
టాలీవుడ్‌కు ఇరాన్ యుద్ధం సెగ!?
యుద్ధం మిగిల్చిన చేదు నిజం!
సుదూర తీరాల్లో జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం.. మన తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేయబోతోందా? ఆ ప్రభావం నేరుగా మీ జేబుకు , మీరు చూసే సినిమాకు చిల్లు పెట్టబోతోందా? అవుననే అంటున్నాయి తాజా పరిస్థితులు!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం టెన్షన్‌లో ఉంది. ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు గ్లోబల్ ఎకానమీని షేక్ చేస్తున్నాయి. ఆయిల్ సప్లై, గ్యాస్ ధరలు, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు అన్నీ డొమినో ఎఫెక్ట్‌లో పడుతున్నాయి. ఈ షాక్ ఇప్పుడు టాలీవుడ్ వరకూ చేరే అవకాశం కనిపిస్తోంది.
సోషల్ మీడియాలో ఇప్పటికే ఒక టాక్ వైరల్ అవుతోంది “ఇంధనంపై ఆంక్షలు వస్తే… ఇంట్లోంచి బయటకి వెళ్లే వాళ్లు తగ్గిపోతారు”. అదే నిజమైతే…థియేటర్ కి వెళ్లే ఆడియన్స్ సంఖ్యం కూడా తగ్గిపోతుంది.
ఒకసారి ఆలోచించండి.. పెట్రోల్ లీటర్ ₹200 దాటితే , ఒక మధ్యతరగతి కుటుంబం థియేటర్‌కి వెళ్లడానికి పెట్రోల్ , టికెట్లు , పాప్‌కార్న్ అన్నీ కలిపి ₹1000 నుంచి ₹1500 ఖర్చు అవుతుంది. అదే డబ్బుతో ఒక వారం రోజులకు సరిపడా ఇంటి సరుకులు వస్తాయి. మరి ఆ సామాన్యుడు ఏది ఎంచుకుంటాడు? ఇక్కడే థియేటర్ బిజినెస్‌కు అసలు ప్రమాదం మొదలవుతుంది!
సుదూర తీరాల్లో జరుగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం.. మన కంటికి దూరంగా ఉన్నా , దాని ప్రభావం మన థియేటర్ టికెట్ కౌంటర్ దగ్గర కనిపించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది కేవలం ఒక యుద్ధం కాదు , టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను , ప్రేక్షకుల ప్రాధాన్యతలను మార్చేయబోతున్న ఒక పెను సంక్షోభం. కోవిడ్ సమయంలో థియేటర్లు ఎలా వెలవెలబోయాయో మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాటర్న్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. థియేటర్ అనేది ఒక 'లగ్జరీ'గా మారి , OTT అనేది ఒక 'అవసరం'గా మారబోతున్న తరుణమిది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కేవలం స్లంప్ కాదు , చిన్న సినిమాలకు ఇది 'ఎక్స్‌టింక్షన్ స్టేజ్' (అంతరించిపోయే దశ). మీడియం రేంజ్ సినిమాలు పూర్తిగా మాయం అయ్యే ప్రమాదం ఉంది. ఒకప్పుడు ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ అనేది ఒక ఎమోషన్ అయితే , ఇప్పుడు ‘OTTలో ఎప్పుడు వస్తుంది?’ అనేది ఒక లెక్కగా మారిపోయింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ₹100 కోట్ల బడ్జెట్‌తో సినిమాలు తీసే రిస్క్ ఏ నిర్మాత తీసుకుంటాడు? స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు తగ్గకపోతే ఇండస్ట్రీ నిలబడటం అసాధ్యం.
ముఖ్యంగా ఆడియన్స్ సైకాలజీ మారుతోంది. గతంలో వినోదం (Entertainment) మొదటి ప్రాధాన్యత అయితే , ఇప్పుడు బ్రతుకుదెరువు (Survival) మొదటి ప్రాధాన్యత అవుతోంది. పెట్రోల్ ధరల సెగ తగిలితే , ప్రజలు కేవలం ఇంట్లోనే కూర్చుని OTTలో సినిమాలు చూడటానికే మొగ్గు చూపుతారు. ఫలితంగా స్టార్ సిస్టమ్ కుప్పకూలి , కంటెంట్ ఉన్న చిన్న సినిమాలే మిగిలిపోయే అవకాశం ఉంది. హాలీవుడ్ ప్యాటర్న్ లాగా , కేవలం భారీ విజువల్ వండర్స్ మాత్రమే థియేటర్లకు వస్తాయి , మిగిలినవన్నీ డిజిటల్ స్క్రీన్లకే పరిమితమవుతాయి.
మొత్తానికి ఇరాన్-అమెరికా యుద్ధం అనేది కేవలం రాజకీయ అంశం కాదు , అది మన తెలుగు సినిమా భవిష్యత్తును శాసించే శక్తి. ఇది ప్రేక్షకుడి మైండ్‌సెట్ మారిపోతున్న రోజులకి సంకేతం. ఇక నుంచి సినిమా హిట్ అవ్వాలంటే.. కేవలం స్టార్ ఇమేజ్ ఉంటే సరిపోదు , అన్ని అడ్డంకులను , ఆర్థిక ఇబ్బందులను దాటుకుని ప్రేక్షకుడిని థియేటర్ వరకు లాక్కురాగల బలమైన 'కంటెంట్' కావాలి. పరిస్థితుల్ని జయించే కంటెంట్ లేకపోతే.. టాలీవుడ్ కు కష్టకాలం తప్పదు!

