
కాంచీవరం సినిమా మన మనసుల్లో ఎందుకలా మిగిలిపోతుంది?
నన్ను వెంటాడిన సినిమాలు-2 (ఫిల్మ్ క్రిటిక్ రామ్ సి మూవీ కాలమ్)
మనిషి జీవితంలో పట్టుకు ఓ శోభయామాన ప్రత్యేకత ఉంటుంది. అది మానవుడి ఓ శ్రేయస్కరమైన ఆలోచనకు, ఆవిష్కరించిన ప్రయత్నానికి దొరికిన ఫలితం. మనిషి చేసుకుంటున్న సంబరానికి ప్రతిబింబం. ఓ శ్రేష్ఠతను సూచిస్తుంది. ఆ పట్టు వస్త్రం ముఖ్యంగా పుట్టుకతో మొదలై చావు వరకు , జీవితంలోని అన్ని సందర్బాల్లోనూ చాల ప్రాముఖ్యతను సంతరించుకొంది. పట్టు వస్త్రం అనగానే యావద్ భారతానికి గుర్తొచ్చేది కంచి పట్టణం. కానీ ఓ సమయంలో ఈ పట్టు అందరికి అందుబాటులోని వస్తువు కాదు. కొన్ని తరాలకు పొందే అవకాశమే లేదు. ఆ వస్త్రాలు నేసె వారికే అది ప్రాప్తం లేని వర్గం. అందని కల అది. ఆ కల సాక్షాత్కరించకుండానే కొన్ని తరాలు సాగిపోయాయి అనే చేదు నిజం జీర్నించుకోవడం చాల కష్టం.
మా చిత్తూరుకు పక్కనే ఉండే కంచికి వెళ్లి అన్ని సందర్భాలకు వస్త్రాలు తెచ్చుకోవడం ఒక సాధరణ సంగతి అందరికి. అందరి కధలు కంచికి చేరుతాయంటారు కదా, మరి, కంచి వాళ్ళ కధలు ఎక్కడికి చేరుతాయి. వెంకటం లాంటి వారి వ్యధలు ఎలా తెలుస్తాయి. కానీ ఈ 'కాంచీవరం' (Kanchivaram 2008) సినిమా ఇంత సులువుగా పొందుతున్న తరానికి ముందు పరిస్థితులు ఎలా ఉండేది అని తెలుసుకోవడం, నాకు ఓ గొప్ప అవకాశంగా భావించాను.
పట్టు ఓ పురుగు అందించే ఈ లీలా వస్త్రం, పురుగుల్లా పట్టిన మానవ సమాజంలోని కొన్ని వర్గాలు చేసే దోపిడీ ప్రకృతికే జరిగిన అవమానం. ఇలా కట్టుకొని, ఆలా విడిచే వస్త్రం కాదు పట్టు, అదో కళకు నిలయం. Pride and prestigious possession. ఆ నాటి వికృత వ్యాపార, పెట్టుబడి వ్యవస్థలు మానవాళికి అద్దిన కళంకం.
కొందరు దర్శకులు కొన్ని రకాలైన సినిమాలకే ప్రఖ్యాతి చెంది ఉంటారు. ప్రియదర్శన్ కామెడీ,డ్రామాలకు పెట్టింది పేరు. మలయాళీ అయినా, హిందీ తమిళ్, తెలుగులో అటువంటి సినిమాలే తీసిన చరిత్ర ఉన్నవాడు. అందుకు భిన్నంగా, ఎవ్వరి ఊహకు కూడా అందకుండా 2008 లో 'కాంచీవరం' అని సినిమా తీసాడు.
కాంచీవరం అనేది భావోద్వేగపూరితమైన, సామాజికంగా చైతన్యాన్ని కలిగించే చిత్రం, భారతీయ చలనచిత్ర రంగంలో ఒక అపూర్వ ఘట్టాన్ని ఆకృతీకరించిన వెండితెర నట వైభవం. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్వాతంత్ర ముందు నాటి 1940ల కాలం నాటి కాంచీపురం పట్టణం నేపథ్యంలో, ఈ కథ అందమైన పట్టుచీరలను నేసే కులపోళ్ల జీవితాన్ని వివరిస్తుంది.
వెంకటం అనే ఓ నేతగాడు, తన కూతురు నామకరణం రోజున, వచ్చిన బంధువులు 'ఇంత అందమైన అమ్మాయికి ఏమిస్తున్నావ్' అని తమాషాగా అడిగిన దానికి, కూతురు పుట్టిందన్న పట్టలేని ఆనందంలో, ఆ పిల్ల పెళ్లికి అందమైన పట్టుచీరనిచ్చి అత్తారింటికి సాగనంపుతానని శపధం చేస్తాడు. అందరు ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటారు.దీని సాద్య సాధ్యాలను తెలిపే కథే మూలసారం. అందుకు వెంకటం ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడు, వాటి పర్యవసానాలేవి ఎదుర్కొన్నాడు. అతని చుట్టూ ఉండే ఆ కలం నాటి పరిసితులు, ఎలా చేస్తాడు అని ఉత్సుకతతో ఉండే సమాజం, చిన్నప్పట్టి నుండి ఆ పిల్ల ఈ శపధం మూలాన ఊళ్ళో ప్రత్యేకత సంతరించుకోవడం, చివరకు వారి కథ కంచికి చేరిందా.లేదా ?!
అయితే, కులవ్యవస్థ, ఆర్థిక అన్యాయాలు, శ్రమదోపిడి వంటి సంఘటనలు అతని జీవితాన్ని మార్చివేస్తాయి.ఈ చిత్రంలో ప్రియదర్శన్, ఆయన ప్రత్యేకమైన కథనాశైలితో, విభిన్నమైన భావోద్వేగాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఆ దృశ్యాలు, భిన్నమైన కాలపరిమితిని ప్రతిబింబించే వాతావరణంతో, సినిమా తన ప్రత్యేకమైన వాస్తవికతను కలిగి ఉంటుంది. ప్రకాశ్ రాజ్, ఓ సామాన్య కార్మికుడి స్వభావాన్ని, భయాన్ని, ఆశలను, ప్రయత్నాలను, విఫలతను హృద్యంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా అతని మౌనం, బాధతో నిండిన చూపులు, సాంఘిక పరిస్థితుల కారణంగా వచ్చే అసహాయత ఈ సినిమా గుండెలను హత్తుకునేలా చేస్తాయి.
ఈ చిత్రం సాంఘిక స్థితిగతులను మిళితం చేస్తూ, నేతగాళ్ల జీవితం ఎంత అమానుషంగా మారిపోయిందో, శ్రమ మరియు సంపద మధ్య ఉన్న విస్తృత అంతరాన్ని ఎలా చూడాల్సి వస్తుందో స్పష్టంగా చూపిస్తుంది. వెంకటం జీవితమంతా తన కూతురి పెళ్లికి ఒక అందమైన చీరను నేయాలని కలలు కంటాడు, కానీ అది అసాధ్యమైన స్వప్నంగా మిగిలిపోతుంది.నిజాన్ని అర్థం చేసుకున్నప్పుడు, సినిమా మరింత మానసిక స్థాయిలో భావోద్వేగాలను కలిగిస్తుంది. చివరికి, నిస్సహాయత అతనిని మరొక మార్గాన్ని ఎంచుకోవడానికి దారి తీస్తుంది. కానీ, అతని కథ ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు, ఒక తరానికి చెందిన నిస్సహాయతకు నిదర్శనం. కాంచీవరం చూడగానే అది మనసులో నిలిచిపోతుంది, కానీ దాన్ని మళ్లీ చూడటానికి ధైర్యం కావాలి, ఎందుకంటే ఈ సరి మనం ప్రేక్షులం కాదు, ఆ పాత్రలతో మమేకమైన వారం. అది కేవలం ఒక సినిమా కాదు, ఒక గాఢమైన నిజాన్ని ఎదుర్కొనే అనుభవం.
ఈ క్లైమాక్స్ ప్రేక్షకుడిని నిస్తేజం ఆవరిస్తుంది,ఆలోచింపజేసేలా చేస్తుంది. ఆ సన్నివేశాల్లో చివరిగా వెంకటం నవ్వే ఓ నవ్వు మనల్ని కృంగదీస్తుంది.
తలచుకున్నప్పుడంతా కంపించేస్తుంది. అన్యాయాన్ని, వారి శ్రమను గౌరవించని వ్యవస్థను ఈ ముగింపు ఓ శక్తివంతమైన విమర్శగా నిలుస్తుంది. వెంకటం జీవిత పోరాటం చివరకు ఒక విషాద గాథగా ముగిసినప్పటికీ, అతని ఆత్మసమ్మానం, తన కల కోసం చేసిన త్యాగం ప్రేక్షకుడి గుండెను ఎంతగానో కలచివేస్తుంది. వెంకటం కష్టాన్ని చూసి ఎంత మూగగా రోధించానో, నా కళ్ళకు తెలుసు. కాంచీవరం మన మనసుల్లో మిగిలిపోతుంది. ఆ వేదనను మళ్లీ ఒకసారి చూసి తట్టుకోవడానికి ధైర్యం కావాలి. మనిషిగా నేనా పని చేయలేను.
నేనిప్పటికీ నా కోసం ఎప్పుడూ పట్టును కొనలేదు, కొంటే వెంకటంను మోసం చేసిన అనుభూతి కలుగుతుంది నాకు.