పుష్ప 2: సినిమా మార్కెట్ లో ఎందుకంత సంచలనం!
x

పుష్ప 2: సినిమా మార్కెట్ లో ఎందుకంత సంచలనం!

ఆశ అత్యాశగా మారితే ఏమవుతుంది? డిసెంబర్ 5న తేలుతుంది

నిజానికి 2021 లో పుష్ప పార్ట్ 1 విడుదల అప్పుడూ ఇంత క్రేజ్ ఈ సినిమా (Pushpa 2: The Rule) కు లేదు. అందులోనూ అప్పుడే జనాలు కోవిడ్ నుండి తేరుకున్న సమయం కూడా కావడం పుష్పకు కలిసొచ్చింది కూడా. అందులోనూ అల్లు అర్జున్ సినిమాలకు మెగా ఫ్యాన్స్ వల్లే ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయన్నది అప్పట్లో మాత్రం ఒప్పుకోవాల్సిన విషయమే! తెలుగు రాష్ట్రాల్లో కన్నా కూడా ఈ సినిమా నార్త్ లో మంచి టాక్ తెచ్చుకోవడం, హిందీ ప్రేక్షకుల జనాభా ఎక్కువ ఉండటంతో ఇక ఇప్పటి పార్ట్-2 మీద ఏ సినిమాకి లేని అంచనాలు పెరిగాయి. కానీ ప్రతిసారి సినిమాలకు అంచనాలు కలసి రావాల్సిన అవసరం కూడా లేదు. అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ మధ్య కొంత విబేధాలు ఉండటం వల్ల కొంత అల్లు అర్జున్ (Allu Arjun) ఒక రాజకీయ అభిమాన వర్గం నుండి సపోర్ట్ గణనీయంగా పెరిగింది. అలాగే ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమాకు చేయని రీతిలో పాట్నాలో చేయడం మాత్రం ఎవ్వరూ ఊహించని విషయం. కొంత రాజకీయాల కేంద్రంగా ఈ సినిమా మారడానికి కారణం ఈ ప్రమోషన్స్ కూడా. సరే ,ఇదంతా హైప్, అభిమానం,అంచనాల వచ్చిన ఆదరణ మాత్రమే.....కానీ ఇవేవీ కూడా పుష్ప మాసివ్ హిట్ ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేయలేవు.ఎందుకో ఇప్పుడు చూద్దాం.

ప్రిక్వెల్ నుండి సీక్వెల్ దాకా:

పుష్ప ప్రిక్వెల్ వచ్చిన సమయం 2021 డిసెంబర్. అప్పటికీ భారతీయ సినిమాల్లో ఆ కథ కొత్తది కాకపోయినా, కొంత సుకుమార్ (Director Sukumar) ‘హీరో మానరిజం’, ఫాహద్ ఫాజిల్ లాంటి విలన్ ఉండటం; పాటలు అప్పటి నుండి ఇప్పటి వరకూ కూడా మార్మోగుతూ ఉండటం; ఇవన్నీ కూడా సినిమాను ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేశాయి.

కానీ 2022 నుండి 2024 మధ్యలో ప్రేక్షకుల అంచనాలు పెరిగాయి. ఓటిటీల పుణ్యమా అని జాతీయ,అంతర్జాతీయ సినిమాల స్టోరీస్ మీద కూడా కొంత అవగాహన పెరిగింది. ప్రిక్వెల్ లో ఉండే కొత్తదనం సీక్వెల్ లో ఉండదు. అందులోనూ ‘మైక్రో అనాలసిస్’ లు పెరిగిపోయాయి. పుష్ప2 (Pushpa 2: The Rule) ట్రైలర్ ను ఇప్పటికే అనేక యూట్యూబ్ చానల్స్ లో తాము ఊహించే స్టోరీ లైన్ తో రివ్యూలు కూడా తేల్చేసినట్టే చెప్పేసాయి. అందులోనూ ట్రైలర్ లో ‘పెళ్ళాం మాట వింటే ఎట్టా ఉంటుందో సూపిస్తా’ అన్న డైలాగ్ తో కొంత హింట్ ఇచ్చేశారు సినిమా టీం.

ఇక పుష్ప-1 సమయానికి దాని స్థాయి కొంత తక్కువ ఉండటం వల్ల స్టార్ కాస్టింగ్ ఇప్పటి స్టార్ సినిమాల్లో లా లేకపోయినా నడిచిపోయింది.అలాగే ఫాహద్ ఫాజిల్ ఈ పార్ట్ లో కూడా విలన్ అయ్యి ఉన్నా, అదే మంగళం శీను లాంటి విలన్స్ తో స్టోరీ ని లాగించి, వాటికి శ్రీవల్లి లేదా అమ్మ ఎమోషన్ పెట్టినా; పెద్ద కిక్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇవన్నీ ప్రేక్షకులు ఊహించినవే కనుక. ఇంతకు మించి అంతర్జాతీయ స్థాయికి పుష్ప జర్నీని విస్తరించినా, ఆ స్థాయిలో లాజికల్ గానో లేక సెన్సిబుల్ గానో ఒప్పించేలా తీయలేకపోతే మెప్పించడం కష్టమే. అందులోనూ నార్కోస్ లాంటి ఎన్నో సిరీస్ లలో ఇలాంటి కథలు ప్రేక్షకులు చూసేసి ఉన్నారు. అందులోనూ ఇప్పుడు పెరిగిన అంచనాల రీత్యా కథ మామూలుగా ఉంటే మాత్రం దానితో ప్రేక్షకులు హ్యాపీ ఫీల్ అయ్యే అవకాశాలు తక్కువ.

పాటలు ‘పుష్ప2’ కు కలిసి రాలేదా?

ఇకపోతే పుష్ప లోని ఐటెమ్ సాంగ్ సమంత చేయడం మొన్నీ మధ్య వరకూ కూడా ఒక హాట్ టాపిక్ లానే నడిచింది. ఆ లిరిక్స్ లో బూతులు లేవు, కొంత మగవాళ్ళ మనస్తత్వాన్ని చెప్పే కొన్ని ‘ప్రోవోకింగ్ స్టేట్మెంట్స్’ లా ఉన్నాయి. ఆ పాట పాడిన మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి ఎక్కడికి వెళ్ళినా అదే పాట పాడించారు.అలాగే ‘సామి ...సామి’ ,’శ్రీవల్లి ‘, టైటిల్ సాంగ్ ...అన్నీ కూడా కాలంతో పాటు ప్రేక్షకులు మర్చిపోలేదు. ఇప్పటికీ అవి ‘ఆల్ టైమ్ హిట్స్’ గా నిలిచిపోయాయి. అందులోనూ ఈ పాటల్లో పుష్పరాజ్ ఒక సామాన్యుడు కానీ తెగువ ఉన్నవాడు. పాత్ర కేరెక్టర్, మేనరిజం,కొంత కథ .. గొప్ప మ్యూజిక్ ...ఇవన్నీ కూడా ఆ పాటలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

‘పుష్ప-2’ లో పాటల్లో కొంత హడావుడి కనిపించింది. శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ గాని, పీలింగ్స్ పాట కానీ ఓ రకంగా బూతు పాటలే. ఆ ‘శ్రీవల్లి-పుష్ప’ కనిపించలేదు ఈ పాటల్లో. పుష్ప 1 కి దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ స్థాయికి, ఇప్పటి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ స్థాయికి వ్యత్యాసం కొట్టిచ్చినట్టు కనిపిస్తుంది.

టికెట్ రేట్లు:

ఆశ ఉండొచ్చు ....కానీ అత్యాశ మాత్రం ఉండకూడదు.

ఈ సంవత్సరం 3 డి సినిమాగా వచ్చిన పెద్ద సినిమా కల్కి టికెట్ కూడా 350 అది 3డి లో. కానీ పుష్ప టికెట్ రేట్లు మాత్రం అమాంతం పెరిగిపోయాయి. ముందు రోజు షోలకు దాదాపు టాక్స్ లతో కలిపి 1300 పైనే ఉంటే;ఇక మామూలు టికెట్ ధరే 550 దాకా ఉంది. ఎంత వైల్డ్ ఫైర్ అయినా ప్రేక్షకుల జేబులు కాల్చకూడదు కదా! సినిమా రేటు అందే స్థాయిలో ఉంటే సినిమా అటూ ఇటూ ఉన్నా కొంత అభిమానంతో పాజిటివ్ టాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రేక్షకుడికి నచ్చకపోతే మాత్రం, తను పెట్టిన డబ్బుల గురించి తప్పక ఆలోచిస్తాడు. ఈ కోణంలో ఆలోచిస్తే ఇది ఓ రకంగా పుష్పకి దెబ్బే!

హైప్ వేరు, వాస్తవం వేరు. సినిమా చూడాలనుకున్న ప్రతి ఒక్కరూ థియేటర్ లో చూస్తే ఈ హైప్ సినిమాకు ప్లస్ అవుతుంది. ఆ పరిస్థితి ఎప్పుడూ ఉండదు.అందులోనూ పుష్ప 2 ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మెప్పించే స్థాయిలో ఉంటే మెరుగే.అలాగే కథ ప్రేక్షకుల ఊహకు అందకుండా ఉన్న ఓకే. అలాగే సుకుమార్ డైరెక్షన్ లో ఉండే బలమైన ఎమోషన్ ఏదో ఒకటి ఉన్న కూడా పుష్ప అంచనాలను అందుకోవచ్చు. కానీ ఇప్పటికే స్పెషల్ షోలకి బయ్యర్స్ ఆసక్తి చూపకపోవడం కూడా ఒక సవాలే.కొంత పెంచిన టికెట్ ధరల దృష్ట్యా, కొంత కృత్రిమంగా కూడా కనిపిస్తున్న ప్రచారం వల్ల కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ బావుండొచ్చు. కానీ ఆ తర్వాతి దశ మాత్రం ప్రేక్షకుల జడ్జ్ మెంటే.

ఇప్పటి వరకూ సుకుమార్ సినిమాల లెక్క వేరు. పుష్ప లెక్క వేరు. ప్రేక్షకుల అంచనాలను దాటిన ఎలిమెంట్స్ ‘పుష్ప’లో ఉంటే తప్ప ఇది వైల్డ్ ఫైర్ కాలేదు. అది ‘వైల్డ్ ఫైర్’ అవుతుందో లేక సన్నటి సెగలానే మిగిలిపోతుందో ఈ డిసెంబర్ 5 న తేలిపోతుంది.

Read More
Next Story