యాత్ర - 2 మూవీ రివ్యూ
ఒక విషయం అయితే స్పష్టం. యాత్ర సినిమా ఒక స్పష్టమైన విధానంతో, క్లారిటీతో తీసిన సినిమా. దర్శకుడు మహి దాన్ని చాలా చక్కగా తీశాడు.
" దేవుడన్నది నమ్మకం. వైయస్సార్ అన్నది నిజం" అని యాత్ర2 ("యాత్ర" సినిమా కు సీక్వెల్) సినిమా లో మొదట్లోనే ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని ఈ సినిమాకు అనువదిస్తే " మహి సినిమా బాగా తీస్తాడన్నది నమ్మకం. ఎలా ఉందన్నది నిజం" అని చెప్పవచ్చు. అయితే ఒక్క మాటలో అలా తేల్చేయడం కరెక్ట్ కాదు.
ఇంతకుముందు వైయస్సార్ జీవిత చరిత్ర మీద ఆధారపడి తీసిన “యాత్ర” సినిమా బాగుండడంతో పాటు, చాలా వరకు విజయవంతమైన సినిమా. దానికి సీక్వెల్ గా వచ్చిన సినిమా యాత్ర2 ను మహి రాఘవ బాగానే తీసే ప్రయత్నం చేసినప్పటికీ, మొదటి సినిమానే బాగుంది అనిపించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మొదటి సినిమాలో ముమ్ముట్టి నటన, స్క్రీన్ ప్రెసెన్స్, అప్పటి రాజకీయ పరిస్థితులు, కథను నడిపించిన విధానం అన్ని బాగున్నాయి.. అవన్నీ ఈ సినిమాలో అంతగా కనిపించలేదు (ముమ్ముట్టి పాత్ర కూడా ఎక్కువ సేపు లేదు).
సాధారణంగా సీక్వెల్స్ తో ఒక ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే మొదట వచ్చిన సినిమాతో దీన్ని పోల్చుకోవడం. యాత్ర2 కి కూడా అదే జరగొచ్చు. బయోపిక్ లు తీసేటప్పుడు చాలా విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. అందునా వైయస్ రాజశేఖర్ రెడ్డి అనే ఒక నాయకుడి బయోపిక్ అంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. ఒక విషయం అయితే స్పష్టం. యాత్ర సినిమా ఒక స్పష్టమైన విధానంతో, క్లారిటీతో తీసిన సినిమా. దర్శకుడు మహి దాన్ని చాలా చక్కగా తీశాడు. సీక్వెల్ కి వచ్చేటప్పటికి కొంత క్లారిటీ తగ్గినట్లు అనిపించింది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే యాత్ర2 కన్నా యాత్ర నే కొంచెం బాగుంది. అలాగని యాత్ర 2 సినిమాని తక్కువ చేయవలసిన అవసరం లేదు. రెండిట్లోనూ దర్శకుడు మహి తన ప్రతిభను చూపించాడు. మొదటి సినిమాలో ఉన్న వేగం, స్పష్టత రెండవ సినిమాకు వచ్చేటప్పటికి కొంచెం తగ్గిపోయింది. పైగా ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. సరిగ్గా ఎలక్షన్లకు ముందు 8.2.2019 యాత్ర సినిమాని రిలీజ్ చేశారు. మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత అదే తేదీన, ఎలక్షన్లకు ముందు అంటే 8.2.2024 న యాత్ర2 విడుదల చేయడం యాదృచ్ఛికం, సెంటిమెంట్ మాత్రం కాదని, ఇది కేవలం ఎన్నికల కోసమే రిలీజ్ చేశారని అనిపించడం సహజం.
ప్రేక్షకులు ఈ సినిమాను ఎలక్షన్ల కోసమే విడుదల చేశారన్న భావనతో చూడడం జరుగుతుంది. అప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద స్థాయిలో కనపడతాయి. విడుదలకు ముందే ఈ సినిమా నెగిటివ్ ఫీలింగ్ ని మూట కట్టుకుంది. ఒక వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా ఒక పండగలా అనిపిస్తుంది. రాజకీయ కోణం, కంపారిజన్ పక్కన పెడితే, ఒక గొప్ప నాయకుడి జీవితం మీద ఆధారపడి తీసిన ఈ సీక్వెల్ మాత్రం కొంతవరకు పర్వాలేదనిపిస్తుంది. అలా చెప్పడానికి ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి. మొదటిది, దర్శకుడు మహి ఎన్నో పరిమితులను అధిగమించి తన వంతుగా చేసిన కృషి. అది స్క్రీన్ మీద కనబడుతుంది. అలాగే, జీవా తో పాటు కొంతమంది మిగతా నటీనటుల, ఎంపిక, నటన బాగుండడం. నేపథ్య సంగీతం, పాటలు,( ఒకటి అరా అర్థవంతంగా ఉన్నాయి) మది ఫోటోగ్రఫీ(ముఖ్యంగా లాంగ్ షాట్స్, జన సందోహాన్ని చిత్రీకరించడం, ఇతర సన్నివేశాల చిత్రీకరణలో మది ఫోటోగ్రఫీ ఎఫెక్టివ్ గా ఉంది.) విజువల్ ఎఫెక్ట్స్ వాడకుండా, చాలా సన్నివేశాల్లో నిజంగానే జనాన్ని సమీకరించడం లో నిర్మాతలు, ప్రొడక్షన్ టీం పడిన కష్టం.. ఆ సన్నివేశాలన్నీ ఎఫెక్టివ్ గానే ఉన్నాయి. అందుకు వారిని అభినందించాలి.
ఈ సినిమాకు దర్శకుడు మహి( రచయిత కూడా) చాలా చోట్ల మంచి డైలాగులు రాసుకున్నాడు. మొదట్లో మమ్ముట్టి చెప్పిన " నాయకుడిని ఓడించాలనుకుంటాను, నాశనం చేయాలనుకోను", " రుణమైన, సాయమైన ఈ జన్మలోనే తీర్చుకోవాలి" లాంటి డైలాగులు ఏ వర్గం ప్రేక్షకులకు అయినా నచ్చుతాయి. ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న రాజకీయ నాయకుడి పాత్ర (శుభలేఖ సుధాకర్) ద్వారా చెప్పించిన " పిల్లిని అడవిలో వదిలినా అది పిల్లే, పులిని బోలో పెట్టిన అది పులే సార్" , “ నాయకులకు తెలిసిన రాజకీయం కార్యకర్తలకు తెలియదు సార్", “"ఎన్నో యుద్ధాలు భయంతో, బలంతో గెలిచారు. వీడు మాత్రం సంకల్పంతో గెలిచాడు" లాంటి డైలాగులు, థియేటర్లో చప్పట్లు, ఈలలకు కారణం అవ్వచ్చు. ఈ మధ్యకాలంలో శుభలేఖ సుధాకర్ ఇలాంటి పాత్రలు వేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. జగన్ పాత్ర వేసిన జీవా కు రాసిన డైలాగులు కూడా బాగున్నాయి. అలాగే గుండెను తాకే ఒక సన్నివేశంలో జీవా చెప్పిన " నేను ఉన్నాను నేను విన్నాను. " అని చెప్పిన వన్ లైనర్ చాలా బాగుంది. అలాంటి ఇంకా కొన్ని డైలాగుల్ని జీవా ఎఫెక్టివ్ గానే చెప్పాడు .
ఈ సందర్భంగా ఇంకో విషయం చెప్పాలి హై కమాండ్ మేడం(అంటే అందరికీ తెలుసు) పాత్ర కు నటిని ఎంపిక చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. జర్మనీకి చెంది మనదేశంలో ఉంటున్న నటి సుజానే బెర్నెట్ ఈ పాత్రకు పర్ఫెక్ట్ గా ఉంది. చక్కటి ఎక్స్ప్రెషన్ తో ఆ పాత్రకు న్యాయం చేసినప్పటికీ, ఈమెతో తీసిన సన్నివేశాలు ఎక్కువగా ఉండటమే కాకుండా, పేలవంగా ఉండడం సినిమాకు నెగిటివ్ గా మారాయి.
ఈ సినిమా వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో మొదలవుతుంది. ఆ తర్వాత జగన్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రోశయ్యని ముఖ్యమంత్రిగా నియమించడం, ఆ తర్వాత జగన్ ఒంటరిగా చేసే ప్రయత్నాలు, జైలు జీవితం, ఓదార్పు యాత్ర, హై కమాండ్ తో వైరుధ్యం, చివరికి విజయం సాధించడం అన్నదే యాత్ర2 కథ. ఇది అందరికి తెలిసిన కథ.
ఈ సినిమాలో చెప్పుకోదగ్గ అంశాలు మరి కొన్ని ఉన్నాయి. మొదటిది నటీనటుల ఎంపిక. జగన్ తల్లి పాత్రలో నటించిన అశ్రిత వేముగంటి ఆ పాత్రకు సరిపోయింది. జగన్ భార్య భారతి పాత్రలో నటించిన కేతకి నారాయణ చాలా మటుకు భారతి లాగే ఉండడం విశేషం.
సినిమాకు సర్ప్రైజ్ ప్యాకేజ్, కొంత జగన్ పోలికలతో కనిపించిన తమిళ నటుడు జీవా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. మెచ్చుకోదగ్గ స్థాయిలో నటించాడు. జగన్ పాత్రకు సరైన నటుడు అనిపించాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్తిగా జగన్ ను అనుకరించకుండా తనదైన శైలిలో నటించడం ప్రశంసించదగ్గది. ఆ పాత్రకు చాలా వరకు న్యాయం చేశాడు.తన నటనతో సినిమాకు కొంత ఊతం ఇచ్చాడు.
మిగతా పాత్రలు కూడా అలాగే ఉంటాయి. వాటిలో వేసిన నటులు కొంతమంది చాలా బాగా చేశారు. అయితే కొన్ని పాత్రల చిత్రీకరణ సరిగ్గా జరగలేదు. ఎప్పుడైనా సరే నాయక ప్రతినాయక పాత్రలను సరిగ్గా మలచకపోతే సినిమాకు అది మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఇందులో కూడా అదే జరిగింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పాత్ర. బాలీవుడ్ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ బాగానే చేసినప్పటికీ, పాత్ర ఔచిత్యం దెబ్బతింది. అంత ముఖ్యమైన పాత్రను సరిగ్గా మలచడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అది సినిమాకు కొంతవరకు మైనస్ అయింది. చివర్లో ఆ పాత్రకు కొంత ప్రాముఖ్యత ఇచ్చి సరి చేసే ప్రయత్నం సఫలం కాలేదు.
ఇక జగన్ చిన్నతనంలో, వైయస్జ,గన్ మీద చిత్రీకరించిన సన్నివేశాలు కొన్ని అర్థవంతంగా, బాగా ఉన్నాయి. అలాగే పెద్దయ్యాక, బోరును వర్షం కురుస్తున్నప్పుడు జగన్, వైయస్ మీద చిత్రీకరించిన ఒక సన్నివేశం సింపుల్ గా బావుంటుంది. అదే జగన్ చివరిసారి వైఎస్ ను చూడడం అనుకోవచ్చు. ఇది దర్శకుడు మహి ప్రతిభ!
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా యాత్ర2 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశాలు తక్కువే. అక్కడక్కడ సినిమా బావుంది అనిపించినప్పటికీ మొత్తంగా చూస్తే మాత్రం అంతగా ఎఫెక్టివ్ గా అనిపించదు. అయితే ఒక వర్గం ప్రేక్షకులకి సినిమా చాలా బాగా నచ్చుతుందని ఎవరైనా చెప్పగలరు.
నంబర్లు ర్యాంకింగ్ లతో సంబంధం లేకుండా చెప్పాలంటే యాత్ర2 సినిమా కొంతవరకు పర్వాలేని, ఓ మాదిరి సినిమా.
నటీ నటులు:ముమ్ముట్టి, జీవ, సుజానే బెర్నార్ట్, మహేష్ మంజ్రేకర్ వేముగంటి అశ్రిత,కేతకి నారాయణ తదితరులు
రచన,దర్శకత్వం: మహి రాఘవ వి
సంగీతం: సంతోష్ నారాయణన్
ఫోటోగ్రఫీ: మధీ
ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని
నిర్మాత: శివ మేక
నిర్మాణ సంస్థ: త్రీ ఆటం లీవ్స్
Next Story