
మోదీని కీర్తించిన ‘ధురందర్-2’ కు దక్షిణాదిలో ఆదరణ దక్కుతోంది ఎందుకు?
బీజేపీ పాలనను సమర్థిస్తూ ఉన్న సన్నివేశాలు, సంభాషణలు
కిరుభాకర్ పురుషోత్తమన్
హిందీ సినిమాలకు దక్షిణాదిలో ముఖ్యంగా తమిళనాడు, కేరళలో ఎప్పుడూ పెద్దగా ఆదరణ దక్కింది లేదు. ఇదే బాటలో బీజేపీకి కూడా ఇక్కడ పెద్దగా సీట్లు రాలేదు. అయితే ఇటీవల విడుదలైన ‘ధురందర్-2: ది రివెంజ్’ కు ఊహించిన దానికన్నా ఎక్కువ ఆదరణ దక్కుతోంది.
ఆదిత్యధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ కథానాయకుడిగా ఈ చిత్రం తెరకెక్కింది. దేశ వ్యాప్తంగా ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తూ వెయి కోట్ల క్లబ్ లో చేరడానికి ఉరకలు వేస్తోంది. ఈ చిత్రంలో పెద్ద నోట్ల రద్దుతో సహ అనేక అంశాలలో మోదీ ప్రభుత్వాన్ని కీర్తిస్తూ సన్నివేశాలు, సంభాషణలు ఉన్నాయి. దీనితో ఈ సినిమాను ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి.
అయితే ఇందులోని వైరుధ్యాన్ని గమనించకుండా ఉండలేం. చారిత్రాత్మకంగా బీజేపీని దూరంగా ఉంచిన రెండు రాష్ట్రాలు, అధికార పార్టీ భావజాల ముద్రలు ఈ చిత్రంలో ఉన్నాయని విమర్శకులు చెబుతున్న మాట. ఇదే ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలకు పరిశీలిస్తే..
జాతీయ చిత్రం
ఈ సినిమా దక్షిణాది ప్రదర్శనను అర్థం చేసుకోవాలంటే, 'ధురందర్ 2' మొత్తం విజయం స్థాయిని ముందుగా నిర్ధారించుకోవాలి. విడుదలైన తరువాత సోమవారం (మార్చి 23) నాడు, ధురందర్ 2 20,382 షోల ఆడటంతో ₹65 కోట్లు వసూలు చేసి, దాని దేశీయ నికర వసూళ్లను ₹500 కోట్ల మార్కును దాటింది.
ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ శాక్‌నిల్క్ ప్రకారం, ఐదు రోజుల తర్వాత, ఈ చిత్రం భారతదేశంలో ₹519.12 కోట్ల నికర వసూళ్లతో నిలవగా, ప్రపంచవ్యాప్త స్థూల వసూళ్లు ₹829.76 కోట్లకు చేరుకున్నాయి. దీనికి ముందు వచ్చిన, డిసెంబర్ 2025లో విడుదలైన ధురందర్, కూడా అన్ని రికార్డులను తిరగరాసి కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఇది డిసెంబర్ 26, 2025న ప్రపంచవ్యాప్తంగా ₹1,000 కోట్ల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన నాల్గవ హిందీ చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ₹1,350.83 కోట్లు వసూలు చేసి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా, ఆల్ టైం రికార్డులో రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది.
తమిళనాడులో పరిస్థితి ఎలా ఉంది..
తమిళనాడు ఈ సినిమా కథ తడబాటుతో మొదలయింది. సెన్సార్ క్లియరెన్స్ సమస్యలు, డబ్బింగ్ వెర్షన్ల డెలివరీలో ఆలస్యం కారణంగా అనేక తమిళ షోలు మొదట రద్దు చేశారు. చాలా కేంద్రాలలో ప్రేక్షకులకు డబ్బు వాపసు ఇవ్వడం లేదా బదులుగా హిందీ వెర్షన్ చూడమని కోరడం జరిగింది.
డబ్బింగ్ వెర్షన్‌కు సెన్సార్ క్లియరెన్స్‌లో పరిపాలనాపరమైన జాప్యం కారణంగా, సరైన తమిళ విడుదల మార్చి 21, మూడవ రోజు నుంచి మాత్రమే ప్రారంభమైంది. శాక్‌నిల్క్ ప్రకారం, డబ్బింగ్ ప్రదర్శనల మొదటి పూర్తి రోజున, ఈ చిత్రం 61% ఆక్యుపెన్సీ రేటుతో ₹2.95 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. ఆ తర్వాత నాల్గవ రోజున 53% ఆక్యుపెన్సీతో ₹2.50 కోట్లు వసూలు చేసింది. దీని రెండు రోజుల డబ్బింగ్ మొత్తం ₹5.45 కోట్ల మార్కును దాటింది.
బాలీవుడ్ చిత్రాలపరంగా చూస్తే షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమా తమిళనాడులో అత్యధికంగా రూ. 30 కోట్లను వసూలు చేసింది. రెండో స్థానంలో ఆమీర్ ఖాన్ నటించిన దంగల్ (రూ. 11.48) ఉంది. సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ‘ధురందర్-2’ వాటికి గట్టి పోటీ ఇస్తుందని అనుకుంటున్నారు.
ఈ న్యాయపరమైన వివాదం విచిత్రంగా సినిమాకు మరింత ప్రచారం కల్పించింది. చిత్రంలోని రాజకీయ అంశాలను ఉటంకిస్తూ, తమిళనాడులో సినిమా విడుదలను పూర్తిగా నిషేధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలు అయ్యాయి.
ప్రముఖ నిషేధ పిలుపులను ఎదుర్కొంటున్న చిత్రాలు తరచుగా వ్యతిరేక ప్రభావాన్ని అనుభవిస్తాయని, అంటే న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయిన తర్వాత ప్రజల ఉత్సుకత అధిక సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షిస్తుందని వాణిజ్య పరిశీలకులు పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఈ చిత్రానికి బహిరంగంగా మద్దతు తెలపడం, దానికి తోడు నిషేధ వివాదం కలసి 'ధురందర్ 2'కు రాష్ట్రంలో మంచి ప్రచారం కల్పించాయి. డబ్బింగ్ వెర్షన్ రాకముందే తమిళనాడులో ఈ సినిమాకు లభించిన ఆదరణపై ట్రేడ్ అనలిస్ట్ రమేష్ మాట్లాడుతూ.. “ధురందర్ మొదటి భాగం తమిళ భాషలో విడుదల కాకపోయినప్పటికీ, దాని రీల్స్, మీమ్స్ కారణంగా ఈ సినిమాకు ఆదరణ లభించింది.
ఆ తర్వాత ప్రజలు నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి భాగాన్ని వెతికారు. దీనికి తోడు, రెండవ భాగం వెంటనే విడుదలైంది. సాధారణంగా, సీక్వెల్ ఒకటి లేదా రెండు సంవత్సరాల తర్వాత వస్తుంది, కానీ ధురందర్ 2 కొన్ని నెలల్లోనే విడుదలైంది. ప్రజలు ఇంకా మొదటి భాగం గురించే మాట్లాడుకుంటున్నారు, అది ఈ ఊపుకు సాయపడింది,” అని ఆయన అన్నారు.
కేరళలో పరిస్థితి ఏంటీ?
కేరళలో పరిస్థితి మరోలా ఉంది. రాష్ట్రంలో పంపిణీ భాగస్వామి అయిన M/S 1895 స్టూడియోస్ భాగస్వామి సూరజ్ సురేంద్రన్, ఈ సినిమాను విడుదల చేసే విధానం కేరళలో సాంప్రదాయకంగా హిందీ చిత్రాలను నిర్వహించే విధానానికి ప్రాథమికంగా భిన్నంగా ఉందని చెప్పారు.
"కేరళ వ్యాప్తంగా వందలాది స్క్రీన్లలో ఒక హిందీ చిత్రం విడుదల కావడం ఇదే మొదటిసారి, ఇది ఒక రికార్డు. కొన్ని స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించబడుతున్నప్పటికీ, ఈ చిత్రం రెండవ వారంలో కూడా బాగా ఆడుతోంది. ఇక్కడ విడుదలైన చాలా హిందీ చిత్రాల కంటే ఈ చిత్రం ఎందుకు ఇంత బాగా ఆడిందని నన్ను అడిగితే, దానికి కారణం మేము ఈ చిత్రాన్ని కేరళలోని ప్రతి మూలకూ విడుదల చేసేలా చూసుకోవడమే.
దీనిని ఒక స్థానిక మలయాళ సినిమా లాగా విడుదల చేశాము. దీనికి ముందు, ఇలాంటి చిత్రాలన్నీ పరిమితంగానే విడుదలయ్యేవి," అని సూరజ్ 'ది ఫెడరల్'కు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100 స్క్రీన్లలో, సరిహద్దు ప్రాంతాల్లో అదనంగా 20 స్క్రీన్లలో మలయాళ వెర్షన్‌ను ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. ఖచ్చితమైన బాక్సాఫీస్ సంఖ్య ఇంకా వెలువడనప్పటికీ, మొదటి వారం మొత్తం ఈ చిత్రం మంచి ఆక్యుపెన్సీని కొనసాగించిందని ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక హిందీ చిత్రానికి ఇది ఒక అరుదైన ఘనత.
సినిమాలో రాజకీయాలు.. హాలు బయట రాజకీయాలు..
‘ధురందర్ 2’ దక్షిణాది ప్రదర్శనపై తలెత్తుతున్న అత్యంత కీలకమైన ప్రశ్నపెద్ద నోట్ల రద్దుతో సహా మోదీ ప్రభుత్వ విధానాలను కీర్తిస్తోందని విస్తృతంగా ప్రచారం జరగడం. బీజేపీ రాజకీయ విస్తరణను నిరంతరం ప్రతిఘటిస్తున్న తమిళనాడు, కేరళలలో ఇది కొద్దిమేర ప్రేక్షకులను సంపాదించుకుంది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రముఖ మలయాళ సినీ విమర్శకుడు మాట్లాడుతూ.. “ఇది ఆలోచించాల్సిన అవసరం లేని విషయం. ఒక సినిమాలో ప్రచారం లేదా సూక్ష్మమైన రాజకీయాల గురించి ప్రజలు పట్టించుకోరు. అది వినోదాత్మకంగా, సరదాగా ఉంటే, వారు థియేటర్‌కు పోటెత్తుతారు.
యానిమల్, పుష్ప వంటి చిత్రాలు విడుదలైనప్పుడు కూడా, ఆ చిత్రాలు హింసాత్మకంగా, జాతీయ అహంకారపూరితంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కానీ ప్రజలు వాటిని విజయవంతం చేశారు, ఎందుకంటే, వారికి అవి వినోదాత్మకంగా అనిపించాయి.
ఇదే సూత్రం ధురందర్‌కు కూడా వర్తిస్తుంది. ఇది ఆసక్తికరంగా ఉండటం వల్లే బాగా ఆడుతోంది.” ఈ వాదనకు బలం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ, సినిమాలోని రాజకీయ అంతరార్థంపై విమర్శనాత్మక చర్చ ఎక్కువగా మేధావులు, కార్యకర్తల వర్గాలకే పరిమితమైంది.
మల్టీప్లెక్స్‌లో లెక్క మరింత సులభం. రాజకీయ హద్దులను దాటేంత ఆసక్తికరంగా ఉన్న 'ధురందర్ 2', ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఉండే మార్కెట్లలోకి అదే భావజాలాన్ని తీసుకువెళ్లిన మొదటి బాలీవుడ్ చిత్రం కాదు – 'కేరళ స్టోరీ' గుర్తుకు వస్తుంది.
కానీ ఈ స్థాయిలో బాక్సాఫీస్ విజయాన్ని సాధించిన కొన్ని చిత్రాలలో ఇది ఒకటి కావచ్చు. కేరళలో పంపిణీ బలం, ప్రీక్వెల్ స్ట్రీమింగ్ ప్రజాదరణతో సోషల్ మీడియాలో వచ్చిన ఊపు, తమిళనాడులో రజనీకాంత్ మద్దతు, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే వంటి అంశాల కలయిక, రాష్ట్ర సరిహద్దుల వద్ద అనేక హిందీ చిత్రాలను నిలిపివేసిన అడ్డంకులను ఈ చిత్రం అధిగమించడానికి దోహదపడింది.
Next Story

