ఇవ్వలేక తడబడ్డారు.

ఫైనల్ థాట్

మంచి సినిమా కావలసినది… ఓ మంచి ప్రయత్నంగా మిగిలిపోతుందేమో అనిపించింది. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’లో హార్ట్ ఉంది… కానీ ఆ హార్ట్ కు బీట్ ఇచ్చే రైటింగ్ మాత్రం హాఫ్-లైఫ్‌లోనే ఆగిపోయింది. ఈ సినిమా ఎమోషనల్‌గా కావాల్సినంతగా లేదు. కానీ నిజాయితీని మాత్రం ఎప్పుడూ వదల్లేదు.

Read More
Next Story