కంగన కు ఇవి  “ఎమర్జెన్సీ” రోజులు, బీజేపీ కూడా సపోర్ట్ ఇచ్చేలా లేదు
x

కంగన కు ఇవి “ఎమర్జెన్సీ” రోజులు, బీజేపీ కూడా సపోర్ట్ ఇచ్చేలా లేదు

ఒక టైంలో కంగన అంటే ఫైర్ బ్రాండ్ . క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది .

ఒక టైంలో కంగన అంటే ఫైర్ బ్రాండ్ . క్వీన్, మణికర్ణిక లాంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో బాలీవుడ్లో తిరుగులేని స్థాయిని అందుకుంది . ఆమెకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. కానీ కొంతకాలం నుంచి తన ఇమేజ్ ని తానే పాడు చేసుకునేటట్లుగా కంగనా వ్యవహించటం మొదలెట్టింది. దాంతో కంగనా సక్సెస్‌ను తలకెక్కించుకుని.. అనవసర వివాదాల్లో తలదూర్చి, అతిగా మాట్లాడ్డం చేస్తోందని మీడియాలో ప్రచారం మొదలైంది. అసలే ఆమెకు మీడియా లోనూ , ఇండస్ట్రీలోనూ ఓ వర్గం వ్యతిరేకం. దాంతో కంగనాకు చాప క్రింద నీరులా... ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరగటం మొదలైంది. అసలే బాలీవుడ్ సినిమాల పరిస్దితి బాగోలేదు. ఆ ఇంపాక్ట్ కంగనా సినిమాలపైన కూడా పడింది. ఆమె సినిమాలకు కొన్నేళ్ల నుంచి మినిమం ఓపెనింగ్స్ కూడా ఉండట్లేదు.

ఆ మధ్యన ధకడ్ అనే సినిమా మీద వంద కోట్ల బడ్జెట్ పెడితే ఒక్క షోకే పరిమితమై , టోటల్ కలెక్షన్స్ ఐదు కోట్లు కూడా రాని పరిస్థితి. కొద్దిలో కొద్ది ఊరట రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అవటమే. అయితే ఆమెను ఇప్పుడు బీజేపీని సైతం ఆమె ఇరకాటంలో పడేసింది తన తాజా చిత్రంతో. కంగన ప్రెస్టీజియస్ మూవీ ‘ఎమర్జన్సీ’ అయితే వాయిదాల మీద వాయిదాలు పడుతూ విడుదలకే నోచుకోవట్లేదు. జీ స్టూడియోతో కలిసి సొంతంగా ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా స్వయంగా దర్శకత్వం వహించారు కంగనా.

‘ఎమర్జెన్సీ’ చిత్రం తీస్తున్నట్లు 2021లో కంగనా ప్రకటించినప్పటి నుంచీ ఈ సినిమాకు చిక్కులే. ఇందులో ఆమె మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రను పోషించారు. ఇది ఇందిరాగాంధీ బయోపిక్‌ కాదనీ, ఓ పొలిటికల్‌ డ్రామా అని ఎన్నో సార్లు కంగనా వెల్లడించానా వివాదాలు ఈ సినిమాను వదల్లేదు. ఎన్నో అవరోధాలు తట్టుకుని, విడుదలకు సిద్ధం చేస్తే ఇప్పుడు సిక్కుల నుంచి కంగనాకు ప్రతిఘటన ఎదురైంది. తమ ప్రభుత్వమే కేంద్రలో అధికారంలో ఉన్నా సెన్సార్ సమస్యలు తప్పటం లేదు. అందుకు కారణం ఈ సినిమా వల్ల బీజేపీకు కూడా సమస్యలు వస్తాయని భావించటమే.

వాస్తవానికి మొదట ఈ సినిమాకు బీజేపీ మంచి సపోర్ట్ అందిస్తుందని అందరూ భావించారు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఇంతకాలం అయినా ఇప్పటికీ దాన్ని విపత్తుగా బీజేపీ ప్రచారం చేస్తోంది. అందులో భాగంగానే ఎమర్జెన్సీ వ్యతిరేక దినాన్ని కూడా ప్రకటించారు . అందుకే బీజేపీ నేతలు ఈ సినిమాకు సపోర్ట్ ఇస్తారని అందరూ భావించారు. ఇందులో కంగనా రనౌత్ ఇందిరాగాంధీగా నటించటం కలిసి వస్తుందని ఇదో ప్రాపగాండ సినిమా అవుతుందని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల చేయకపోవడమే మంచిదని బీజేపీ భావిస్తోందని తెలుస్తోంది.

బీజేపీకు ‘ఎమర్జన్సీ’సమస్యలు తెచ్చిపెడుతోందా

‘ఎమర్జన్సీ’ సినిమా చరిత్రను వక్రీకరించటమే గాక తమను దేశద్రోహులు, ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, అది తమపై విద్వేషాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున ఆ చిత్రంపై నిషేధం విధించాలంటూ దేశవ్యాపితంగా సిక్కులు డిమాండ్‌ చేస్తున్నారు. ఖలిస్తాన్‌ మద్దతుదార్లు కంగనను చంపివేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో 2024 సెప్టెంబరు ఆరున విడుదల తేదీని ప్రకటించిన కంగన ఇప్పుడు దానికి సెన్సార్‌ బోర్డు ఆమోదం తెలిపినా కొందరి ఒత్తిడి కారణంగా సెన్సార్ సర్టిఫికేట్ నిలిపివేశారని చెబుతున్నారు. బిజెపికి ఇప్పటికిప్పుడు దేశంలో ఉన్న మూడు కోట్ల మంది సిక్కులు వ్యతిరేకంగా మారాలనుకోదు. ఈ సినిమాతో వారు మరింత దూరమౌతారని, పక్కా వ్యతిరేకులుగా మారతారని ఆ పార్టీ భయపడటంలో ఆశ్చర్యం ఏమీ లేదు.

అక్టోబరులో జరిగే హర్యానా, కాశ్మీరు ఎన్నికలపై ఈ సినిమా వల్ల ప్రతికూల ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. గతంలో బిజెపి మిత్రపక్షంగా ఉన్న అకాలీదళ్‌ కూడా అదే డిమాండ్‌ చేసింది. సిక్కుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ‘ఎమర్జన్సీ’ చిత్రం ఉందనీ, సిక్కులకు వ్యతిరేకంగా రూపుదిద్దుకున్న ఈ సినిమాను వెంటనే బ్యాన్‌ చేయాలనీ, విడుదల చేయడానికి వీల్లేదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ (ఎస్‌జీపీసీ) అకల్‌ తక్త్‌ డిమాండ్‌ చేశాయి. ఎస్‌జీపిఎస్‌ ఛీఫ్‌ హర్‌జిందర్‌ సింగ్‌ ధామి ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి కంగనను తీవ్రంగా విమర్శించడమే కాకుండా ఆమెపై కేసు పెట్టాలని కూడా కోరారు. సిక్కులను వ్యతిరేకించే సన్నివేశాలు ఈ మధ్య సినిమాల్లో ఎక్కువ అయ్యాయనీ, అందుకే సెన్సార్‌బోర్డ్‌లో సిక్కులకు కూడా తగినంత ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.

ఈ విషయమై ముంబై హైకోర్టును ఆశ్రయించారు కంగనా. కంగనా పిటిషన్‌ను స్వీకరించిన ముంబై హై కోర్టు కంగనాకు గట్టి షాక్‌ ఇచ్చింది. సినిమాపై చాలా వర్గాల నుంచి పలు ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ జరిగిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలిపింది. అంతే కాదు, సినిమాకి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సిందిగా కేంద్ర సెన్సార్‌ బోర్డును తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సర్టిఫికెట్‌ జారీ చేసే విషయంలో సెప్టెంబర్‌ 18లోపు ఒక నిర్ణయం తీసుకోవాలని సెన్సార్‌ బోర్డుకు సూచించింది. దీనికి సంబంధించిన విచారణను సెప్టెంబర్‌ 19కి వాయిదా వేసింది హైకోర్టు.

మరో ప్రక్క ఆ సినిమా ప్రదర్శనను అనుమతించకూడదని తెలంగాణా సిక్కు సామాజిక తరగతి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఏ రేవంతరెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ సినిమాకు బిజినెస్ పరంగా పెద్దగా క్రేజ్ లేదు, ట్రైలర్ , టీజర్స్ తో మినిమం బజ్ క్రియేట్ కాలేదు ఈ మూవీ మీద. దీనికి తోడు వివాదాలు కూడా ఈ చిత్రాన్ని వెంటాడుతున్నాయి.

కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారు. మరి ఎప్పటికి ఈ చిత్రానికి మోక్షం లభిస్తుందో?

Read More
Next Story