ఇండియాకు ఆస్కార్ ఎందుకు రావటం లేదు?
x

ఇండియాకు ఆస్కార్ ఎందుకు రావటం లేదు?

అసలు కారణాలు ఇవే


గత కొంతకాలంగా ప్రపంచం మొత్తం మన సినిమాలను చూస్తోంది. గ్లోబుల్ బాక్సాఫీస్ వద్ద భారతీయ సినిమాలు బిలియన్లను కొల్లగొడుతున్నాయి. కానీ ఒక ప్రశ్న మాత్రం ఇప్పటికీ భారతీయ సినీ అభిమానులను వెంటాడుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా మార్కెట్ అయిన ఇండియా… ఆస్కార్ లో మాత్రం ఎందుకు వెనుకబడుతోంది?

2026 ఆస్కార్ అవార్డ్స్ మరోసారి అదే ప్రశ్నను ముందుకు తెచ్చాయి. భారత్ నుంచి ఎన్నో సినిమాలు పంపించినా… చివరి నామినేషన్ జాబితాలో ఒక్క భారతీయ సినిమాకు కూడా చోటు దక్కలేదు. ఇది యాదృచ్ఛికమా, లేక వ్యవస్థలో ఏదైనా సమస్య ఉందా? ఆస్కార్ చరిత్రలో ఇండియన్ సినిమాల ప్రయాణం చూస్తే చాలా ఆసక్తికరమైన నిజాలు బయటపడతాయి.

2026 ఆస్కార్ లో ఇండియన్ సినిమాలకు మరో నిరాశ

ఈ ఏడాది ఆస్కార్ కోసం భారత్ నుంచి సుమారు 24 సినిమాలు అధికారికంగా పంపబడ్డాయి. వాటిలో ముఖ్యంగా చర్చకు వచ్చిన సినిమాలు:

Homebound

Kantara: Chapter 1

Tanvi The Great

Mahavatar Narasimha

Tourist Family

Pushpa 2

The Bengal Files

ఈ సినిమాలు భారతదేశంలో మంచి స్పందన పొందినా, చివరి దశలో మాత్రం నామినేషన్ జాబితాలో ఒక్కటీ కనిపించలేదు.

ఇదేమీ కొత్త విషయం కాదు.

ఆస్కార్ చరిత్ర చూస్తే… ఇండియన్ సినిమాలు తరచుగా నామినేషన్ దగ్గరే ఆగిపోతూంటాయి. భారతీయ సినిమాల ఆస్కార్ ప్రయాణం 1958లో ప్రారంభమైంది. ఆ ఏడాది మెహబూబ్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన “Mother India”. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. అయితే చివరి క్షణంలో అవార్డు మాత్రం చేజారింది.

అదే విధంగా తరువాత కూడా కొన్ని ఆస్కార్ కు సినిమాలు నామినేట్ అయినా…

Salaam Bombay (1989)

Lagaan (2002)

ఇవన్నీ ఆస్కార్ దాకా వెళ్లి… చివరికి అవార్డు మాత్రం దక్కించుకోలేకపోయాయి. ప్రత్యేకంగా Lagaan కి అయితే అవార్డు ఖాయమని అప్పట్లో అనుకున్నారు.

భారత్ కు వచ్చిన మొదటి ఆస్కార్

భారతదేశానికి వచ్చిన మొదటి ఆస్కార్ 1983లో వచ్చింది. రిచర్డ్ అటెన్‌బరో రూపొందించిన “Gandhi” చిత్రానికి భాను అతయా

బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ గెలిచారు. అది భారతదేశానికి చారిత్రాత్మక క్షణం.

2009లో ఇండియాకు ఆస్కార్ పంట

2009లో వచ్చిన Slumdog Millionaire భారతదేశానికి భారీ గౌరవం తెచ్చింది. ఈ సినిమా ద్వారా: A.R. Rahman – రెండు ఆస్కార్లు Gulzar – ఉత్తమ పాట. Resul Pookutty – ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డులు అందుకున్నారు.

తెలుగు సినిమాకు వచ్చిన మొదటి ఆస్కార్ గౌరవం

2023లో SS Rajamouli తీసిన RRR చిత్రం చరిత్ర సృష్టించింది. “నాటు నాటు ” పాటకు: ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఆస్కార్ గెలిచారు. అదే ఏడాది The Elephant Whisperers కూడా బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలిచింది.

ఇండియన్ సినిమాలు ఎందుకు ఆస్కార్ గెలవడం కష్టం?

ఇది చాలా మంది అడిగే ప్రశ్న. దీనికి సినీ విశ్లేషకులు చెప్పే ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.

1. సరైన ఆస్కార్ క్యాంపెయిన్ లేకపోవడం

ఆస్కార్ అవార్డులు కేవలం సినిమా క్వాలిటీతోనే రావు. అందుకు భారీ లాబీయింగ్, మార్కెటింగ్, స్క్రీనింగ్ క్యాంపెయిన్లు అవసరం. హాలీవుడ్ స్టూడియోలు ఈ విషయంలో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాయి. భారతీయ సినిమాలు మాత్రం ఈ దశలో వెనుకబడతాయి.

2. అంతర్జాతీయ ప్రేక్షకులకు సరిపడే కథలు

మన సినిమాలు ఎక్కువగా స్థానిక ప్రేక్షకుల కోసం రూపొందుతాయి. కానీ ఆస్కార్ ఓటర్లు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. వారికి కనెక్ట్ అయ్యే కథలు చాలా ముఖ్యమవుతాయి.

3. ఎంపిక విధానంపై వివాదాలు

భారత్ నుంచి ఆస్కార్ కు పంపే సినిమాల ఎంపిక కూడా తరచూ వివాదాలకు కారణమవుతుంది.

కొన్ని సందర్భాల్లో: అంతర్జాతీయంగా మెచ్చుకున్న సినిమాలు పక్కన పడటం. రాజకీయ లేదా కమిటీ నిర్ణయాలు వంటి విమర్శలు వినిపిస్తుంటాయి.

4. గ్లోబల్ నెట్‌వర్క్ లో కొరత

హాలీవుడ్, యూరప్, లాటిన్ అమెరికా దేశాల సినిమాలకు ఆస్కార్ ఓటర్లతో బలమైన నెట్‌వర్క్ ఉంటుంది. ఇండియన్ సినిమాలకు ఆ స్థాయి కనెక్షన్ ఇంకా పూర్తిగా ఏర్పడలేదు.

ఇండియన్ సినిమాలు ఆస్కార్ గెలవాలంటే ఏం చేయాలి?

గ్లోబల్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని కథలు చెప్పడం. ఆస్కార్ క్యాంపెయిన్ కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం. అంతర్జాతీయ ఫెస్టివల్స్ లో ముందుగా సినిమాలను ప్రదర్శించడం. గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ పెంచడం. ఇవి చేస్తే భారతీయ సినిమాలకు ఆస్కార్ దూరం కాదు అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏదైమైనా

ప్రపంచ సినీ పరిశ్రమలో భారతీయ సినిమాల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. బాక్సాఫీస్ వద్ద మన సినిమాలు ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాయి. కానీ ఆస్కార్ వేదిక మాత్రం ఇప్పటికీ భారతీయ సినిమాలకు ఒక పెద్ద ఛాలెంజ్ గా ఉంది. అయితే RRR, The Elephant Whisperers వంటి విజయాలు ఒక విషయం మాత్రం నిరూపించాయి. సరైన కథ, సరైన ప్రచారం ఉంటే… ఇండియన్ సినిమాలు కూడా ఆస్కార్ వేదికపై చరిత్ర సృష్టించగలవు.

బహుశా త్వరలోనే ప్రపంచం ఇలాంటి ఓ ప్రశ్న అడగవచ్చు.

“ఈసారి ఆస్కార్ గెలిచిన భారతీయ సినిమా ఏది?” అని. ఆ రోజు కోసం ఎదురుచూద్దాం.

Read More
Next Story